త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Infosys | ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శ్ర‌మ‌దోపిడీ.. టెక్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌కు భారీగా ఫైన్‌

Infosys | ఐటీ ప‌రిశ్ర‌మ‌లు శ్ర‌మ‌దోపిడీకి పాల్పడుతూ ప‌ని సంస్కృతి పేరుతో ఉద్యోగుల వ్య‌క్తిగ‌త జీవితాల‌ను హ‌రిస్తున్నాయ‌ని, మానక ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని ప్ర‌ముఖ డిజిట‌ల్ క్రియేట‌ర్‌ శ్రీనివాస్ గంజివ‌ర‌పు (Srinivas Ganjivarapu) అన్నారు. ఉద్యోగుల ప‌నివేళ‌లు, ఓవ‌ర్ టైమ్ చెల్లింపుల విష‌యంలో పారద‌ర్శ‌క‌త లోపించ‌డంతో భార‌తీయ‌ టెక్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌కు (Infosys) ఫ్రాన్స్ (France) ప్ర‌భుత్వం జ‌రిమానా విధించడ‌మే దీనికి నిద‌ర్శ‌నం అని చెప్పారు.

G

National | Published On Aug 2, 2026, 10.46 am IST

Infosys | ఐటీ ప‌రిశ్ర‌మ‌ల శ్ర‌మ‌దోపిడీ.. టెక్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌కు భారీగా ఫైన్‌
Advertisement

Infosys | ఐటీ ప‌రిశ్ర‌మ‌లు శ్ర‌మ‌దోపిడీకి పాల్పడుతూ ప‌ని సంస్కృతి పేరుతో ఉద్యోగుల వ్య‌క్తిగ‌త జీవితాల‌ను హ‌రిస్తున్నాయ‌ని, మానక ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తున్నాయ‌ని ప్ర‌ముఖ డిజిట‌ల్ క్రియేట‌ర్‌ శ్రీనివాస్ గంజివ‌ర‌పు (Srinivas Ganjivarapu) అన్నారు. ఉద్యోగుల ప‌నివేళ‌లు, ఓవ‌ర్ టైమ్ చెల్లింపుల విష‌యంలో పారద‌ర్శ‌క‌త లోపించ‌డంతో భార‌తీయ‌ టెక్ దిగ్గ‌జం ఇన్ఫోసిస్‌కు (Infosys) ఫ్రాన్స్ (France) ప్ర‌భుత్వం జ‌రిమానా విధించడ‌మే దీనికి నిద‌ర్శ‌నం అని చెప్పారు. ఐరోపా స‌మాఖ్య‌లోని కార్మిక సంక్షేమ చట్టాల (Labour laws) పదును ఎలాంటిదో ఫ్రాన్స్‌లో ఎదురైన జరిమానా ఘటన కళ్ళకు కట్టినట్లు నిరూపించింద‌న్నారు.

`ఉద్యోగుల పనివేళలు (Working Hours), విశ్రాంతి సమయాలు, ఓవర్‌టైమ్ చెల్లింపులకు సంబంధించిన నమోదు విధానంలో పారదర్శకత లోపించిందన్న తీవ్రమైన అభియోగంతో ఫ్రాన్స్ కార్మిక శాఖ ఆ సంస్థపై భారీ జరిమానా విధించింది. వారానికి కేవలం 35 గంటల ప్రామాణిక పనివేళలను మాత్రమే అనుమతించే ఫ్రాన్స్ చట్టాలు, అంతకు మించి సాగే ప్రతి నిమిషం శ్రమకూ కచ్చితమైన లెక్కలూ పరిహారాలూ కోరుతాయి. ఉద్యోగుల శ్రమను పరోక్షంగా పిండుకునే సాంకేతిక రంధ్రాలను అక్కడి యంత్రాంగం అస్సలు ఉపేక్షించలేదు. ఎంతటి అంతర్జాతీయ కార్పొరేట్ శక్తయినా సరే, కార్మికుడి రాజ్యాంగబద్ధమైన విశ్రాంతి హక్కును కాలరాస్తే చట్టం ముందు మోకరిల్లక తప్పదని పశ్చిమ దేశాలు ఈ చర్యతో చాటిచెప్పాయి.

ఐటీ పరిశ్రమతో సహా..

ఈ ఘటన నిజానికి ఇన్ఫోసిస్‌కు మాత్రమే పరిమితమైన సాంకేతిక లోపం కాదు, భారత్‌లోని ఐటీ పరిశ్రమతో సహా అనేక వర్గాలు అనుసరిస్తున్న దోపిడీ మార్గాలకు పశ్చిమ సమాజం ఇచ్చిన గట్టి కౌంటర్. స్వదేశంలో కార్పొరేట్ వ్యవస్థలు ఏ విధంగా ఉద్యోగుల శ్రమను చౌకగా భావిస్తూ, చట్టబద్ధమైన పరిమితులను దాటి పనిచేయించుకోవడానికి అలవాటుపడ్డాయో ఈ పరిణామం బట్టబయలు చేస్తోంది.

భారత్‌లో 'పని సంస్కృతి' పేరుతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలను, మానసిక ఆరోగ్యాన్ని పక్కనబెట్టి, రోజుకు 12 నుండి 14 గంటల పాటు పిండుకోవడం సర్వసాధారణమైపోయింది. కానీ అదే ధోరణిని ఐరోపా వంటి పారదర్శక సమాజాల్లో ప్రదర్శించాలని చూస్తే చట్టం ఏ విధంగా బహుముఖ దాడి చేస్తుందో ఈ జరిమానా నిరూపించింది. మరొకవైపు, పశ్చిమాన అమలు జరుగుతున్న ఈ చట్టబద్ధ నిష్కర్షకు, మనదేశంలో ఏలుతున్న కార్పొరేట్ అరాచకత్వానికి మధ్య కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న వ్యత్యాసం ప్రతీ ఒక్కరూ అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

దేశాభివృద్ధి ముసుగులో..

దేశాభివృద్ధి అనే భావోద్వేగ ముసుగులో భారతీయ యువత వారానికి ఏకంగా 70 గంటల పాటు శ్రమించాలని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్. నారాయణమూర్తి (Narayana Murthy) ఉపదేశించారు. ఆయన చేసిన ప్రకటన, శ్రామికులను మనుషులుగా కాక కేవలం లాభాలు పిండే యంత్రాలుగా చూసే మూలధన మానసికతకు ప్రత్యక్ష నిదర్శనం. అదనంగా పనిచేయించుకునే శ్రమకు తగిన పరిహారం చెల్లించే ప్రసక్తి లేకుండా, ఉచిత శ్రమను 'దేశభక్తి'గా చిత్రీకరించే ఈ శ్రామిక దోపిడీ వ్యూహం వెనుక ఉన్నది నిస్సిగ్గుగా సాగే ఆధునిక వెట్టిచాకిరీ కాదా?.

రక్షణ లేని శ్రామిక శక్తికి నిలయంగా భారత్..

అత్యంత విచారకరమైన విషయమేమిటంటే, భారతీయ వ్యవస్థలు ఈ దోపిడీకి పరోక్షంగా బాసటగా నిలుస్తుండటమే. కేంద్ర, రాష్ట్ర కార్మిక శాఖలు రోజురోజుకూ క్షీణిస్తున్న ప్రైవేట్ రంగ జనాల జీవన ప్రమాణాలను, అనియంత్రిత పని ఒత్తిడి వల్ల సంభవిస్తున్న అకాల మరణాలను, విపరీతమైన మానసిక అనారోగ్యాలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నాయి. దేశీయంగా ఉన్న షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టాలు, కార్మిక నియమావళి ఐటీ రంగానికి పట్టవు అన్నట్లుగా యంత్రాంగాలు వ్యవహరించడం కార్పొరేట్ల అహంకారానికి మరింత నెయ్యి పోస్తోంది. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన ప్రభుత్వాలే పెట్టుబడుల సాకు చూపి మౌనం వహించడం వల్ల, భారత్ నేడు ప్రపంచంలోనే అత్యంత చౌకైన, రక్షణ లేని శ్రామిక శక్తికి నిలయంగా మారుతున్న‌ది.

ఇకపై చెల్లుబాటు కాదు..

స్వదేశంలో వ్యవస్థల బలహీనతను, నిరుద్యోగ భయాన్ని ఆసరాగా చేసుకుని శ్రమ దోపిడీని ఎంతకాలమైనా సాగించవచ్చనే భ్రమల్లో ఉన్న భారతీయ కార్పొరేట్ దిగ్గజాలకు ఫ్రాన్స్ జరిమానా ఒక గట్టి కనువిప్పు కావాలి. ఐటీ లేదా సర్వీస్ రంగం పేరుతో కార్మికుడి ప్రాథమిక హక్కులను తొక్కిపెట్టే ధోరణికి అంతర్జాతీయంగా ఇక చెల్లుబాటు కాదని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. భారత్ సైతం కేవలం కార్పొరేట్ లాభాలకే కాకుండా, శ్రామికుల సంక్షేమానికి, మానవీయ విలువలకు ప్రాధాన్యమిచ్చేలా స్పష్టమైన పనిగంటల చట్టాలను రూపుదిద్ది, వాటిని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. శ్రమకు తగిన గౌరవం, రక్షణ లభించినప్పుడే నిజమైన దేశాభివృద్ధి సాధ్యమవుతుంది.` అని చెప్పారు.

- Srinivas Ganjivarapu

Advertisement
Advertisement