Karnataka | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కే రామచంద్ర రావుపై వేటు పడింది. పలువురు మహిళలతో తన కార్యాలయంలోనే అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కర్ణాటక సర్కార్ సీరియస్‌గా స్పందించింది. ప్రాథమిక విచారణ అనంతరం ఆయనను సస్పెన్షన్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళలతో ప్రభుత్వ ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించడం క్షమించరాని నేరం. ఇలాంటి కార్యకలాపాలు ఏ మాత్రం మంచిది కాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. రామచంద్ర రావు తన విధి నిర్వహణను మరిచిపోయి.. ఉద్యోగ నిబంధనలను ఉల్లంఘించారని ప్రభుత్వం మండిపడింది. మహిళలతో అసభ్యకర ప్రవర్తనకు సంబంధించిన అంశంపై విచారణ కొనసాగుతోందని, ఈ క్రమంలోనే తక్షణమే రామచంద్ర రావును విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. సస్పెన్షన్ కాలంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ హెడ్ క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని ప్రభుత్వం ఆదేశించింది. రామచంద్ర రావు ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ సిబిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధిపతిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక ప్రచారంలో ఉన్న వీడియోలపై వివరణ ఇచ్చేందుకు హుటాహుటిన హోంమంత్రి డాక్టర్ పరమేశ్వర్ నివాసానికి వెళ్లినప్పటికీ ఆయనకు అపాయింట్‌మెంట్ లభించలేదు. ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ.. ఆ వీడియోల్లో ఉన్నది తాను కాదని పేర్కొన్నారు. ఎవరో కుట్రపన్ని ఏఐతో తయారు చేసి వైరల్ చేశారని తెలిపారు. ఈ వీడియోలు ఎనిమిదేళ్ల కిందట రికార్డు చేసినవిగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలను విడుదల చేసిన వారిపై ఫిర్యాదుకు న్యాయవాదులతో చర్చిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.