త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KC Venugopal | రాజ్యాంగ సూత్రాల‌ను బీజేపీ ఉల్లంఘిస్తోంది: కేసీ వేణుగోపాల్‌

KC Venugopal | భార‌త రాజ్యాంగం ఆర్టికల్ 25 కింద దేశంలో మత స్వేచ్ఛకు హామీ ఇస్తోంద‌ని, మన రాజ్యాంగ పీఠిక కూడా సౌభ్రాతృత్వాన్ని నొక్కి చెబుతుందని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్( KC Venugopal )గుర్తు చేశారు. కానీ మన రాజ్యాంగంలోని ఈ సూత్రాలకు బీజేపీ ఉల్లంఘిస్తోంద‌ని మండిప‌డ్డారు.

A

National | Published On Oct 24, 2026, 1.54 pm IST

KC Venugopal | రాజ్యాంగ సూత్రాల‌ను బీజేపీ ఉల్లంఘిస్తోంది: కేసీ వేణుగోపాల్‌
Advertisement

KC Venugopal | త్రినేత్ర న్యూస్ : భార‌త రాజ్యాంగం ఆర్టికల్ 25 కింద దేశంలో మత స్వేచ్ఛకు హామీ ఇస్తోంద‌ని, మన రాజ్యాంగ పీఠిక కూడా సౌభ్రాతృత్వాన్ని నొక్కి చెబుతుందని కాంగ్రెస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్( KC Venugopal )గుర్తు చేశారు. కానీ మన రాజ్యాంగంలోని ఈ సూత్రాలకు బీజేపీ ఉల్లంఘిస్తోంద‌ని మండిప‌డ్డారు. మౌళిక సూత్రాల‌కు విరుద్ధమైన వాతావరణాన్ని సృష్టించడానికే బీజేపీ ఎప్పుడూ ప్రయత్నిస్తూ వస్తోందని ఆరోపించారు. మైనారిటీలపై దాడి చేయడానికి సంఘీ గూండాలకు లైసెన్స్ ఇవ్వడం, పోలీసులు మౌన ప్రేక్షకులుగా వ్యవహరించడమే దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే, రాష్ట్రంలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ల విభజన, విధ్వంసక ఎజెండాను ముందుకు తీసుకెళ్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అందులో భాగంగానే హింస తిరిగి విజృంభిస్తోంద‌ని అన్నారు. పశ్చిమ మేదినీపూర్‌లో బాధితులు, ముఖ్యంగా వివస్త్రను చేసి 'శుద్ధి కర్మ'కు గురిచేసిన మహిళ ఎదుర్కొన్న అవమానం, హింస హృదయ విదారకంగా ఉన్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి బాధ్యులైన వారికి అత్యంత కఠినమైన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. గత కొన్నేళ్లుగా, దేశవ్యాప్తంగా క్రైస్తవులను భయపెట్టడానికి, హింసించడానికి బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ఒక హింసాత్మక, దుర్మార్గపు కార్యక్రమాన్ని ప్రారంభించిందని ఆరోపించారు.

ఛత్తీస్‌గఢ్‌లో స‌న్యాసినుల‌ను అరెస్టు చేయ‌డం, ఇత‌ర‌ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చర్చిల అపవిత్రీకరణ, క్రైస్తవులే ల‌క్ష్యంగా హింస పెర‌గ‌డం వంటివి దీనికి ఉదాహ‌ర‌ణ‌లని వివ‌రించారు. ఇది అఖిల భారత స్థాయిలో పథకం ప్రకారం జరుగుతున్న దాడి అని, మోడీ-షా ఆశీస్సులతో జరుగుతోందని అనుమానం వ్య‌క్తం చేశారు. ఈ దారుణమైన నేరాల‌కు పాల్పడిన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తాను కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి సువేందు అధికారి ల‌కు లేఖ‌లు రాసిన‌ట్లు వివ‌రించారు.

Advertisement
Advertisement