త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం

Hydrogen Rail | భారత రైల్వేలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి రైలు సేవలను ప్రారంభించనున్నారు. ఈ రైలు పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో కీలక ముందడుగుగా నిలవనుంది. హర్యానాలోని జింద్‌ –సోనిపట్ మార్గంలో ఈ రైలు పరుగులు పెట్టనుంది.

P

National | Published On Jul 8, 2026, 1.45 pm IST

Hydrogen Rail | భారతీయ రైల్వేలో సరికొత్త అధ్యాయం
Advertisement
  • తొలిసారిగా పట్టాలెక్కబోతున్న హైడ్రోజన్‌ రైలు
  • ఈ నెల 17న ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  • జింద్‌-సోనిపట్‌ మార్గంలో పరుగులు
  • పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో ముందడుగు

Hydrogen Rail | భారత రైల్వేలో సరికొత్త అధ్యాయం మొదలుకానున్నది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు పట్టాలెక్కనున్నది. ఈ నెల 17న ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి రైలు సేవలను ప్రారంభించనున్నారు. ఈ రైలు పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో కీలక ముందడుగుగా నిలవనుంది. హర్యానాలోని జింద్‌ –సోనిపట్ మార్గంలో ఈ రైలు పరుగులు పెట్టనుంది. జింద్‌లో ప్రత్యేకంగా హైడ్రోజన్ నిల్వ, రీఫ్యూయలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడే కంప్రెస్డ్ హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ని రైలులో నింపుతారు. అయితే, హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది? సాధారణ డీజిల్, విద్యుత్ రైళ్లతో పోలిస్తే దీని ప్రత్యేకత ఏమిటి? వేగం, చార్జీలు ఎలా ఉంటాయి? భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఈ ప్రాజెక్టుపై ఎంత ఖర్చు చేస్తున్నారు? ప్రపంచంలో మరెక్కడెక్కడ హైడ్రోజన్ రైళ్లు నడుస్తున్నాయో తెలుసుకుందాం..!

హైడ్రోజన్ రైలు అంటే ఏమిటి?

సాధారణంగా రైళ్లు డీజిల్, విద్యుత్‌పై ఆధారపడి నడుస్తున్నాయి. అయితే, హైడ్రోజన్ రైళ్లు విద్యుత్, సంప్రదాయ ఇంధనాలకు బదులుగా హైడ్రోజన్‌ను ఉపయోగిస్తాయి. ఈ రైళ్లలో అమర్చిన ప్రత్యేక ఇంజిన్ వ్యవస్థ హైడ్రోజన్ నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేసి రైలును నడిపిస్తుంది. హైడ్రోజన్ ఇంధన కణాలు (ఫ్యూయల్ సెల్స్) ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఈ ప్రక్రియలో ప్రధానంగా నీటి ఆవిరి మాత్రమే విడుదల అవుతుంది. డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వినియోగంతో భారీగా కార్బన్ ఉద్గారాలు వెలువడతాయి. ఇవి గ్రీన్‌హౌస్ వాయువుల పెరుగుదలకు, భూతాపానికి ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే డీజిల్ ఇంజిన్లు అత్యధిక కాలుష్యాన్ని సృష్టించే రవాణా సాధనాల్లో ఒకటిగా నిలిచాయి. భారత రైల్వే ఇప్పటికే డీజిల్ రైళ్ల స్థానంలో ఎలక్ట్రిక్‌ లోకోమెటివ్‌లను ప్రవేశపెడుతోంది. అయితే, విద్యుత్ రైళ్లు కూడా పూర్తిగా కాలుష్య రహితం కావు. ఎందుకంటే వాటికి అవసరమైన విద్యుత్‌లో ఎక్కువ భాగం ఇప్పటికీ బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచే వస్తోంది. బొగ్గు కూడా ఒక శిలాజ ఇంధనమే. ఈ నేపథ్యంలో హైడ్రోజన్ రైళ్లు మరింత పర్యావరణ అనుకూలమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ఇవి కార్బన్ ఉద్గారాలను గణనీయంగా తగ్గించడమే కాకుండా.. శక్తి వినియోగంలోనూ సమర్థవంతంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు

  • ఇది దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే బ్రాడ్‌గేజ్ పట్టాలపై నడిచే పొడవైన హైడ్రోజన్ రైళ్లలో ఒకటిగా నిలవనుంది.
  • ఈ రైలులో మొత్తం పది కోచ్‌లు ఉంటాయి.
  • ఇందులో 2 డ్రైవింగ్ పవర్ కార్లు, 8 ప్రయాణికుల కోచ్‌లు ఉంటాయి.
  • మొత్తం సామర్థ్యం 2400 కిలోవాట్లు.
  • ఒక్కో పవర్ కారుకు 1200 కిలోవాట్ల సామర్థ్యం ఉంటుంది.
  • జింద్–సోనిపట్ మార్గంలో రైలు రాకపోకలు సాగిస్తుంది.
  • జింద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రీఫ్యూయలింగ్‌ సెంటర్‌లో కంప్రెస్డ్ హైడ్రోజన్ నింపుతారు.
  • రైలు నిర్వహణ కోసం హైడ్రోజన్ కంప్రెషన్ వ్యవస్థ, అవసరమైన సాంకేతిక పరికరాలు, అత్యవసర విడిభాగాలను సిద్ధం చేశారు.
  • సాంకేతిక సమస్యలు తలెత్తిన సమయంలో సేవలకు అంతరాయం కలగకుండా అదనపు కంప్రెసర్ యూనిట్‌ను నెలకొల్పుతున్నారు.

భద్రతకు ప్రత్యేక చర్యలు

  • హైడ్రోజన్ వాయువు అత్యంత తేలికైంది. మండే స్వభావం కలిగి ఉంటుంది. దాంతో ఆధునిక సాంకేతికతతో భద్రతా చర్యలు చేపట్టారు.
  • హైడ్రోజన్ లీక్‌ను గుర్తించే పరికరాలు ఏర్పాటు చేశారు.
  • అగ్ని ప్రమాదాలను గుర్తించే ఫ్లేమ్ డిటెక్టర్లను అమర్చారు.
  • హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, నింపే కేంద్రాలను నిరంతరం పర్యవేక్షిస్తారు.
  • 24 గంటల పాటు వ్యవస్థపై నిఘా ఉంటుంది.
  • ప్రారంభ దశలో సాంకేతిక నిపుణులు రైలుతో పాటు ప్రయాణించి సమస్యలను పరిష్కరిస్తారు.
  • రైలుకు సంబంధించిన నిర్వహణ, హైడ్రోజన్ ప్లాంట్ ఆపరేషన్ విధానాలను రైల్వే డిజైన్ సంస్థ ఆర్‌డీఎస్‌ఓ ఆమోదించింది.

జింద్–సోనిపట్ హైడ్రోజన్ రైలు వివరాలు

మార్గం : జింద్–సోనిపట్
దూరం : సుమారు 90 కిలోమీటర్లు
ప్రయాణ సమయం : దాదాపు గంట
ప్రారంభంలో వేగం : గంటకు 75 కిలోమీటర్లు
భవిష్యత్‌లో గరిష్ట వేగం : గంటకు 110–140 కిలోమీటర్లు
స్టేషన్లు : జింద్‌-సోనిపట్‌ మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉంటాయి
ప్రతిపాదిత కనిష్ఠ చార్జీ : రూ.5
గరిష్ఠ చార్జీ: రూ.25
ప్రయాణికుల సామర్థ్యం : సుమారు 2,500 మంది

ఈ మార్గంలోనే ఎందుకు.. వ్యయం ఎంత?

భారత రైల్వేలో ఎక్కువ భాగం బ్రాడ్‌గేజ్ మార్గాలు ఇప్పటికే విద్యుద్దీకరించారు. అయితే విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయడం కష్టమైన, అధిక వ్యయం అయ్యే ప్రాంతాల్లో హైడ్రోజన్ సాంకేతికతను పరీక్షించాలని రైల్వే నిర్ణయించింది. జింద్‌లో ఇప్పటికే హైడ్రోజన్ ప్లాంట్ ఉండటం, మార్గం తక్కువ దూరంలో ఉండటం, రైలు వేగం పరిమితంగా ఉండటం వంటి కారణాలు ఈ మార్గాన్ని పైలట్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఉంటుందని రైల్వేశాఖ భావించింది. హైడ్రోజన్ రైలు ప్రాజెక్టు అభివృద్ధి కోసం 2023-24 బడ్జెట్‌లో రైల్వే మంత్రిత్వ శాఖ రూ.2,800 కోట్లు కేటాయించింది. ఈ నిధులను పరిశోధన, డిజైన్, పరీక్షలు, అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగిస్తున్నారు. అదే విధంగా ఇప్పటికే ఉన్న డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (డెము) రైళ్లలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ అమర్చేందుకు రూ.111.83 కోట్ల విలువైన పైలట్ ప్రాజెక్టుకు కూడా ఆమోదం లభించింది. ప్రస్తుతం హైడ్రోజన్ రైళ్ల నిర్వహణ వ్యయంపై స్పష్టత లేదు. ప్రారంభంలో ఎక్కువగా ఉండొచ్చని.. రైళ్ల సంఖ్య పెరిగే కొద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.

‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ ప్రాజెక్టుగా..

పర్యావరణ పరిరక్షణతో పాటు వారసత్వ రైలుమార్గాలను కాపాడేందుకు భారత రైల్వే ‘హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్’ ప్రాజెక్టును చేపట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొత్తం 35 హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టాలని ప్రణాళిక రూపొందించారు. ముఖ్యంగా పర్వత, హెరిటేజ్‌ మార్గాల్లో వీటిని నడపాలని రైల్వే భావిస్తోంది. ఒక్కో హైడ్రోజన్ రైలు తయారీకి సుమారు రూ.80 కోట్లు, ప్రతి మార్గంలో అవసరమైన హైడ్రోజన్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరో రూ.70 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా.

ప్రపంచంలో హైడ్రోజన్‌ రైళ్లు ఎక్కడ నడుస్తున్నాయంటే..

హైడ్రోజన్ రైళ్ల సాంకేతిక విషయంలో ఇప్పటికే పలు దేశాలు ముందున్నాయి. తాజాగా ఆయా దేశాల సరసన భారత్‌ సైతం చేరబోతోంది. జర్మనీ 2016లో ప్రపంచంలో తొలి హైడ్రోజన్ రైలును ప్రవేశపెట్టింది. 2018 నుంచి ఆల్స్టమ్ కొరాడియా ఐలింట్ రైళ్లు వాణిజ్య సేవలు అందిస్తున్నాయి. అలాగే, చైనా నగర రవాణా, పర్యాటక అవసరాల కోసం హైడ్రోజన్ రైళ్లను ఉపయోగిస్తోంది. జపాన్‌ సురుమి లైన్ సహా పలు మార్గాల్లో హైడ్రోజన్ రైళ్లను పరీక్షించింది. అమెరికా దక్షిణ కాలిఫోర్నియాలో ‘అరో’ పేరుతో హైడ్రోజన్ ప్రయాణికుల రైలు నడుస్తోంది. అలాగే, ఫ్రాన్స్, స్వీడన్, బ్రిటన్, స్విట్జర్లాండ్ దేశాలు కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికతపై పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తున్నాయి. భారత తొలి హైడ్రోజన్ రైలు కేవలం కొత్త రవాణా సాధనం మాత్రమే కాకుండా కాలుష్య రహిత ప్రయాణం వైపు వేస్తున్న కీలక అడుగుగా రైల్వే అధికారులు అభివర్ణించారు. భవిష్యత్‌లో మరిన్ని హైడ్రోజన్ రైళ్లు పట్టాలెక్కితే.. పర్యావరణ పరిరక్షణలో భారత రైల్వే కొత్త దిశను చూపించే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement