త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

JMM | అటా.. ఇటా!.. డీలిమిటేష‌న్‌పై ఎటూ తేల్చ‌ని జార్ఖండ్ ముక్తి మోర్చా

JMM | కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి (INDIA Bloc) చెందిన పార్టీలు ఒక్కొక్క‌టిగా జారుకుంటున్నాయి. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత డీఎంకే (DMK) దూర‌మ‌వ‌గా.. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు మ‌హారాష్ట్ర‌లోని ఎన్సీపీ (శ‌ర‌ద్‌ప‌వార్‌) సంపూర్ణ‌ మ‌ద్ద‌తు తెలిపింది.

G

National | Published On Nov 29, 2026, 7.51 am IST

JMM | అటా.. ఇటా!.. డీలిమిటేష‌న్‌పై ఎటూ తేల్చ‌ని జార్ఖండ్ ముక్తి మోర్చా
Advertisement

JMM | త్రినేత్ర న్యూస్‌: కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూట‌మికి (INDIA Bloc) చెందిన పార్టీలు ఒక్కొక్క‌టిగా జారుకుంటున్నాయి. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత డీఎంకే (DMK) దూర‌మ‌వ‌గా.. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం తీసుకొస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు మ‌హారాష్ట్ర‌లోని ఎన్సీపీ (శ‌ర‌ద్‌ప‌వార్‌) సంపూర్ణ‌ మ‌ద్ద‌తు తెలిపింది. మ‌రోవైపు ఇండీ కూట‌మికి చెందిన మ‌రో పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌లేదు. మ‌హిళా రిజ‌ర్వేన్ల బిల్లు, డీలిమిటేష‌న్ బిల్లులు ఆమోదం పొందాలంటే అధికార బీజేపీకి మ‌రో 10 మంది ఎంపీల మ‌ద్ద‌తు అవ‌స‌ర‌ముంది. ఈ నేప‌థ్యంలో జేఎంఎం ఏ నిర్ణ‌యం తీసుకోనుందనే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ పార్టీకి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లో చెరో ముగ్గురు చొప్పున ఎంపీలు ఉన్నారు.

ఈ నేప‌థ్యంలో జార్ఖండ్ (Jharkhand) ముఖ్య‌మంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) పార్టీ ఎంపీల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బిల్లుకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే విషయంపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని ముఖ్య‌మంత్రికే అప్పగించారు. ఈ నేప‌థ్యంలో బిల్లులోని అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని జేఎంఎం ప్రకటించింది. అయితే పెరిగే సీట్ల‌కు అనుగుణంగా ఎస్టీ రిజ‌ర్వ్‌డ్ సీట్ల సంఖ్య పెరుగుతుందా లేదా అనే విష‌యం ఆ పార్టీ నిర్ణయంలో కీలకం కానుంది.

తుది నిర్ణ‌యం సోరెన్‌దే..

ఎందుకంటే ప్రతిపాదిత 50 శాతం సీట్ల పెంపుతో జార్ఖండ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 14 నుంచి 21కి చేరే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రస్తుత స్థానాల్లో 5 షెడ్యూల్డ్ తెగలకు (STs) రిజర్వ్ అయ్యాయి. పెరిగే స్థానాల్లో ఎస్టీల‌కు ఎన్ని ద‌క్కుతాయ‌నే దానిపై స్ప‌ష్ట రావాల్సి ఉంది. అయితే సవరించిన సీట్ల కేటాయింపు జార్ఖండ్ ప్రయోజనాలకు నష్టం కలిగిస్తుందని భావిస్తే పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉంది.

కాగా, బిల్లుపై నిర్ణయం తీసుకునే ముందు హేమంత్ సోరెన్ దానిని పరిశీలిస్తారని జేఎంఎం రాజ్యసభ ఎంపీ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. పార్లమెంట్ పోర్టల్‌లో బిల్లు ముసాయిదాను అప్‌లోడ్ చేసిన వెంటనే పార్టీ దానిని పూర్తిగా అధ్యయనం చేస్తుందని మరో ఎంపీ మహువా మాఝీ చెప్పారు.

సవరించిన బిల్లుల ప్రతిపాదనలు ఇవే..

అన్ని రాష్ట్ర‌లు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్‌సభ స్థానాలను 50 శాతం పెంచాలని, సవరించిన సీట్ల కేటాయింపులు, నియోజకవర్గ సరిహద్దులను 2051 వరకు కొనసాగించాలని కేంద్రం ప్రతిపాదించింది. జనాభా ప్రాతిపదికన సీట్ల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే విధంగా 50 శాతం సీట్లను పెంచడంతో సభలో ఆయా రాష్ట్రాల వాటాకు భంగం కలగకుండా ఉంటుంది. దీంతో లోక్‌స‌భ‌లో మొత్తం స్థానాల సంఖ్య‌ 543 నుంచి సుమారు 815కి చేరుతుంది.

2026 రాజ్యాంగ (132వ సవరణ) బిల్లు ద్వారా లోక్‌సభ గరిష్ట సీట్ల పరిమితిని 550 నుంచి 850కి పెంచనున్నారు. ఇందులో రాష్ట్రాలకు గరిష్టంగా 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు ఉంటాయి. సవరించిన చట్టం ప్రకారం మొదటి డీలిమిటేషన్ పూర్తయిన తర్వాత మహిళలకు మూడింట ఒక వంతు (33 శాతం) రిజర్వేషన్లు (Women’s quota) అమల్లోకి వస్తాయి. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి ఈ రిజర్వేషన్లను అమల్లోకి తీసుకురావాలని కేంద్రం భావిస్తున్న‌ది.

Advertisement
Advertisement