త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon | ఈ సారి మాన్‌సూన్‌లో వర్షాలు లేనట్టే..! హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ..!

Monsoon | నైరుతి రుతుపవనాల సీజన్‌ దక్షిణాసియాకు, ముఖ్యంగా భారత్‌కు సవాల్‌గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగే రుతుపవన వర్షపాతం సాధారణ స్థాయికి తగ్గే అవకాశాలు ఉన్నాయి.

P

National | Published On May 3, 2026, 2.05 pm IST

Monsoon | ఈ సారి మాన్‌సూన్‌లో వర్షాలు లేనట్టే..! హెచ్చరించిన ప్రపంచ వాతావరణ సంస్థ..!
Advertisement

Monsoon | నైరుతి రుతుపవనాల సీజన్‌ దక్షిణాసియాకు, ముఖ్యంగా భారత్‌కు సవాల్‌గా మారే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) తాజా అంచనాల ప్రకారం.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య జరిగే రుతుపవన వర్షపాతం సాధారణ స్థాయికి తగ్గే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో పగలు మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు సాధారణానికి మించి కొనసాగవచ్చని హెచ్చరించింది. భారత వాతావరణ శాఖ (IMD) కూడా ఏప్రిల్ 13న విడుదల చేసిన దీర్ఘకాలిక అంచనాల్లో.. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణం కంటే బలహీనంగా ఉండే సూచనలు ఉన్నాయని పేర్కొంది. వర్షపాతం తగ్గడం, ఉష్ణోగ్రతలు పెరగడం కలిసి వ్యవసాయం, తాగునీటి లభ్యత, విద్యుత్ వినియోగం, అలాగే సాధారణ జీవనంపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మధ్య భారత్‌లో వ్యవసాయాధారిత ప్రాంతాలపై ఈ ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా.

కొన్ని చోట్ల సాధారణం..

అయితే, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉత్తర పశ్చిమ భారత్, ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ భారత్‌లోని పలు చోట్ల సాధారణం, సాధారణం కంటే ఎక్కువగానే వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. దక్షిణాసియాలో సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం వార్షిక వర్షపాతం లో సుమారు 75 నుంచి 90 శాతం వరకు నమోదవుతుంది. ఈ కీలక కాలంలో వర్షాలు తగ్గితే నేరుగా వ్యవసాయ ఉత్పత్తిపై, నీటి నిల్వలపై, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, పాకిస్థాన్‌లో సాగు ప్రారంభ దశలోనే వాతావరణ అనిశ్చితి కనిపించడంతో రైతుల్లో ఆందోళన పెరిగే అవకాశం ఉంది.

ఒకవైపు ఎండలు, మరోవైపు ఆకస్మిక వర్షాలు

ఈ ఏడాది రుతుపవనాలు సమతుల్యంగా కాకుండా అస్థిరంగా ఉండే అవకాశం ఉందని డబ్ల్యూఎంవో పేర్కొంది. అంటే ఒకవైపు కొన్ని ప్రాంతాల్లో దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండగా.. మరోవైపు కొద్ది రోజుల వ్యవధిలోనే అత్యంత భారీ వర్షాలు కురిసే పరిస్థితులు కూడా ఏర్పడే ఛాన్స్‌ ఉందని హెచ్చరించింది. ఇలాంటి అసమతుల్య వర్షపాతం కారణంగా వరదలు సంభవించే ప్రమాదం పెరుగుతుందని, అలాగే కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన నీటి కొరత కూడా ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంటే ఒకే సీజన్‌లో రెండు పరస్పర విరుద్ధ పరిస్థితులు కనిపించే అవకాశం ఉందన్న మాట.

ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఆరోగ్యంపై ప్రభావం

దక్షిణాసియాలో పగటి ఉష్ణోగ్రతలు మాత్రమే కాకుండా రాత్రి ఉష్ణోగ్రతలు కూడా సాధారణానికి మించి ఉండే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. దీని ప్రభావంగా రాత్రి వేళల్లో కూడా వేడి తగ్గకపోవడం సాధారణ ప్రజలకు ఇబ్బందిగా మారుతుందని అంచనా వేసింది. నిరంతరంగా అధిక ఉష్ణోగ్రతలు కొనసాగితే హీట్‌వేవ్ ఘటనలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు. ఎయిర్ కండిషనర్లు, ఫ్యాన్లు వంటి పరికరాల వినియోగం పెరగడంతో విద్యుత్ సరఫరా వ్యవస్థపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

ఎల్ నినో ప్రభావం కొనసాగవచ్చని అంచనా

ఈ రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కొనసాగవచ్చని ప్రపంచ వాతావరణ సంస్థ పేర్కొంది. ఎల్ నినో అనేది పసిఫిక్ మహాసముద్రం తూర్పు భాగంలో సముద్ర ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ పరిణామం. ఈ మార్పు ప్రపంచవ్యాప్తంగా గాలుల ప్రవాహం, వర్షపాతాన్ని ఇది ప్రభావితం చేస్తుంది. భారత్‌లో ఎల్ నినో సాధారణంగా వర్షపాతాన్ని తగ్గిస్తుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ ఏడాది కూడా వర్షాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘స్ప్రింగ్ ప్రిడిక్టబిలిటీ బారియర్’ అనే దశ కొనసాగుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఇది మార్చి నుంచి మే మధ్యకాలంలో సముద్రం, వాతావరణ వ్యవస్థల్లో వేగంగా మార్పులు చోటుచేసుకునే సమయం. ఈ సమయంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారడం వల్ల దీర్ఘకాలిక వాతావరణ అంచనాలు మరింత అనిశ్చితంగా మారుతాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో 2026 రుతుపవన సీజన్‌ను అత్యంత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Advertisement