త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Rains | విషాదం: సెల్ ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి దుర్మరణం

ముంబైలో భారీ వర్షాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపై తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ ఓ వ్యక్తి ప్రాణాలు బలిగొంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే దీనికి కారణమా?

J

National | Published On Jul 2, 2026, 3.51 pm IST

Mumbai Rains | విషాదం: సెల్ ఫోన్ మాట్లాడుతూ మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి దుర్మరణం
Advertisement
  • ముంబైలో కురుస్తున్న భారీ వర్షాలకు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి అస్లాం షేక్ (55) అనే వ్యక్తి మృతి
  • ఖైరానీ రోడ్డులో మొబైల్ మాట్లాడుకుంటూ వెళ్తుండగా ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయిన వైనం
  • రెండు గంటల పాటు గాలించి మృతదేహాన్ని వెలికితీసిన ఫైర్ బ్రిగేడ్ రెస్క్యూ టీమ్
  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రైవేట్ కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేస్తామన్న ముంబై కార్పొరేషన్ (BMC)

Mumbai Rains | త్రినేత్ర.న్యూస్ : ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం కావడంతో పాటు, అధికారుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల మీదకు తెస్తోంది. తాజాగా, అంధేరి ప్రాంతంలోని ఖైరానీ రోడ్డులో తెరిచి ఉన్న ఓ మ్యాన్‌హోల్ (Manhole) లో పడి 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

మృతుడిని అస్లాం ఈసాఫ్ షేక్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన తన మొబైల్ ఫోన్‌లో (Mobile phone) మాట్లాడుతూ నడుచుకుంటూ వెళ్తుండగా, ప్రమాదవశాత్తు ఈ మ్యాన్‌హోల్‌లో పడిపోయినట్లు సమాచారం. ఘటన స్థలంలో అతని గొడుగు, చెప్పులు లభించాయి. అప్రమత్తమైన ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, 108 అంబులెన్స్ సిబ్బంది వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల శ్రమ అనంతరం అతని మృతదేహాన్ని వెలికితీశారు. హుటాహుటిన రాజావాడి హాస్పిటల్‌కు (Rajawadi Hospital) తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

కలకలం రేపుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం

స్థానికంగా ఓ ప్రైవేట్ కాంట్రాక్టర్ (Private contractor) ఆధ్వర్యంలో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగానే మ్యాన్‌హోల్ మూత తీసి ఉంచారని అధికారులు తెలిపారు. దీనిపై డిప్యూటీ మేయర్ సంజయ్ ఘాడీ తీవ్రంగా స్పందించారు. ఒక మనిషి మరణానికి కారణమైన సదరు కాంట్రాక్టర్‌పై బీఎంసీ (BMC) తరపున కఠినమైన క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

Man Falls Into Open Manhole While Talking on Phone in Mumbai

రెండు రోజుల క్రితమే ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో స్కూల్ బస్సుపై చెట్టు కూలి 11 ఏళ్ల బాలుడు మృతి చెందగా, నలుగురు విద్యార్థులు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఓ అధికారిని బీఎంసీ ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ ఘటన మరువక ముందే మరో ప్రాణం గాల్లో కలవడం ముంబై వాసులను భయాందోళనకు గురిచేస్తోంది.

ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు

గురువారం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు దాదర్, పరేల్, వర్లి, గోరెగావ్, అంధేరి లాంటి ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. గత 24 గంటల్లో నగరంలోని పలు ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని బీఎంసీ (BMC) వెల్లడించింది.

తూర్పు శివారు ప్రాంతాల్లో అత్యధికంగా 189 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. శాంతాక్రజ్, భండూప్ ప్రాంతాల్లో ఏకంగా 238.8 మి.మీ వర్షం కురిసింది.

Man Falls Into Open Manhole While Talking on Phone in Mumbai

ట్రాక్‌లపైకి వర్షపు నీరు చేరడంతో ముంబై లైఫ్‌లైన్‌గా భావించే లోకల్ ట్రైన్ (Local train) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే రైళ్లు యథాతథంగా నడుస్తున్నాయని రైల్వే శాఖ చెబుతున్నప్పటికీ.. రైళ్లు 10 నుంచి 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరో రెండ్రోజులు అలెర్ట్

రాబోయే రోజుల్లో ముంబై, దాని శివారు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. తీరప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ సూచించింది. సాధారణం కంటే 13 రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ముంబైని తాకినప్పటికీ, వాటి ప్రభావం నగరంలో స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement