త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

La Niña | ఆశలు రేపుతున్న లానినా!

La Niña | ఎల్‌నినో సెగతో వాతావరణ పరిస్థితులపై ఆందోళన నెలకొన్న వేళ.. వచ్చే ఏడాది వర్షాకాలంపై తాజా అంచ‌నాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనున్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి, వర్షాలకు అనుకూలమైన లానినా ఏర్పడే అవకాశాలు క‌నిపిన్నాయి. 2027 నైరుతి రుతుపవనాల సీజన్‌ నాటికి లానినా పరిస్థితులు అభివృద్ధి చెందవచ్చని హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఐఎన్‌సీఓఐఎస్‌) అంచనా వేసింది.

P

National | Published On Nov 21, 2026, 4.15 pm IST

La Niña | ఆశలు రేపుతున్న లానినా!
Advertisement
  • 2027 మార్చి దాకా కొన‌సాగ‌నున్న ఎల్‌నినో
  • జూన్ నుంచి లానినా అనుకూల ప‌రిస్థితులు
  • ఐఎన్‌సీఓఐఎస్ అంచ‌నాలు

La Niña | ఎల్‌నినో సెగతో వాతావరణ పరిస్థితులపై ఆందోళన నెలకొన్న వేళ.. వచ్చే ఏడాది వర్షాకాలంపై తాజా అంచ‌నాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రస్తుతం పసిఫిక్‌ మహాసముద్రంలో బలపడుతున్న ఎల్‌నినో వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగనున్నప్పటికీ.. ఆ తర్వాత క్రమంగా బలహీనపడి, వర్షాలకు అనుకూలమైన లానినా ఏర్పడే అవకాశాలు క‌నిపిన్నాయి. 2027 నైరుతి రుతుపవనాల సీజన్‌ నాటికి లానినా పరిస్థితులు అభివృద్ధి చెందవచ్చని హైదరాబాద్‌లోని భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (ఐఎన్‌సీఓఐఎస్‌) అంచనా వేసింది. ఏప్రిల్‌-జూన్‌ మధ్య తటస్థ పరిస్థితులు ఏర్పడి.. జూన్‌-ఆగస్టు నుంచి లానినా అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది. సాధారణంగా లానినా భారత రుతుపవనాలకు అనుకూలంగా ఉండటంతో ఈ అంచనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మార్చి వరకు ఎల్‌నినో ప్రభావం..

కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తున్న ఐఎన్‌సీఓఐఎస్‌ తాజా అంచనాల ప్రకారం.. మధ్య, తూర్పు భూమధ్యరేఖా పసిఫిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు నిరంతరం పెరుగుతున్నాయి. 2026 అక్టోబర్‌లో ఇవి 3 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. ఇది బలమైన ఎల్‌నినో పరిస్థితులకు సంకేతమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. సముద్ర ఉపరితలం దిగువన కూడా పలు ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఎల్‌నినో బలపడే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్లు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో-సదరన్‌ ఆసిలేషన్‌ (ఈఎన్‌ఎస్‌ఓ) పరిస్థితులను అంచనా వేసేందుకు ఐఎన్‌సీఓఐఎస్‌ కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత నమూనాను అభివృద్ధి చేసింది. దీని ద్వారా ఎల్‌నినో, లానినా పరిస్థితులను సూచించే కీలకమైన నీనో 3.4 సూచీని విశ్లేషిస్తోంది. ఈ అంచనాల ప్రకారం.. 2026 నవంబర్‌ నుంచి 2027 మార్చి వరకు ఎల్‌నినో కొనసాగేందుకు 87 నుంచి 100 శాతం అవకాశాలున్నాయి. అనంతరం ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఈఎన్‌ఎస్‌ఓ తటస్థ పరిస్థితులు ఏర్పడవచ్చని, జూన్‌-ఆగస్టు నుంచి లానినా అభివృద్ధి చెందే అవకాశాలు పెరుగుతాయని వెల్లడించింది.

లానినా వస్తే వర్షాలకు అనుకూలం..

ఎల్‌నినో, లానినా అనేవి పసిఫిక్‌ మహాసముద్ర ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే పరస్పర వ్యతిరేక వాతావరణ పరిణామాలు. తూర్పు పసిఫిక్‌ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరిగితే ఎల్‌నినోగా, తగ్గితే లానినాగా పరిగణిస్తారు. ఎల్‌నినో ప్రభావంతో సాధారణంగా భారత రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉండగా.. లానినా రుతుపవనాలకు అనుకూలంగా పనిచేస్తుంది. ఫలితంగా దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలుంటాయి. అయితే లానినా ప్రభావం ప్రతి ఏడాది ఒకేలా ఉండదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం వర్షపాతానికే పరిమితం కాదు. సముద్ర అలలపైనా దాని ప్రభావం కనిపిస్తుంది. బంగాళాఖాతంలో అత్యధిక అలల ఎత్తు పెరిగే పరిస్థితులు, అరేబియా సముద్రంలో తగ్గే పరిస్థితులు ఏర్పడతాయని ఐఎన్‌సీఓఐఎస్‌ అంచనా వేసింది. ఎల్‌నినో సంవత్సరాల్లో దక్షిణాసియా రుతుపవనాలు బలహీనపడే ధోరణితో ఈ పరిణామాలకు సంబంధం ఉందని పేర్కొంది.

అరేబియా సముద్రాన్ని కమ్మేసిన ఉష్ణతరంగాలు..

మరోవైపు ఉత్తర హిందూ మహాసముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2025తో పోలిస్తే 2026లో సముద్ర ఉష్ణతరంగాల (మెరైన్‌ హీట్‌వేవ్స్‌) ప్రభావం విస్తృతమైంది. అక్టోబర్‌-నవంబర్‌ నాటికి అరేబియా సముద్రంలో దాదాపు 80-90 శాతం ప్రాంతం ఈ ఉష్ణతరంగాల బారినపడింది. బంగాళాఖాతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సముద్రాలు దీర్ఘకాలం వేడెక్కడం వల్ల సముద్ర జీవావరణ వ్యవస్థలు తీవ్ర ఒత్తిడికి గురయ్యే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పగడపు దిబ్బలు తెల్లబడటం (కోరల్‌ బ్లీచింగ్‌), చేపల ఆవాసాల్లో మార్పులు సంభవించవచ్చని పేర్కొంటున్నారు. ముఖ్యంగా వాణిజ్యపరంగా కీలకమైన భారత ఆయిల్‌ సార్డిన్‌, ఇండియన్‌ మాకరెల్‌ వంటి చేపల విస్తరణ, లభ్యతపై ప్రభావం పడే అవకాశముంది. ఇది మత్స్యకారుల జీవనోపాధిపైనా ప్రతికూల ప్రభావం చూపవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి..

2026 మే-జూలై మధ్య భారత నైరుతి తీరంలో కోస్టల్‌ అప్‌వెల్లింగ్‌ ప్రక్రియ 2025తో పోలిస్తే బలహీనంగా నమోదైంది. సముద్ర ఉపరితలం దిగువన ఉన్న చల్లని, పోషక పదార్థాలు అధికంగా ఉండే నీరు పైకి రావడాన్ని కోస్టల్‌ అప్‌వెల్లింగ్‌ అంటారు. అయితే సీజన్‌ చివరి దశలో పరిస్థితులు కొంత మెరుగుపడ్డాయి. మారుతున్న సముద్ర పరిస్థితుల నేపథ్యంలో మత్స్యకారులు, సముద్ర రవాణా సంస్థలు, తీర ప్రాంత ప్రజలు సముద్ర అంచనాలు, మెరైన్‌ హీట్‌వేవ్‌ హెచ్చరికలు, అలల ఎత్తు, తీర ప్రాంత ప్రమాదాలపై జారీ చేసే సమాచారాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని ఐఎన్‌సీఓఐఎస్‌ సూచించింది.

Advertisement
Advertisement