Keralam Assembly Election Results | కేరళం పాయే.. వామపక్షాలకు ఎదురుదెబ్బ..!
- ఎల్‌డీఎఫ్ కూటమి పరాజయం
- కమ్యూనిస్టుల పాలనకు తెర
- దేశంలో ఉనికిని కోల్పోతున్న వామపక్ష పార్టీలు
- శతాబ్ది వేడుకలు జరిగిన ఏడాదిలోనే అధికారానికి దూరం
Keralam Assembly Election Results | త్రినేత్ర.న్యూస్ : కేరళం అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలకు ఎదురుదెబ్బ తగిలింది. ఎల్‌డీఎఫ్ కూటమి దారుణంగా ఓటమిపాలైంది. 140 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కేవలం 35 సీట్లకే పరిమితమైంది. వరుసగా రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పినరయి విజయన్ హ్యాట్రిక్ విజయాన్ని కొట్టాలని భావించగా.. ఆయనకు నిరాశ తప్పలేదు. గతంలో పలు రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతూ వచ్చిన వామపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళం సైతం చేజారిపోయింది. గత జనవరిలో కమ్యూనిస్టుల వందేళ్ల ఉత్సవాలు జరుపుకున్న వామపక్ష పార్టీలకు.. ఈ ఏడాదిలోనే దేశంలో అధికారానికి దూరమవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
కేరళంలో కమ్యూనిస్టుల చరిత్ర..
కేరళం రాష్ట్రం 1956లో ఏర్పాటైంది. మలబార్, కొచ్చిన్, ట్రావెన్‌కోర్ అనే మూడు ప్రధాన రాష్ట్రాలను కలుపగా కేరళంను ఏర్పాటు చేశారు. 1957లో కమ్యూనిస్టుల పాలన మొదలైంది. ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. భూసంస్కరణలు, విద్యా, ఆరోగ్యరంగంలో పలు కీలక నిర్ణయాలతో వామపక్ష పార్టీలు పటిష్టమైన పునాది వేసుకుంది. 1967లో మళ్లీ వామపక్ష కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే, 1980 తర్వాత నుంచి కేరళ రాజకీయాల్లో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ప్రత్యామ్నాయ పాలన ఒక సాంప్రదాయంగా మారుతూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈకే నాయనార్ మూడు దఫాలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వామపక్షాల బలాన్ని మరింత పెంచారు. వీఎస్ అచ్యుతానందన్ నేతృత్వంలో ఎల్‌డీఎఫ్ కూటమి రెండుసార్లు అధికారంలోకి వచ్చింది.
2016లో విజయన్ నేతృత్వంలో..
2016లో పినరయి విజయ్ నేతృత్వంలో ఎల్‌డీఎఫ్ కూటమి అధికారంలో వచ్చింది. 2021లో తిరిగి గెలిచి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టడం ద్వారా కేరళలో సాంప్రదాయ ప్రత్యామ్నాయ పాలనకు ముగింపు పలికినట్లయ్యింది. కేరళలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రిగా విజయన్ ఘనత సాధించారు. రెండోసారి పాలనలో ప్రభుత్వంపై క్రమంగా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావించగా చుక్కెదురైంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి సంపూర్ణ ఆధిక్యంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
కమ్యూనిస్టుల భవిష్యత్‌పై చర్చ..
కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎల్‌డీఎఫ్ కూటమి పరాజయంతో దేశంలో కమ్యూనిస్టుల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. స్వతంత్ర భారత రాజకీయాల్లో చక్రం తిప్పుతూ వచ్చిన వామపక్షాలకు ప్రస్తుతం ఎదురుగాలి వీస్తోంది. 1957లో ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో ఏర్పడిన కమ్యూనిస్ట్ ప్రభుత్వం భారత రాజకీయ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లో 1977 నుంచి 2011 వరకు కొనసాగింది. త్రిపురలో 1978 నుంచి 2018 వరకు వామపక్షాలు సుధీర్ఘకాలం అధికారాన్ని చేపట్టాయి. అయితే, గత దశాబ్ద కాలంగా కమ్యూనిస్టు పార్టీల ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోవడం, త్రిపురలో పరాజయం తర్వాత కేరళ మాత్రమే వామపక్షాలకు ప్రధాన బలమైన రాష్ట్రంగా మిగిలింది. అయితే, బిహార్, పంజాబ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వామపక్షాలు ఉన్నా.. సొంతంగా అధికారాన్ని ఏర్పాటు చేసేంత బలం మాత్రం లేదు. తాజాగా కేరళంలో ఎల్‌డీఎఫ్ కూటమి సైతం అధికారాన్ని కోల్పోవడంతో దేశంలో కమ్యూనిస్టుల పాలనకు ముగింపునకు సంకేతంగా భావిస్తున్నారు.
కమ్యూనిస్టుల ప్రభావం తగ్గుతోందా?
భారత రాజకీయాల్లో గతంలో బలమైన శక్తిగా ఉన్న కమ్యూనిస్టు పార్టీలు నేడు తమ ప్రభావాన్ని క్రమంగా కోల్పోతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం, నిజాం వ్యతిరేక ఉద్యమంలో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, రైతులు, కూలీల హక్కుల కోసం చేసిన పోరాటాలకు చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అయితే, కాలక్రమేణా మారిన రాజకీయ సమీకరణాలు, పెట్టుబడిదారీ విధానం విస్తరణ, ప్రాంతీయ పార్టీల ఆవిర్భావంతో వామపక్షాల ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతూ వచ్చింది. దీనికి తోడు అంతర్గతంగా కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన చీలికలు సైతం బలహీన పరిచాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. సిద్ధాంతపరమైన భేదాలు, సరైన సమన్వయం, నాయకత్వం లేకపోవడం సైతం ప్రభావం చూపిందని పేర్కొంటున్నారు.
దేశంలో కమ్యూనిస్టుల చరిత్ర
భారత్‌లో కమ్యూనిస్టులకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఏడాది జనవరిలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. 1925 డిసెంబర్‌లో సీపీఐ పార్టీ ఏర్పాటైంది. కార్మికులు–కర్షకుల హక్కుల కోసం సాగిన ఎన్నో పోరాటాలు చేసింది. రష్యా అక్టోబర్ విప్లవ ప్రభావంతో ప్రేరణ పొందిన ఎంఎన్‌రాయ్, ఎస్ఏ డాంగే వంటి నేతలతో ప్రారంభమైన కమ్యూనిస్టు ఆలోచన, బ్రిటిష్ వలస పాలనలో రహస్య కార్యకలాపాల రూపంలో ఎదిగింది. అప్పటి నుంచి కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా కార్మిక, రైతాంగ ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించారు.
కీలక ఘట్టాలు..
భారత కమ్యూనిస్టు ఉద్యమం గ్రామీణ రైతాంగ పోరాటాల నుంచి పట్టణ పారిశ్రామిక సమ్మెల వరకు విస్తరించింది. సింగరేణి, ఆర్టీసీ, రైల్వే, బ్యాంకింగ్, విద్యుత్, టెలికాం వంటి రంగాల్లో కార్మిక హక్కుల కోసం జరిగిన సమ్మెల్లో కమ్యూనిస్టు సంఘాల పాత్ర మరువలేనిది. ఎనిమిది గంటల పని విధానం, ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, సెలవులు వంటి కార్మిక హక్కుల వ్యవస్థీకరణలో ఈ ఉద్యమాల ప్రభావం ఉన్నదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అలాగే భూసంస్కరణ ఉద్యమాల్లో కమ్యూనిస్టులు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో సమయంలో దున్నే వానికే భూమి అనే నినాదంతో భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేయగా.. ఈ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. 1964లో కమ్యూనిస్టుల్లో సిద్ధాంతపరంగా విభేదాలు వచ్చాయి. దాంతో 1967లో సీపీఎం పార్టీ ఏర్పాటైంది.
కమ్యూనిజంపై ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఆర్థిక వ్యవస్థ విస్తరించడం, ప్రైవేటీకరణ పెరగడం, సోషలిస్టు దేశాలు కూడా ఆర్థిక విధానాలను మార్చుకోవడం కమ్యూనిస్టు ఉద్యమంపై ప్రభావం చూపింది. రష్యా, చైనా వంటి దేశాలు సైతం మార్కెట్ ఆధారిత ఆర్థిక విధానాల వైపు దృష్టి మళ్లిన నేపథ్యంలో వామపక్ష సిద్ధాంతానికి కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. దేశీయంగా ప్రాంతీయ పార్టీల ఎంట్రీతో కమ్యూనిస్టుల బలం భారీగా తగ్గిపోయింది.
50 ఏళ్ల తర్వాత తొలిసారి..
కేరళలో ఎల్‌డీఎఫ్ కూటమి అధికారాన్ని కోల్పోయింది. దాంతో 1970 తర్వాత దేశంలోని ఏ రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీలో అధికారానికి దూరం కావడం ఇదే తొలిసారి. భారత్‌లో వామపక్ష పార్టీలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. 1951-52లో తొలిసారిగా దేశంలో ఎన్నికలు జరిగిన సమయంలో లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీల్లో సీపీఎంకే ఎక్కువ సీట్లు ఉన్నాయి. 1957లో తొలిసారిగా వామపక్ష పార్టీలు కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి చరిత్ర సృష్టించాయి. ప్రపంచంలోనే తొలిసారిగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1977 పశ్చిమ బెంగాల్‌లో సీపీఐ(ఎం) అధికారాన్ని కైవసం చేసుకుంది. జ్యోతి బసు సీఎం అయ్యారు. 23 సంవత్సరాలకుపైగా ఆ పదవిలో కొనసాగి.. 2000లో బుద్ధదేబ్ భట్టాచార్య సీఎంగా కొనసాగారు. త్రిపురలో సుదీర్ఘంగా అధికారంలో కొనసాగింది. 1993లో వామపక్షాలు అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీలోని 60 స్థానాలలో 44 స్థానాలను సీపీఐ(ఎం) ఒక్కటే గెలుచుకుంది. దశరథ్ దేబ్ 1998 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ తర్వాత మాణిక్ సర్కార్ బాధ్యతలు స్వీకరించి 20 సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎనిమిది, రాజ్యసభలో ఐదుగురు, దేశవ్యాప్తంగా దాదాపు 90 మంది వరకు ఎమ్మెల్యేలు మిగిలారు. ఇందులో అత్యధికం కేరళంలోనే ఎక్కువగా ఉండడం విశేషం.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






