Automatic Emergency Braking System | ఇక కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్.. ఏంటిది.. ఎలా పనిచేస్తుంది..?
Automatic Emergency Braking System | కార్లలో ప్రయాణికుల భద్రతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్యాసింజర్ కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏఈబీఎస్)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. కొత్త మోడళ్లకు 2030 అక్టోబర్ 1 నుంచి, ఇప్పటికే ఉన్న అన్ని మోడళ్లకు 2032 అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ప్రతిపాదించింది.
Technology | Published On Oct 24, 2026, 1.28 pm IST
Automatic Emergency Braking System | కార్లలో ప్రయాణికుల భద్రతను మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది. ప్యాసింజర్ కార్లలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏఈబీఎస్)ను తప్పనిసరి చేయాలని నిర్ణయించింది. కొత్త మోడళ్లకు 2030 అక్టోబర్ 1 నుంచి, ఇప్పటికే ఉన్న అన్ని మోడళ్లకు 2032 అక్టోబర్ 1 నుంచి ఈ నిబంధన అమలు చేయాలని ప్రతిపాదించింది. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ గెజిట్‌లో ప్రచురించిన కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు, 1989 ముసాయిదా సవరణల్లో ఈ ప్రతిపాదనను పొందుపరిచింది. ఈ నోటిఫికేషన్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచిన తేదీ నుంచి 30 రోజుల్లోగా అందే అభ్యంతరాలు, సూచనలను ప్రభుత్వం పరిశీలించనుంది.
ఏఈబీఎస్ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?
ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ (ఏఈబీఎస్) రాడార్ లేదా కెమెరాల సహాయంతో కారు ముందు రహదారిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఎదురుగా ఉన్న వాహనం లేదా ఏదైనా అడ్డంకితో ఢీకొనే ప్రమాదం ఉందని గుర్తిస్తే మొదట డ్రైవర్‌ను హెచ్చరిస్తుంది. డ్రైవర్ స్పందించకపోతే సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేస్తుంది. దీంతో ప్రమాదాన్ని నివారించేందుకు లేదా ఢీకొన్నప్పుడు జరిగే నష్ట తీవ్రతను తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. 2028 అక్టోబర్ 1 నుంచి ఏఈబీఎస్ అమర్చిన ఎం1, ఎన్1 కేటగిరీ వాహనాలు ఏఐఎస్-185 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. ఎం1 కేటగిరీలో డ్రైవర్‌తోపాటు ఎనిమిది మంది వరకు ప్రయాణించగలిగే ప్యాసింజర్ కార్లు ఉంటాయి. ఆ తర్వాత ఎం1 కేటగిరీ కార్లలో ఈ వ్యవస్థను తప్పనిసరి చేసేందుకు 2030 అక్టోబర్ 1, 2032 అక్టోబర్ 1 తేదీలను ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ గడువుల ప్రకారం కొత్త మోడళ్లకు ముందుగా, ఆ తర్వాత అన్ని మోడళ్లకు ఈ నిబంధన వర్తించనుంది.
ట్యాక్సీలు, రవాణా వాహనాలకు ప్రత్యేక నిబంధనలు..
ట్యాక్సీల వంటి రవాణా వాహనాలుగా రిజిస్టర్ చేసిన ఎం1 కేటగిరీ కార్లకు ప్రభుత్వం మరింత ముందుగానే గడువును నిర్దేశించింది. 2029 అక్టోబర్ 1 నుంచి ఈ వాహనాల్లో ఏఐఎస్-191 (పార్ట్ 1) ప్రమాణాలకు అనుగుణమైన ఎమర్జెన్సీ లేన్ కీపింగ్ సిస్టమ్ (ఈఎల్కేఎస్) ఉండాలి. అలాగే ఏఐఎస్-193 ప్రమాణాలకు అనుగుణమైన ఆటోమేటిక్ కమాండెడ్ స్టీరింగ్ ఫంక్షనాలిటీ (ఏసీఎస్ఎఫ్), ఏఐఎస్-184 ప్రమాణాలకు అనుగుణమైన డ్రైవర్ నిద్రమత్తు, అప్రమత్తతను గుర్తించే హెచ్చరిక వ్యవస్థ కూడా తప్పనిసరిగా ఉండాలి. ప్రైవేటు కార్ల విషయానికి వస్తే, ఈ మూడు వ్యవస్థలను తయారీదారు అమర్చాలని నిర్ణయించుకున్న పక్షంలో, 2027 అక్టోబర్ 1 నుంచి నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అయితే ప్రైవేటు కార్లకు ఈ నిబంధన తప్పనిసరి కాకుండా, ఆయా వ్యవస్థలను అమర్చే సందర్భంలో మాత్రమే వర్తిస్తుంది.
స్టీరింగ్, చైల్డ్ సీట్, లగేజీ భద్రతకు కొత్త ప్రమాణాలు..
ముసాయిదాలో ఇతర భద్రతా ప్రమాణాలను కూడా కేంద్రం ప్రతిపాదించింది. 2027 అక్టోబర్ 1 నుంచి అన్ని మోటారు వాహనాల్లో స్టీరింగ్ నిర్వహణకు అవసరమైన శ్రమ, నియంత్రణకు సంబంధించిన ప్రమాణాలు ఏఐఎస్-193కి అనుగుణంగా ఉండాలి. అయితే స్టీరింగ్ వీల్ లేని మోటార్‌సైకిళ్లు, దివ్యాంగుల కోసం రూపొందించిన వాహనాలు, మూడు చక్రాల వాహనాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. పిల్లల భద్రత కోసం ఐఎస్ఓఫిక్స్ (ఐఎస్ఓఎఫ్ఐఎక్స్) యాంకరేజీలు, టాప్ టెథర్‌లు, ఐ-సైజ్ సీటింగ్ స్థానాలు కలిగిన కార్లు ఏఐఎస్-182 ప్రమాణాలను పాటించాలి. ఈ నిబంధన కొత్త మోడళ్లకు 2027 అక్టోబర్ 1 నుంచి, అన్ని మోడళ్లకు 2028 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రావాలని ప్రతిపాదించారు.
కార్లలో సామాను కదలకుండా, ప్రమాద సమయంలో ప్రయాణికులకు ముప్పు కలగకుండా ఉండేందుకు లగేజీ నిలుపుదల ప్రమాణాలను కూడా నిర్దేశించారు. ఐఎస్ 15546:2005 ప్రమాణాలకు అనుగుణంగా కొత్త కార్ల మోడళ్లు 2028 ఏప్రిల్ 1 నుంచి, అన్ని మోడళ్లు 2028 అక్టోబర్ 1 నుంచి ఉండాలి. ప్రస్తుతం ఈ నిబంధనలు ముసాయిదా దశలోనే ఉన్నాయి. ప్రజల నుంచి అందే అభ్యంతరాలు, సూచనలను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. దీంతో ప్రతిపాదిత నిబంధనల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●RBI | అయిదేళ్ల గరిష్ఠానికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ
- ●Ponnam Prabhakar | రూ.3.22 కోట్లతో ఉప్పల్‌లో సిటీ బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన
- ●TTD | జనవరి నెల టీటీడీ ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల.. అర గంటలోనే 4,24,000 టికెట్లు బుకింగ్
- ●Swiggy Share Price | కనిష్ట స్థాయిలో స్విగ్గీ షేర్లు.. కొనాలా.. అమ్మాలా..?
- ●Road Accidents | నెత్తురోడిన రహదారులు.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
- ●Rahul Gandhi | రాహుల్ గాంధీ గారు.. మా పొట్ట కొట్టకండి! వ్యాపారుల లేఖ

RBI | అయిదేళ్ల గరిష్ఠానికి దేశంలో చలామణిలో ఉన్న కరెన్సీ

Ponnam Prabhakar | రూ.3.22 కోట్లతో ఉప్పల్‌లో సిటీ బస్ టెర్మినల్‌కు శంకుస్థాపన

TTD | జనవరి నెల టీటీడీ ప్రత్యేక దర్శనం టోకెన్లు విడుదల.. అర గంటలోనే 4,24,000 టికెట్లు బుకింగ్

Swiggy Share Price | కనిష్ట స్థాయిలో స్విగ్గీ షేర్లు.. కొనాలా.. అమ్మాలా..?






