త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengal Voter Turnout 2026 | బెంగాల్‌లో చరిత్రాత్మక పోలింగ్.. సాయంత్రం 5 గంటలకే 90% క్రాస్.. ఆసక్తి రేపుతున్న ఎగ్జిట్ పోల్స్!

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తుది దశ పోలింగ్‌లో ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 89.99 శాతం పోలింగ్ నమోదై, 2021 ఎన్నికల రికార్డును బద్దలుకొట్టింది. మరోవైపు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠను రేపుతున్న ఎగ్జిట్ పోల్స్ మరికాసేపట్లో వెలువడనున్నాయి.

J

National | Published On Apr 29, 2026, 6.20 pm IST

Bengal Voter Turnout 2026 | బెంగాల్‌లో చరిత్రాత్మక పోలింగ్.. సాయంత్రం 5 గంటలకే 90% క్రాస్.. ఆసక్తి రేపుతున్న ఎగ్జిట్ పోల్స్!

సంక్షిప్త సారాంశం

బెంగాల్ ఎన్నికల్లో చరిత్రాత్మక ఓటింగ్ నమోదైంది. రెండో దశలో సాయంత్రం 5 గంటల వరకే దాదాపు 90 శాతం (89.99%) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్‌లో 85.51 శాతం పోలింగ్ జరగ్గా, ఆస్గ్రామ్ (Ausgram), పుర్బా బర్ధమాన్‌లలో అత్యధికంగా ఓటింగ్ నమోదైంది. ఇదే సమయంలో ఐదు రాష్ట్రాల (బెంగాల్, అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి) ఎన్నికల సరళిపై అంచనాలను వెల్లడించే ఎగ్జిట్ పోల్స్ సాయంత్రం 6:30 గంటల తర్వాత విడుదల కానున్నాయి.

Advertisement

Bengal Voter Turnout 2026 | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ (West Bengal) ఎన్నికల రెండో విడత పోలింగ్‌లో జనం బ్రహ్మరథం పట్టారు. ఎన్నడూ లేని విధంగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఏకంగా 89.99 శాతం పోలింగ్ నమోదై రికార్డు సృష్టించింది. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే 142 స్థానాలకు గాను 80.4 శాతం పోలింగ్ నమోదు కాగా, తాజా ఎన్నికల్లో ఆ రికార్డు సునాయాసంగా బద్దలైంది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి బూత్‌లలో క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించడంతో తుది పోలింగ్ శాతం ఏకంగా 95 శాతానికి చేరుకునే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.

హోరాహోరీగా ఓటింగ్.. ముందంజలో పుర్బా బర్ధమాన్

నియోజకవర్గాల వారీగా ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే.. ఆస్గ్రామ్ (Ausgram) నియోజకవర్గంలో అత్యధికంగా 94.06 శాతం పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానంలో హబ్రా (Habra) 93 శాతంతో నిలిచింది. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక భవానీపూర్ నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటల వరకు 85.51 శాతం ఓటింగ్ జరిగింది. జిల్లాల వారీగా చూస్తే పుర్బా బర్ధమాన్ 92.46 శాతంతో ముందంజలో ఉండి ఓటర్ల ఉత్సాహాన్ని ప్రతిబింబించగా, కోల్‌కతా నార్త్ లో 87.77 శాతం పోలింగ్ నమోదైంది.

మరికాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. ఎవరిది పైచేయి?

మరోవైపు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎగ్జిట్ పోల్స్ (Exit Polls) మరికాసేపట్లో వెలువడనున్నాయి. సాయంత్రం 6:30 గంటల తర్వాత వివిధ సర్వే సంస్థలు తమ అంచనాలను విడుదల చేయనున్నాయి. ఈ సర్వేలు పలు కీలక ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నాయి.

బెంగాల్‌లో మమతా బెనర్జీని గద్దె దించి బీజేపీ అధికారంలోకి వస్తుందా? తమిళనాడులో బలమైన డీఎంకే-అన్నాడీఎంకేల ఓటు బ్యాంకుకు విజయ్ గండికొట్టగలరా? అస్సాంలో హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని బీజేపీ భారీ విజయం సాధిస్తుందా? లేక కాంగ్రెస్ పుంజుకుంటుందా? కేరళలో వామపక్షాలు (Left Front) వరుసగా మూడోసారి సత్తా చాటుతాయా?

అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనని, కొన్నిసార్లు వాస్తవ ఫలితాలు వీటికి భిన్నంగా వచ్చే అవకాశం కూడా ఉందనే విషయాన్ని గమనించాలి.

మొత్తం 17 కోట్ల మంది ఓటర్లు

మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఈ భారీ ఎన్నికల పోరులో 17 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. ఏప్రిల్ 9న అస్సాం, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలు జరగ్గా.. ఏప్రిల్ 23న తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23న తొలి విడత జరగ్గా, ఇప్పుడు రెండో విడత ఓటింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది.

Advertisement
Advertisement