త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fertiliser | ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులున్నయ్‌.. రైతులు ఆందోళన చెందొద్దన్న కేంద్రం..!

Fertiliser | రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు ఆందోళనకు గురై ముందస్తుగా అధికంగా ఎరువులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ ఎస్‌ శర్మ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైనన్ని ఎరువులు ఉన్నాయని.. ప్రస్తుతం 51శాతానికిపైగా ఉన్నట్లు తెలిపారు.

P

National | Published On May 12, 2026, 7.05 am IST

Fertiliser | ఖరీఫ్‌కు అవసరమైన ఎరువులున్నయ్‌.. రైతులు ఆందోళన చెందొద్దన్న కేంద్రం..!
Advertisement

Fertiliser | రానున్న ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రైతులు ఆందోళనకు గురై ముందస్తుగా అధికంగా ఎరువులు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ ఎస్‌ శర్మ మాట్లాడుతూ ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైనన్ని ఎరువులు ఉన్నాయని.. ప్రస్తుతం 51శాతానికిపైగా ఉన్నట్లు తెలిపారు. సాధారణంగా ఉండే 33 శాతం బఫర్‌ స్టాక్‌తో పోలిస్తే ఇది గణనీయంగా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రసాయన ఎరువుల వినియోగాన్ని 50 శాతం తగ్గించి సేంద్రియ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో కేంద్ర ఈ ప్రకటన చేసింది. కొన్ని ప్రాంతాల్లో రైతులు ఆందోళనతో ఎక్కువగా ఎరువులు కొనుగోలు చేస్తున్నారని, అయితే తగిన నిల్వలు అందుబాటులో ఉన్నందున భయపడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలు, మళ్లింపులను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని వెల్లడించారు.

స్థిరంగా ధరలు..

అంతర్జాతీయ మార్కెట్లో యూరియా వంటి ఎరువుల ధరలు దాదాపు రెండింతలు పెరిగినా దేశీయంగా ఎంఆర్‌పీ ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయని అపర్ణ శర్మ తెలిపారు. ఎరువుల కంపెనీలకు సబ్సిడీ బిల్లులను దశలవారీగా చెల్లించి, ఆర్థిక ప్రవాహాన్ని కొనసాగిస్తామని చెప్పారు. ఖరీఫ్‌ 2026 సీజన్‌కు మొత్తం 390.54 లక్షల టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దేశీయ ఉత్పత్తికి తోడు దిగుమతుల ద్వారా సరఫరా పెంచుతున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే 7 లక్షల టన్నుల ఎన్‌పీకే కాంప్లెక్స్‌లు, 12 లక్షల టన్నుల డీఏపీ, 4 లక్షల టన్నుల ట్రిపుల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌, 3 లక్షల టన్నుల అమ్మోనియం సల్ఫేట్‌ దిగుమతులను ఖరారు చేసినట్లు తెలిపింది. ఇటీవలి సంక్షోభ పరిస్థితుల తర్వాత దేశీయ ఉత్పత్తి 76.78 లక్షల టన్నులకు, దిగుమతులు 19.94 లక్షల టన్నులకు చేరాయని, మొత్తం అందుబాటులో దాదాపు 97 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఉన్నాయని కేంద్రం పేర్కొంది.

బ్లాక్‌ మార్కెటింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

వేపపూత యూరియా 45 కిలోల సంచికి రూ.242గా, డీఏపీ 50 కిలోల సంచికి రూ.1,350గా ధర నిర్ణయించినట్లు వెల్లడించింది. యూరియా కర్మాగారాలు పూర్తిస్థాయిలో పనిచేస్తుండగా.. ఫాస్ఫరస్‌-పొటాష్‌ ఎరువుల ఉత్పత్తి కూడా సాధారణంగానే కొనసాగుతోందని తెలిపింది. ఎరువుల పరిస్థితిని కార్యదర్శుల సాధికార బృందం ప్రతి వారం సమీక్షిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. రైతులు ఆందోళనతో అధిక కొనుగోళ్లు చేయవద్దని, అవసరమైన నిల్వలు అందుబాటులో ఉన్నాయని మరోసారి స్పష్టం చేసింది. అలాగే ఎరువుల అక్రమ నిల్వలు, బ్లాక్‌మార్కెటింగ్‌, మళ్లింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది.

Advertisement
Advertisement