త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Joins UK Coalition | మాతో చేతులు కలపండి.. హార్ముజ్‌ని తెరిపించేందుకు భారత్ సాయం కోరిన బ్రిటన్

ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి'ని తిరిగి తెరిపించేందుకు బ్రిటన్ నేతృత్వంలో 35 దేశాలు ఏకమయ్యాయి. ఈ కీలక ప్రయత్నంలో భారత్ కూడా భాగస్వామి అవుతోందని భారత విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.

J

National | Published On Apr 2, 2026, 7.06 pm IST

India Joins UK Coalition | మాతో చేతులు కలపండి.. హార్ముజ్‌ని తెరిపించేందుకు భారత్ సాయం కోరిన బ్రిటన్

సంక్షిప్త సారాంశం

అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా మూతపడిన హార్ముజ్ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు సన్నద్ధమయ్యాయి. బ్రిటన్ ఆధ్వర్యంలో 35 దేశాలతో జరుగుతున్న వర్చువల్ సమావేశంలో భారత్ తరఫున విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొంటున్నారు. ప్రపంచ ఇంధన సరఫరాలో 20 శాతం, భారత చమురు దిగుమతుల్లో 40 శాతం ఈ జలసంధి గుండానే జరుగుతాయి. అయితే, ఈ విషయంలో బ్రిటన్ సహా ఇతర మిత్రదేశాలకు సహాయం చేసేది లేదని, ఎవరి కోసం వారు పోరాడటం నేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు.

Advertisement

India Joins UK Coalition | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన 'హార్ముజ్ జలసంధి' (Strait of Hormuz) మూసివేతతో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించిన విషయం తెలిసిందే. దీన్ని తిరిగి తెరిపించేందుకు బ్రిటన్ (UK) ఆధ్వర్యంలో 35 దేశాలు ఏకమయ్యాయి. ఈనేపథ్యంలో యూకే నుంచి హార్ముజ్ జలసంధి తెరవడం కోసం జరుగనున్న వర్చువల్ మీటింగ్‌కి భారత్‌కి ఆహ్మానం అందింది. దీంతో ఈ ప్రతిష్టాత్మక ప్రయత్నంలో భారత్ కూడా భాగస్వామి అవుతోందని భారత విదేశాంగ శాఖ (MEA) గురువారం వెల్లడించింది.

సమావేశంలో పాల్గొననున్న విక్రమ్ మిస్త్రీ

విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటన్ ఆహ్వానం మేరకు గురువారం సాయంత్రం జరిగే వర్చువల్ సమావేశంలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ పాల్గొంటారని తెలిపారు.

"మా నౌకల సురక్షిత ప్రయాణం కోసం ఇరాన్ సహా ఇతర దేశాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. మా ప్రయత్నాల వల్ల గత కొద్ది రోజుల్లో ఎల్‌పీజీ, ఎల్‌ఎన్‌జీ వంటి ఉత్పత్తులతో ఉన్న 6 భారతీయ వాణిజ్య నౌకలు సురక్షితంగా హార్ముజ్ జలసంధిని దాటాయి. అన్ని వర్గాలతోనూ మేము టచ్‌లో ఉన్నాం" అని ఆయన వివరించారు.

భారత్‌కు ఎందుకంత కీలకం?

ప్రపంచంలోని మొత్తం ఇంధన సరఫరాలో 20 శాతం ఈ ఇరుకైన జల మార్గం గుండానే జరుగుతుంది. ముఖ్యంగా భారత్‌కు ఇది చాలా కీలకం. దేశంలోకి దిగుమతి అయ్యే మొత్తం చమురులో 40 శాతం, LNG లో 50 శాతం, ఎల్‌పీజీ (LPG) లో ఏకంగా 80 శాతం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతాయి. ఇది మూసుకుపోతే ఇంధన కొరతతో పాటు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది.

చేతులెత్తేసిన డొనాల్డ్ ట్రంప్.. షాకింగ్ కామెంట్స్

జలసంధిని తెరిపించడమే తన ప్రధాన లక్ష్యమని గతంలో పదేపదే చెప్పిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇప్పుడు మాట మార్చారు. మిత్రదేశాలకు ఇకపై సాయం చేయబోనని తేల్చిచెప్పారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' (Truth Social) వేదికగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

"ఇరాన్‌తో యుద్ధంలో మాకు సాయం చేయడానికి నిరాకరించిన బ్రిటన్ లాంటి దేశాలు.. ఇప్పుడు జెట్ ఇంధనం దొరకక ఇబ్బంది పడుతున్నాయి. మీకు నావి రెండు సలహాలు.. ఒకటి, చమురును అమెరికా దగ్గర కొనండి, మా వద్ద చాలా ఉంది. రెండు, కాస్త ధైర్యం తెచ్చుకుని వెళ్లి ఆ జలసంధిని మీరే ఆక్రమించుకోండి. ఇకపై అమెరికా మీకు సాయం చేయడానికి రాదు. మీ కోసం మీరు పోరాడటం నేర్చుకోండి. ఇరాన్‌ను మేం ఇప్పటికే నాశనం చేశాం. కష్టమైన పనంతా మేమే చేశాం. వెళ్లి మీ చమురు మీరే తెచ్చుకోండి!" అని ట్రంప్ పోస్ట్ చేశారు.

బ్రిటన్ ఆధ్వర్యంలో భారీ కూటమి

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) రంగంలోకి దిగారు. సముద్ర భద్రతను పునరుద్ధరించేందుకు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, కెనడా, యూఏఈ సహా 35 దేశాలు అంగీకరించాయని వెల్లడించారు.

"నౌకల స్వేచ్ఛా ప్రయాణాన్ని పునరుద్ధరించడానికి, చిక్కుకుపోయిన నౌకలు, నావికులకు రక్షణ కల్పించడానికి, సరుకుల రవాణాను తిరిగి ప్రారంభించడానికి అవసరమైన అన్ని దౌత్య, రాజకీయ చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తాం. యుద్ధం ముగిసిన తర్వాత ఆ మార్గంలో భద్రత కల్పించడంపై సైనిక నిపుణులతో కూడా చర్చిస్తాం" అని ఆయన తెలిపారు.

బ్రిటన్ విదేశాంగ మంత్రి వైవెట్ కూపర్ అధ్యక్షతన జరిగే ఈ 35 దేశాల సమావేశం తర్వాత.. తదుపరి కార్యాచరణను ఖరారు చేసేందుకు అధికారుల స్థాయిలో మరిన్ని భేటీలు జరగనున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement