త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | సీఎం కుర్చీ కోసం విప్ల‌వం అక్క‌ర్లేదు.. డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

DK Shivakumar | కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాయకత్వ మార్పుపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను సహనంతో వ్యవహరిస్తున్నానని, ఎలాంటి విప్లవం సృష్టించే, పోరాటం చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు.

P

National | Published On Mar 4, 2026, 6.45 pm IST

DK Shivakumar | సీఎం కుర్చీ కోసం విప్ల‌వం అక్క‌ర్లేదు.. డీకే శివ‌కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
Advertisement

DK Shivakumar | కర్ణాటకలో గత కొన్ని రోజులుగా నాయకత్వ మార్పుపై చర్చ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంగళవారం మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి విషయంలో తాను సహనంతో వ్యవహరిస్తున్నానని, ఎలాంటి విప్లవం సృష్టించే, పోరాటం చేసే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న డీకే శివకుమార్ నాయకత్వ మార్పు అంశంపై తాను ఎప్పుడూ బహిరంగ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఏవైనా చర్చలు ఉంటే అవి తనకు, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ హైకమాండ్‌కే పరిమితమని పేర్కొన్నారు. “ఇప్పటి వరకు సీఎం పదవి విషయంపై నేను ఎక్కడా మాట్లాడలేదు. ఆ పదవి ఖాళీగా ఉంటేనే ఎవరికైనా ఇవ్వగలరు. ఖాళీ చేయాలని నేను ఎప్పుడూ చెప్పలేదు” అని విలేకరులతో వ్యాఖ్యానించారు.

ఫోన్ ట్యాపింగ్ గురించి తెలియ‌ద‌న్న డీకే..

పార్టీలో అంతర్గత పోరు జరుగుతోందన్న వార్తల మధ్య, తన వర్గంపై ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో డీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్యాపింగ్‌పై తనకు ఎలాంటి సమాచారం లేదన్న ఆయన, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హోంమంత్రి జి. పరమేశ్వర ఇప్పటికే స్పందించారని గుర్తు చేశారు. తాను పార్టీ క్రమశిక్షణ మేరకు నడుస్తున్నానని, రాష్ట్ర అధ్యక్షుడిగా పార్టీకి అన్యాయం చేశానని ఎవరూ అనుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తన వల్ల లక్షలాది మంది కార్యకర్తలు ఇబ్బందులు పడకూడదని చెప్పారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఒత్తిడి రాజకీయాలు చేయడం తనకు ఇష్టం లేదని, కాంగ్రెస్‌కు ఇబ్బంది కలిగించే చర్యల జోలికి వెళ్లబోనని తేల్చిచెప్పారు.

ఎవ‌రితోనూ మాట్లాడ‌లేదు..

నాయకత్వ అంశంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ చర్చించినట్లుగా వచ్చిన వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. తాను ఎవరితోనూ మాట్లాడలేదని స్పష్టం చేశారు. బడ్జెట్ తర్వాత మార్పులు జరుగుతాయా? అని ప్రశ్నించగా, కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని పేర్కొన్నారు. తనను ఆకర్షించేందుకు బీజేపీ, జేడీఎస్ ప్రయత్నిస్తే అది ‘పగటి కల’ మాత్రమేనన్న సిద్ధరామయ్య వ్యాఖ్యపై స్పందిస్తూ, తనతో ఉన్న అనుభవంతో ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేసి ఉండవచ్చన్నారు. తనను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరిగాయా? అన్న ప్రశ్నకు “ఆ విషయం మీద మరోసారి కథ రాస్తాను” అంటూ చమత్కరించారు.

కొత్త ఆలోచ‌న‌ల‌కు అవ‌కాశం ఇవ్వాలి..

పార్టీ అంతర్గత పోరాటం తన లక్ష్యం కాదని, తాను “స్ట్రీట్ ఫైటర్”నని, ఎలా పోరాడాలో తెలుసని కానీ అధికారం కోసం కాదన్నారు. తాను మౌనంగా ఉన్నానని ఎవరైనా అనుకుంటే అది వారి అభిప్రాయం మాత్రమేనన్నారు. పార్టీలో మార్పుకు తాను సిద్ధమని, కొత్త రక్తం, కొత్త ఆలోచనలకు అవకాశం ఇవ్వాలని అభిప్రాయపడ్డారు. కేపీసీసీ అధ్యక్షుడిగా ఆరు సంవత్సరాలు పనిచేయడం సరిపోతుందని పేర్కొంటూ, మార్చి 10న ఆరు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా విందు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఖండించారు. తమ మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని, తమ అనుబంధం పాలు-తేనెలా ఉందని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement