త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IMD | మేలో సాధార‌ణం కంటే ఎక్కువ‌గానే హీట్‌వేవ్స్‌.. హెచ్చ‌రించిన భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ‌..!

P

National | Published On May 1, 2026, 5.52 pm IST

IMD | మేలో సాధార‌ణం కంటే ఎక్కువ‌గానే హీట్‌వేవ్స్‌.. హెచ్చ‌రించిన భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ‌..!
Advertisement

IMD | దేశంలో మే నెల వాతావరణ పరిస్థితులపై భారత వాతావరణ శాఖ (IMD) కీలక అంచనాల‌ను వెల్ల‌డించింది. సాధారణం కంటే ఎక్కువగా హీట్‌వేవ్స్ నమోదయ్యే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. హిమాల‌య ప్రాంత రాష్ట్రాలు, తూర్పు తీర రాష్ట్రాలు, గుజరాత్, మహారాష్ట్రలో ఎండ‌లు తీవ్రంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది. వర్షపాతం విషయానికి వస్తే దేశవ్యాప్తంగా మే నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తూర్పు భారత్, ఈశాన్య రాష్ట్రాలు, తూర్పు-మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వెల్లడించింది. ఐఎండీ డీజీ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ మే నెలలో దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. దాంతో రాత్రి వేళల్లో కూడా వేడి నుంచి పెద్దగా ఉపశమనం ఉండ‌క‌పోవ‌చ్చ‌న్నారు.

అయితే, వాయవ్య భారతం, మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతాల సమీప ప్రాంతాలు, ఈశాన్య భారత దక్షిణ భాగాల్లో మాత్రం కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం లేదా తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఏప్రిల్ 30 నాటికి దేశంలోని ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు వేగంగా పెరిగాయ‌న్నారు. విదర్భ, తెలంగాణ, మరాఠ్వాడ, పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్‌గఢ్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. దేశంలోని మిగతా ప్రాంతాల్లో 34 నుంచి 38 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ వివ‌రించింది. తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, ఉపహిమాలయ పశ్చిమ బెంగాల్-సిక్కిం ప్రాంతాలు, ఈశాన్య భారతం, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీల కంటే తక్కువగా న‌మోద‌య్యాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో దేశంలో అత్యధికంగా 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత న‌మోదైంద‌ని ఐఎండీ పేర్కొంది.

Advertisement
Advertisement