త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mamata Banerjee | 15 ఏళ్ల‌లో బెంగాల్ ముఖ చిత్రం మారిందా..? సీఎంగా మ‌మ‌త ఏం చేశారు..?

Mamata Banerjee | పదిహేనేళ్ల క్రితం మ‌మ‌తా బెన‌ర్జీ ఓ స్పష్టమైన వాగ్దానంతో ప‌శ్చిమ బెంగాల్ పీఠాన్ని అధిరోహించారు. వామపక్షాల పారిశ్రామిక నియంత్రణకు ముగింపు పలికి, రైతులను విముక్తి చేసి, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందిస్తానని ఆమె ప్రకటించారు.

S

National | Published On Apr 12, 2026, 3.47 pm IST

Mamata Banerjee | 15 ఏళ్ల‌లో బెంగాల్ ముఖ చిత్రం మారిందా..? సీఎంగా మ‌మ‌త ఏం చేశారు..?
Advertisement

Mamata Banerjee | పదిహేనేళ్ల క్రితం మ‌మ‌తా బెన‌ర్జీ ఓ స్పష్టమైన వాగ్దానంతో ప‌శ్చిమ బెంగాల్ పీఠాన్ని అధిరోహించారు. వామపక్షాల పారిశ్రామిక నియంత్రణకు ముగింపు పలికి, రైతులను విముక్తి చేసి, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందిస్తానని ఆమె ప్రకటించారు. 2011లో ల‌భించిన‌ ఘన విజయం కేవలం ఎన్నికల ఫలితం మాత్రమే కాదు, అది 34 ఏళ్ల సీపీఐ(ఎం) పాలనపై సామాజిక తీర్పు కూడా. అయితే 2026 ఎన్నికల నేప‌థ్యంలో ఓ ప్ర‌ధాన ప్ర‌శ్న స్ప‌ష్టంగా ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఆమె వాగ్దానం చేసిన‌ట్లు ఆమె అస‌లు ఏమేం వ్య‌వ‌స్థ‌లను తొల‌గించారు, ఏమేం నిర్మించారు..? అనే ప్ర‌శ్న‌లు అక్క‌డి సామాన్యుల్లో ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

పక్క రాష్ట్రాల కన్నా వెనుకబడిన బెంగాల్..

తాజా ఆర్థిక సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర స్థూల ఆర్థిక ఉత్పత్తి (ఎన్ఎస్‌డీపీ) 2025 ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.16.32 లక్షల కోట్లకు చేరింది. ఇది అంత‌కు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన 9 శాతం వృద్ధితో పోలిస్తే కాస్త పెరిగినా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు 11.8 శాతం నుంచి 15.7 శాతం వరకు రెండంకెల‌ వృద్ధిని నమోదు చేశాయి. ముఖ్యంగా ఒకప్పుడు వెనుకబడిన రాష్ట్రాలుగా భావించిన బీహార్, ఒడిశా కూడా బెంగాల్ కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.

ఆకర్షణీయంగా కనిపించే గణాంకాలు..

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారం చేస్తున్న గణాంకాల ప్రకారం గత 15 ఏళ్లలో రాష్ట్ర జీడీపీ దాదాపు ఆరు రెట్లు పెరిగింది. త‌ల‌స‌రి ఆదాయం మూడు రెట్లు పెరిగింది. 1.72 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఉత్పాదక మూలధన వ్యయం 18 రెట్లు పెరిగింది. భౌతిక రంగ ఖర్చు 7 రెట్లు పెరిగింది. 2010లో 25 శాతంగా ఉన్న బీపీఎల్ జనాభా 2023 నాటికి 12 శాతం కంటే తక్కువకు పడిపోయిందని మ‌ల్టీ డైమెన్ష‌న‌ల్ పావ‌ర్టీ ఇండెక్స్ తెలియజేస్తోంది. మహిళల కోసం అమలు చేస్తున్న లక్ష్మీర్ భండార్ వంటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయంగా టీఎంసీకి బలమైన పునాది అయ్యాయి. అయితే ఈ అభివృద్ధి అసలు అభివృద్ధేనా లేక అప్పులపై ఆధారపడిన పునర్విభజననా అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది.

భయపెట్టే గణాంకాలు..

1960లో భారత జీడీపీలో 10.5 శాతం వాటా కలిగిన బెంగాల్, 2023-24 నాటికి 5.6 శాతానికి పడిపోయింది. త‌ల‌స‌రి ఆదాయం కూడా జాతీయ సగటు కంటే వెనుకబడింది. ఒకప్పుడు జాతీయ సగటు కంటే 127.5 శాతం ఎక్కువ‌గా ఉన్న ఆదాయం, ఇప్పుడు 83.7 శాతానికి పడిపోయింది. అంటే బెంగాలీలు ఇప్పుడు దేశ సగటు కన్నా తక్కువ సంపాదిస్తున్న‌ట్లు తేలింది. పారిశ్రామిక రంగంలో పరిస్థితి మరింత దిగజారింది. స్వాతంత్ర్యం సమయంలో భారత పారిశ్రామిక ఉత్పత్తిలో 30 శాతం వాటా ఉన్న బెంగాల్, ప్రస్తుతం 4 శాతం కంటే తక్కువకు పడిపోయిందని అంచనాలు సూచిస్తున్నాయి. ఈ పతనం పూర్తిగా మమతా బెనర్జీ హ‌యాంలోనే జ‌ర‌గ‌లేదు. కానీ ఆమె పాలనలో దీనికి పరిష్కారం ల‌భించ‌కపోవడం ప్రధాన సమస్యగా మారింది.

పారిశ్రామిక విధానంపై ప్రభావం..

సింగూర్ ఉద్యమం ద్వారా అధికారంలోకి వచ్చిన మమత భూమి స్వాధీనంపై కఠిన వైఖరిని అవలంబించారు. ప్రైవేట్ పరిశ్రమలకు భూమి ఇవ్వడాన్ని వ్యతిరేకించడం, ప్రత్యేక ఆర్థిక మండలాలను (సెజ్ లు) ఏర్పాటు చేయకపోవడం, ఎంఎస్ఎంఈలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టడం వంటి నిర్ణయాలు దీర్ఘకాలిక ఆర్థిక ప్రభావాన్ని చూపాయి. పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాల వైపు మళ్లారు.

ఆర్థిక ఉచ్చు..

గత 15 ఏళ్లలో బెంగాల్ అప్పులు రూ.1.90 లక్షల కోట్ల నుంచి రూ.7 లక్షల కోట్లకు పెరిగాయి. 2026 చివ‌రి వ‌ర‌కు ఇది రూ.7.70 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. రాష్ట్ర ఆదాయంలో ఐదవ వంతు వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. ఇది అభివృద్ధి ఖర్చులకు పెద్ద అడ్డంకిగా మారింది. రాష్ట్రం మౌలిక వసతులపై జాతీయ సగటు కంటే తక్కువ ఖర్చు చేస్తోంది. అప్పులు తీసుకుని జీతాలు, పెన్షన్లు, సంక్షేమ పథకాలపై ఖర్చు చేయడం వల్ల భవిష్యత్ సామర్థ్య నిర్మాణం జరగడం లేదు. 2025 నాటి నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌లో బెంగాల్ 18 రాష్ట్రాల్లో 16వ స్థానంలో నిలిచింది.

బెంగాల్‌లో బ్యాంకుల క్రెడిట్-డిపాజిట్ నిష్పత్తి తగ్గింది. అంటే బ్యాంకులు డిపాజిట్లు సేకరించి ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇది పెట్టుబడి వాతావరణంపై నమ్మకం తగ్గిందని సూచిస్తుంది. ప్రైవేట్ పెట్టుబడులు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ వైపు మళ్లాయి.

2026 తీర్పు..

2026 ఎన్నికల్లో మమతా బెనర్జీ తన పాలనలో రాష్ట్రాన్ని స్థిరపరిచానని, పేదలకు గౌరవం కల్పించానని వాదిస్తున్నారు. ఇది కొంతవరకు నిజమే. కానీ దీని వెనుక ఉన్న పెద్ద సమస్యలను దాచి పెడుతున్నారు. పదిహేనేళ్లు ఒక రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి సరిపోతాయి. కానీ బెంగాల్ ఇప్పుడు భారీ అప్పులు, సంక్షేమంపై ఆధారపడే జనాభా, బలహీనమైన పారిశ్రామిక స్థితి వంటి సమస్యలను ఎదుర్కొంటోంది. మమతా బెనర్జీ ఈ పతనాన్ని సృష్టించలేదు. కానీ దాన్ని మార్చే అవకాశం ఆమెకు మూడు సార్లు లభించింది. అయినప్పటికీ నిర్మాణాత్మక మార్పులను చేపట్టడంలో విఫలమయ్యారు. బెంగాల్‌ సంక్షేమ రాష్ట్రంగా ఉంది. కానీ దాన్ని నిలబెట్టే ఉత్పాదక ఆర్థిక వ్యవస్థ లేదు. ఈ ప‌రిణామాల‌కు భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వాలు కాదు, ప్ర‌జ‌లే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement