త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Musical Road | దేశంలోనే తొలి మ్యూజిక‌ల్ రోడ్‌..! ఎక్క‌డ నిర్మించారో తెలుసా?

Musical Road | దేశంలోనే తొలిసారంగా మ్యూజిక‌ల్ రోడ్‌ని ఏర్పాటు చేశారు. ముంబ‌యి కోస్ట‌ల్ ఏరియాలో ఈ రోడ్‌ని నిర్మించారు. వాహనదారులు నిర్ణీత వేగంతో వెళ్తున్న స‌మ‌యంలో సంగీతం వినిపించేలా రూప‌క‌ల్ప‌న చేశారు. వినూత్న అనుభవంతో పాటు రహదారి భద్రతను పెంచేందుకు ఈ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్లు ఒకే వేగంతో ప్రయాణించేలా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశమ‌ని చెప్పారు.

P

National | Published On Feb 11, 2026, 5.56 pm IST

Musical Road | దేశంలోనే తొలి మ్యూజిక‌ల్ రోడ్‌..! ఎక్క‌డ నిర్మించారో తెలుసా?
Advertisement
  • ముంబ‌యి కోస్ట‌ల్ ఏరియాలో నిర్మాణం
  • రూ.6.21కోట్లు వెచ్చించిన బీఎంసీ
  • ప్రారంభించిన సీఎం ఫ‌డ్న‌విస్‌

Musical Road | దేశంలోనే తొలిసారంగా మ్యూజిక‌ల్ రోడ్‌ని ఏర్పాటు చేశారు. ముంబ‌యి కోస్ట‌ల్ ఏరియాలో ఈ రోడ్‌ని నిర్మించారు. వాహనదారులు నిర్ణీత వేగంతో వెళ్తున్న స‌మ‌యంలో సంగీతం వినిపించేలా రూప‌క‌ల్ప‌న చేశారు. వినూత్న అనుభవంతో పాటు రహదారి భద్రతను పెంచేందుకు ఈ ప్ర‌య‌త్నం చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్లు ఒకే వేగంతో ప్రయాణించేలా ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశమ‌ని చెప్పారు.

ఎలా ప‌ని చేస్తుందంటే..?

ఈ మ్యూజిక‌ల్ రోడ్‌ని నారిమ‌న్ పాయింట్ నుంచి వైపు వెళ్లే నార్త్ లైన్‌లో ఏర్పాటు చేశారు. వ‌ర్లీ అండ‌ర్‌గ్రౌండ్ ట‌న్నెల్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత ఈ మ్యూజిక‌ల్ రోడ్ ప్రారంభ‌మ‌వుతుంది. డివైడర్ పక్కనున్న తొలి లేన్‌లో సుమారు 500 మీటర్ల పొడవున సంగీతం వ‌చ్చేందుకు ప్ర‌త్యేకంగా స్ట్రిప్స్‌ని ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో ఒకే దూరంలో నిర్దిష్ట కొల‌త‌ల‌తో స్ట్రిప్స్ వేశారు. వీటినే రంబుల్ స్ట్రిప్స్ అంటారు. ఒక వాహ‌నం గంట‌కు 70 నుంచి 80 కిలోమీట‌ర్ల వేగంతో ఈ స్ట్రిప్స్‌పై నుంచి వెళ్లిన స‌మ‌యంలో టైర్ల రాప‌డితో శ‌బ్ద త‌రంగాలు ఏర్ప‌డి ఓ స్వ‌రాన్ని వినిపిస్తాయి. దాంతో వాహ‌న‌దారుల‌కు స్ల‌మ్‌డాగ్ మిలియ‌నీర్ చిత్రంలో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న జ‌య హో పాట వినిపిస్తుంది. అయితే, వాహ‌నం సూచించిన వేగంగా కంటే ఎక్కువ వెళ్లినా.. త‌గ్గినా వినిపించే సౌండ్ మారుతుంద‌ని.. ఇది డ్రైవ‌ర్ల‌కు వేగం స‌రిచేసుకునేందుకు సంకేతంగా ప‌ని చేస్తుంద‌ని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మ్యూజిక‌ల్ రోడ్‌లో వెళ్లే క్ర‌మంలో డ్రైవ‌ర్ల‌కు ముంద‌స్తుగా స‌మాచారం ఇచ్చేందుకు ట‌న్నెల్‌లో హెచ్చ‌రిక బోర్డులు ఏర్పాటు చేశారు. లైన్‌, వేగం విష‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు.

రంబుల్ స్ట్రిప్స్‌..

రంబుల్ స్ట్రిప్స్‌ను ప్ర‌పంచ‌వ్యాప్తంగా డ్రైవ‌ర్ల‌కు హెచ్చ‌రిక‌లు ఇచ్చేందుకు ఉప‌యోగిస్తుంటారు. ముంబ‌యి కోస్ట‌ల్ రోడ్ ద‌క్షిణ ముంబ‌యిని, వెస్ట్ న‌గ‌రంతో ట‌న్నెల్స్‌, స‌ముద్ర తీర మార్గాల‌తో క‌లుపుతుంది. జపాన్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కూడా ఇలాంటి మ్యూజికల్ రోడ్లు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. జ‌య హో పాట‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. మ్యూజిక‌ల్ రోడ్‌ని మాజీ ఎంపీ రాహుల్ శేవాలే ప్ర‌తిపాదించారు. బృహ‌న్ ముంబ‌యి మున్సిప‌ల్ కార్పొరేష‌న్ స‌మ‌న్వ‌యంతో ఈ ప్రాజెక్టును అమ‌లులోకి తీసుకువ‌చ్చారు. అయితే, అధికారులు ప్ర‌యాణ అనుభ‌వం పెంచేందుకు ఈ మ్యూజిక్ రోడ్‌ని వేశామ‌ని పేర్కొంటున్నారు. ఇది డ్రైవ‌ర్ల దృష్టిని మ‌ళ్లిస్తుందా? అక‌స్మాత్తుగా బ్రేక్‌లు వేయ‌డం, లైన్ మార్చ‌డం త‌దిత‌ర స‌మ‌స్య‌లు ఏవైనా ఉత్ప‌న్న‌మ‌వుతాయా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రూ.6.21కోట్ల‌తో..

ఈ ర‌హ‌దారిని ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ బుధ‌వారం ప్రారంభించారు. బీఎంసీ దాదాపు ఈ ప్రాజెక్టు కోసం రూ.6.21కోట్లు వెచ్చించింది. ముంబయి కోస్టల్ రోడ్‌ కారిడార్ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. భార‌త్‌లో ఇదే తొలి మ్యూజిక‌ల్ రోడ్‌గా పేర్కొంటున్నారు. బీఎంసీ కోస్టల్ రోడ్డు ప్రాజెక్ట్‌లో భాగంగా దక్షిణ ముంబయిలోని మెరైన్ లైన్స్ నుంచి ఉత్తర శివారు ప్రాంతం దహిసర్ వరకు 29.2 కి.మీ మేర రోడ్డును నిర్మించింది. ఇందుకు రూ.14వేల కోట్లు ఖ‌ర్చు చేసింది. ఇందులోనే కొన్ని నిధులు మ్యూజిక‌ల్ రోడ్ నిర్మాణానికి వినియోగించారు.

Advertisement
Advertisement