త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IT employees | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ త‌ప్ప‌నిస‌రి చేయండి : కేంద్రానికి ‘నైట్స్’ లేఖ‌

IT employees | ఐటీ ఉద్యోగుల సంఘం 'నైట్స్' (Nascent Information Technology Employees Senate) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐటీ రంగంలోని 58 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది.

D

National | Published On May 11, 2026, 5.27 pm IST

IT employees | ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ త‌ప్ప‌నిస‌రి చేయండి : కేంద్రానికి ‘నైట్స్’ లేఖ‌
Advertisement

IT employees | మధ్యప్రాచ్య సంక్షోభం నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలంటూ దేశ ప్ర‌జ‌ల‌కు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్ వినియోగాన్ని త‌గ్గించుకోవాల‌ని సూచించారు. వ‌ర్క్ ఫ్రం హోం, ఆన్‌లైన్ మీటింగ్‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధాని సూచ‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్రంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం 'నైట్స్' (Nascent Information Technology Employees Senate) తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఐటీ రంగంలోని 58 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ త‌ప్ప‌నిస‌రి చేయాల‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేసింది.

ఐటీ రంగంలోని 58 లక్షల మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని కార్మిక మంత్రిత్వ శాఖను ఉద్యోగుల సంఘం కోరింది. ఈ మేర‌కు లేఖ రాసింది. కొవిడ్ వ్యాప్తి స‌మ‌యంలో ఐటీ కార్య‌క‌లాపాలు ఎటువంటి ఆటంకం లేకుండా సాగ‌డాన్ని నైట్స్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసింది. ఐటీ రంగంలో డబ్ల్యూఎఫ్‌హెచ్‌ అమలు చేయడం ఆచరణాత్మకమని, సాంకేతికంగా సాధ్యమేనని త‌న‌ లేఖలో స్ప‌ష్టం చేసింది. ప్రతిరోజూ లక్షలాది మంది ఉద్యోగులు ఆఫీసులకు రావడం వల్ల ఇంధన వినియోగం పెరగడమే కాకుండా, పట్టణ మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణాపై అనవసర ఒత్తిడి పడుతోందని అభిప్రాయ‌ప‌డింది. మెట్రో న‌గ‌రాల్లో ఉద్యోగులు ప్ర‌యాణాల‌కే గంట‌ల కొద్దీ స‌మ‌యాన్ని వెచ్చిస్తున్నార‌ని తెలిపింది. అందుకే సాధ్యమైనంత వ‌ర‌కూ ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించేలా తక్షణమే అడ్వైజరీ జారీ చేయాలని నైట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

మోదీ సూచ‌న‌ల‌కు కార‌ణ‌మేంటి..?

ప్ర‌పంచ అవ‌స‌రాల్లో 20 శాతం ముడి చ‌మురు హ‌ర్మూజ్ జ‌ల‌సంధి గుండానే స‌ర‌ఫ‌రా అవుతుంది. ఇక భార‌త్ త‌న ముడిచ‌మురు, గ్యాస్ అవ‌స‌రాల్లో 80 శాతం దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డుతోంది. అయితే, యుద్ధం కార‌ణంగా ఇంధ‌న ర‌వాణాకు ఆటంకాలు ఏర్ప‌డ్డాయి. ఫ‌లితంగా ప్ర‌పంచ వ్యాప్తంగా సంక్షోభం త‌లెత్తింది. ఇరాన్ యుద్ధం భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌, రూపాయిపై పెను ప్ర‌భావం చూపుతోంది. చమురు ధరల పెరుగుదలతోపాటు విదేశీ నిధుల ఉపసంహరణల కారణంగా రూపాయి విలువ భారీగా క్షీణించింది.

ప్ర‌స్తుతం అమెరికా డాల‌ర్‌తోతో పోలిస్తే 85 పైస‌లు త‌గ్గిన రూపాయి, డాల‌ర్‌కు 95.32 వ‌ద్ద గ‌రిష్ట స్థాయికి స‌మీపంలో ఉంది. గ‌తేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు జరిగిన దిగుమతుల విలువ 8.63 ల‌క్ష‌ల కోట్లు. కానీ, ఈ ఏడాది జనవరి-ఏప్రిల్‌ మధ్య పెరిగిన ధరల వల్ల ముడిచమురు దిగుమతుల మొత్తం విలువ ఏకంగా 17 ల‌క్ష‌ల‌ కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంది. నెలవారీ బిల్లు అదనంగా సుమారు రూ.75 వేల కోట్ల మేర పెరిగిపోయింది. అదీకాక, ఈ చెల్లింపుల కోసం అమెరికా డాలర్లను మరింతగా కొనాల్సి వస్తోంది. అలా డాలర్‌కు పెరిగిన డిమాండ్‌ రూపాయి విలువపై ఒత్తిడి తెస్తోంది.

పెను ఆర్థిక సంక్షోభం త‌ప్ప‌దా..?

రూపాయి విలువపై పడుతున్న ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడానికి రిజర్వు బ్యాంకు చ‌ర్య‌లు చేప‌ట్టింది. ముడిచమురు ధరలు పెరగడం ఆర్థికంగా ఒత్తిడి పెంచింది. యుద్ధం దీర్ఘ‌కాలం పాటు కొన‌సాగితే చ‌మురు ధ‌ర‌లు మ‌రింత పెరిగి అమెరికా డాల‌ర్ బ‌ల‌ప‌డుతుంది. అదే జ‌రిగితే రూపాయి విలువ మ‌రింత ప‌త‌న‌మై ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలుతుంది. భారీ ఎత్తున ద్ర‌వ్బోల్బ‌ణం పెరుగుతుంది. అన్ని వ‌స్తువులు, సేవ‌ల ధ‌ర‌లు భారీగా పెరుగుతాయి. ఎగుమ‌తులు, దిగుమ‌తుల మ‌ధ్య తేడా భారీగా ఏర్ప‌డుతుంది. దీని వ‌ల్ల వాణిజ్య లోటు, క‌రెంట్ అకౌంట్ లోటు భారీగా పెరుగుతాయి. అప్పుడు పెను ఆర్థిక సంక్షోభం వ‌స్తుంది.

పొదుపు సూచ‌న‌ల ల‌క్ష్యం ఒక్క‌టే..

ప్ర‌ధాని మోదీ చెప్పిన పొదుపు సూచ‌న‌ల్లో అంతిమంగా ఒక్క‌టే ల‌క్ష్యం. ప్ర‌జ‌లు పాటించే అన్ని సూచ‌న‌ల ఉద్దేశం విదేశీ మారక నిల్వ‌ల‌ను ఆదా చేయ‌డ‌మే. దీని వ‌ల్ల భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎంతో మేలు జ‌రుగుతుంది. పెను ఆర్థిక సంక్షోభం రాకుండా నివారించ‌వ‌చ్చు. ప్ర‌జ‌లు పాటించే ఆయా సూచ‌న‌ల వ‌ల్ల భారీ ఎత్తున ఇంధ‌నం, విదేశీ మార‌క నిల్వ‌లు ఆదా అవుతాయి. బంగారం, చ‌మురు, వంట నూనెలు, ఎరువులు, విదేశాల నుంచి దిగుమ‌తి అయ్యే ఎల‌క్ట్రానిక్‌, ఇత‌ర వ‌స్తువులు వంటి అంశాల్లో భార‌త్ దిగుమ‌తులే అధికంగా ఉన్నాయి. అందువ‌ల్ల వాటిని నియంత్రించాలి. అలా చేయ‌క‌పోతే ఎగుమ‌తుల క‌న్నా దిగుమ‌తుల విలువే ఎక్కువ‌గా ఉంటుంది. దీంతో వాణిజ్య లోటు పెరిగి అది క‌రెంట్ అకౌంట్ లోటుకు దారి తీస్తుంది. ఫ‌లితంగా భార‌త్ నుంచి ఎక్కువ డ‌బ్బు బ‌య‌ట‌కు వెళ్తుంది, అదే స‌మ‌యంలో భార‌త్ వ‌స్తువులు, సేవ‌ల కోసం డాల‌ర్ల‌ను అధికంగా ఖ‌ర్చు చేయాల్సి వ‌స్తుంది. ఇది ఒక చ‌క్రంలా కొన‌సాగుతుంది. అందువ‌ల్ల ఆ ప‌రిస్థితి రావొద్ద‌నే ప్ర‌ధాని మోదీ ముందుజాగ్ర‌త్త‌గా ప్ర‌జ‌ల‌కు పొదుపు సూచ‌న‌లు చేశార‌ని ఆర్థిక‌ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Advertisement
Advertisement