త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAS Fouzia Taranum | ముస్లిం అయినంత మాత్రాన ‘పాకిస్థానీ’ అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు

కలబురగి ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరానుమ్‌ను మతం ఆధారంగా పాకిస్థానీ అనడంపై కర్ణాటక హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించింది.

J

National | Published On Aug 8, 2026, 3.53 pm IST

IAS Fouzia Taranum | ముస్లిం అయినంత మాత్రాన ‘పాకిస్థానీ’ అంటారా? బీజేపీ ఎమ్మెల్సీకి కర్ణాటక హైకోర్టు అక్షింతలు

సంక్షిప్త సారాంశం

కలబురగి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరానుమ్‌ను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం ముస్లిం అయినంత మాత్రాన పాకిస్థానీ అని పిలవడం దారుణమని జస్టిస్ ఎం. నాగప్రసన్న ధర్మాసనం మండిపడింది. జాతీయ జెండాను పట్టుకోవడాన్ని అధికారులు అడ్డుకుంటే వారిపైనా చర్యలు తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు బురదజల్లుకోవడం మానేసి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడాలని కోర్టు హితవు పలికింది.

Advertisement

IAS Fouzia Taranum | త్రినేత్ర.న్యూస్ : కలబురగి(గుల్బర్గా) డిప్యూటీ కమిషనర్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఫౌజియా తరానుమ్‌పై బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ చేసిన మతపరమైన వ్యాఖ్యలపై కర్ణాటక హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఒక అధికారి ముస్లిం అయినంత మాత్రాన 'పాకిస్థాన్' నుంచి వచ్చినట్లుగా ముద్ర వేస్తారా అంటూ న్యాయమూర్తి జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ శుక్రవారం తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసింది.

ఎమ్మెల్యేలు, ఎంపీలపై నమోదైన కేసులను విచారించే బెంగళూరు స్పెషల్ కోర్టులో తనపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ (కొట్టివేయాలని) చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్సీ ఎన్. రవికుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం పిటిషనర్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.

అసలేం జరిగిందంటే?

మే 2025లో కర్ణాటక శాసనమండలి ప్రతిపక్ష నేత చలవాది నారాయణస్వామిని ఓ ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో తొమ్మిది గంటల పాటు నిర్బంధించారన్న ఆరోపణలు వచ్చాయి. దీనికి నిరసనగా 'కలబురగి చలో' పేరిట బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ఈ ఆందోళన కార్యక్రమాల్లోనే ఎమ్మెల్సీ రవికుమార్.. కలబురగి డిప్యూటీ కమిషనర్ ఫౌజియా తరానుమ్‌ను ఉద్దేశించి 'పాకిస్థానీ' అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓ స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఆయనపై బీఎన్ఎస్ (BNS) సెక్షన్లు 196(1)(a)(b), 353(2) కింద కేసు నమోదు చేశారు.

క్షమాపణలు చెబితే డ్యామేజ్ కవర్ అవుతుందా?

"ఆమె ఈ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ ఆఫీసర్. కేవలం ముస్లిం అనే కారణంతో పాకిస్థానీ అని కామెంట్ చేస్తే నేను అస్సలు ఊరుకోను. అసలు మతం ఆధారంగా ఒక ఐఏఎస్ అధికారిని ఎలా టార్గెట్ చేస్తారు?" అని జస్టిస్ నాగప్రసన్న ఎమ్మెల్సీని ప్రశ్నించారు. ఘటన జరిగిన వెంటనే సదరు అధికారిణికి క్షమాపణ లేఖ పంపామని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. దీనిపై స్పందించిన కోర్టు.. "మీరు పంపిన క్షమాపణ లేఖతో.. మీరు చేసిన వ్యాఖ్యల వల్ల జరిగిన డ్యామేజ్ పోతుందా?" అని నిలదీసింది.

జాతీయ జెండా అడ్డుకుంటే అధికారులకూ ఫైన్

తాము 'తిరంగా యాత్ర' చేస్తుంటే జాతీయ జెండా పట్టుకోవడానికి కలబురగి యంత్రాంగం అనుమతి ఇవ్వలేదని పిటిషనర్ తరఫు లాయర్ వాదించారు. దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది.

"ఎవరో జాతీయ జెండా పట్టుకెళ్తే తప్పేంటి? అది తిరంగా యాత్ర కదా. జాతీయ జెండాను పట్టుకెళ్లకుండా ఎవరూ ఆపలేరు. ఒకవేళ ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని అడ్డుకుని ఉంటే.. మేము వారిపై ఫైన్ విధిస్తాం. అలాగని ఒక ఐఏఎస్ అధికారిపై మీరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా!" అని కోర్టు వ్యాఖ్యానించింది. నిరసనకారులు ఇచ్చిన వినతిపత్రాల రికార్డులను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ప్రజల గురించి ఆలోచించండి..

రాజకీయ నాయకులు సంయమనం పాటించాలని కోర్టు ఈ సందర్భంగా హితవు పలికింది. "పార్టీ ఏదైనా సరే.. ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం ఆపండి. విధానాల గురించి, ప్రజల సంక్షేమం గురించి మాట్లాడండి. మీరు బహిరంగంగా విమర్శల దాడి చేసుకోవడం ప్రజలకు అవసరం లేదు. వారికి కావాల్సింది వారి సంక్షేమమే" అని న్యాయమూర్తి సూచించారు.

రాజకీయ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోవడం వల్లే ఇలాంటి పనికిరాని కేసులతో క్రిమినల్ కోర్టులు నిండిపోతున్నాయని.. దీనివల్ల హత్యలు, దోపిడీల వంటి తీవ్రమైన కేసులు పెండింగ్‌లో పడిపోతున్నాయని కోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 20, 2026కు కోర్టు వాయిదా వేసింది.

Advertisement
Advertisement