Nepal Flash Floods | నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు : విదేశాంగ శాఖ
Nepal Flash Floods | హిమాలయ దేశం నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతైనట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కైలాస మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయులను రక్షించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. అదే సమయంలో చైనా వైపు సుమారు 150 మంది గల్లంతైనట్లు వివరించారు.
Nepal Flash Floods | త్రినేత్ర.న్యూస్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల్లో (Nepal Flash Floods) 288 మంది భారతీయులు గల్లంతైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకూ 21 మంది భారతీయులను రక్షించినట్లు పేర్కొంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది.
ఢిల్లీలో విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మీడియాతో మాట్లాడారు. గల్లంతైన వారిలో తమిళనాడుకు చెందిన వారు 86 మంది ఉన్నట్లు తెలిపారు. వీరు రెండు బృందాలుగా నేపాల్ వెళ్లినట్లు చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 32 మంది, కేరళకు చెందిన 33 మంది, ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపారు. త్రిశూలి విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 73 మంది భారతీయులు కూడా గల్లంతైనట్లు వెల్లడించారు. ఈ వరదల నుంచి కైలాస మానస సరోవర్ యాత్ర కోసం నేపాల్ వెళ్లిన తమిళనాడుకు చెందిన 21 మందిని రక్షించినట్లు తెలిపారు.
చైనా వైపు 150 మంది భారతీయులు గల్లంతు
ఈ వరదలకు చైనా వైపుకూడా కొన్ని ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడ వరదల్లో సుమారు 150 మంది భారతీయ పౌరులు గల్లంతైనట్లు విదేశాంగ ప్రతినిధి తెలిపారు. సుమారు 200 మంది సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. వారంతా సాయం కోసం విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. సాయం కోరిన వారిలో 95 మంది డార్చెన్‌లో, జిలాంగ్ నగరంలో నలుగురు, జుతుల్‌ఫుక్‌లో 30 మంది, సాగా ప్రాంతంలో 60-70 మంది భారతీయులు ఉన్నట్లు వివరించారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అక్కడి భారత దౌత్య బృందం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
నేపాల్‌లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ పౌరుల సమాచారం, సహాయం కోసం న్యూఢిల్లీలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అంతేకాదు, భారత రాయబార కార్యాలయాలు కూడా హాట్‌లైన్‌లను ఏర్పాటు చేసి.. రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రభావిత భారత పౌరుల సహాయార్థం, సమాచారం కోసం ఖాఠ్మాండూలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లను +977 985 131 6807, +977 970 910 7500 కూడా జారీ చేసింది.
270 మంది మృతి..
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో జల ప్రళయం చేసిన విలయతాండవానికి భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 270కి పెరిగింది. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. అనేక ఇళ్లు, వాహనాలు కొట్టుకుపోయాయి. దుకాణాలు, మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి.. నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా “వాటర్ బాంబ్”
జలప్రళయానికి అదే కారణం..
ఈ ప్రకృతి ప్రకోపానికి ఎగువన ఉన్న హిమనీ సరస్సు బద్దలవ్వడమే కారణమని అమెరికా తేల్చింది. నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8.37 గంటలకు నేపాల్-చైనా సరిహద్దు సమీపంలో 4.4 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తొలుత యూఎస్‌జీఎస్ ప్రకటించింది. తర్వాత ఉపగ్రహ చిత్రాలను పరిశీలించి అసలు విషయం వెల్లడించింది. అక్కడ ఎలాంటి భూకంపం సంభవించలేదని స్పష్టం చేసింది. ఉపగ్రహ చిత్రాల ప్రాథమిక పరిశీలనలో హిమనీ సరస్సు బద్ధలై భారీ మంచు చరియలు, రాళ్లు పడినట్లు గుర్తించినట్లు తెలిపింది. మంచు, రాళ్లు, మట్టితో కూడిన ప్రవాహం ఒక్కసారిగా కిందకు దూసుకొచ్చినట్లు వివరించింది.
30 నిమిషాల్లో 9 మీటర్లు ఉప్పొంగి..
ఆకస్మిక వరదల కారణంగా నేపాల్, టిబెట్ ప్రాంతంలోని నదుల్లో నీటిమట్టం ఒక్కసారిగా భారీగా పెరిగింది. గల్చి ప్రాంతం వద్ద త్రిశూలి నదిలో 30 నిమిషాల్లో నీరు 9 మీటర్ల ఎత్తుకు ఉప్పొంగింది. భోటే కోషి ఉపనది అయిన లెండేకోలాలోకి భారీగా మంచు, కొండ చరియలు దూసుకువచ్చాయి. ఈ తాకిడి తీవ్రస్థాయిలో ఉండటంతో నది ఒక్కసారిగా ఉప్పొంగింది. ఈ ప్రవాహంలో బండరాళ్లు కిందికి దూసుకొచ్చాయి. ఆ తర్వాత భోటే కోషి నది ద్వారా త్రిశూలి నదిలోకి నీటి ప్రవాహం చేరింది. దీని ఫలితంగా భారీ విధ్వంసం సంభవించింది.
ఇంకా పొంచి ఉన్న ముప్పు..
ఇప్పటికే సంభవించిన వరదలకు గ్రామాలకు గ్రామాలే తుడిచిపెట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిలు, వాహనాలు, ఇళ్లు కొట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. అనేక మంది ఆచూకీ గల్లంతైంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, వరద ముప్పు ఇంకా తొలిగిపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నేపాల్-చైనా సరిహద్దులోని నదిలో ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్న బ్లాకేజీ ఇంకా ఉందని, దాని కారణంగా మరోసారి భారీ వరద సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భారత్ చేయూత
ఇంతటి కష్టకాలంలో నేపాల్‌ను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. విపత్తు సహాయక చర్యల్లో భాగంగా తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. నేపాల్‌కు అవసరమైన అత్యవసర సహాయం, వైద్య బృందాలను ఖాఠ్మాండుకు పంపింది. భారత వాయుసేనకు చెందిన 'సీ-130జే' రవాణా విమానం ద్వారా 10 టన్నుల సహాయక సామగ్రిని అత్యవసరంగా నేపాల్‌కు తరలించింది. ఇందులో టెంట్లు, దుప్పట్లు, హైజీన్ కిట్లు, సోలార్ లాంతర్లు, మెడిసిన్స్ ఉన్నాయి.
80 మంది ఈశా ఫౌండేషన్ సభ్యులు..
ఈ వరదల్లో ఈశా ఫౌండేషన్ (Isha Foundation)కు చెందిన 80మంది యాత్రికులు కూడా గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్ వెల్లడించారు. నేపాల్ సరిహద్దు సమీపంలోని టిబెట్‌లోని గ్యిరాంగ్ (Gyirong) పట్టణంలో సంభవించిన భారీ ఆకస్మిక వరదల్లో తమ బృందానికి చెందిన సభ్యులు గల్లంతైనట్లు చెప్పారు. గల్లంతైన బృందంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ సహా ఇతర దేశాల నుంచి వచ్చిన యాత్రికులతోపాటూ వాలంటీర్లు, ఒక వైద్యుడు కూడా ఉన్నట్లు వివరించారు. మానసరోవర్ యాత్రకు వెళ్లి తిరుగుపయనమైన తమ బృందం ఇమిగ్రేషన్ కార్యాలయం వద్ద ఉండగా ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. వరదల్లో కార్యాలయం పూర్తిగా ధ్వంసమైనట్లు చెప్పారు. విపత్తు తర్వాత వారి గురించి ఎలాంటి సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గల్లంతైన యాత్రికుల కుటుంబాలతో కలిసి గ్యిరాంగ్‌కు వెళ్లేందుకు తమకు అనుమతి చైనా అధికారులను కోరినట్లు సద్గురు వెల్లడించారు.
Also Read..
నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
నకిలీ వైద్యులతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు..!
దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
ఆగస్టు 27, 2026

Nepal Floods | ఒక్క మంచు ఫలకం సృష్టించిన విధ్వంసం
ఆగస్టు 27, 2026

Chinas monster dam | నేపాల్ తరహాలో.. భారత్‌కు పొంచి ఉన్న చైనా “వాటర్ బాంబ్”
ఆగస్టు 27, 2026
తాజావార్తలు
- ●Gold Import Duty | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్..? బంగారంపై సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రం..?
- ●Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు
- ●CP Sajjanar | నకిలీ వైద్యులతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు..!
- ●Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు
- ●National Law School | సీజేఐపై విద్యార్థుల ఆగ్రహ ఫలితం.. స్నాతకోత్సవాన్ని రద్దు చేసిన నేషనల్ లా స్కూల్
- ●Chiranjeevi | సినిమా ఇండస్ట్రీ కొందరికి కాదు...అందరిదీ - రవితేజ ఇరుముడిపై చిరంజీవి పోస్ట్

Gold Import Duty | పెట్టుబడిదారులకు గుడ్ న్యూస్..? బంగారంపై సుంకాన్ని తగ్గించే యోచనలో కేంద్రం..?

Hyderabad girl goes missing in Nepal floods | నేపాల్ వరదల్లో హైదరాబాద్ యువతి గల్లంతు.. ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఎదురుచూపులు

CP Sajjanar | నకిలీ వైద్యులతో తస్మాత్ జాగ్రత్త.. హెచ్చరించిన హైదరాబాద్ పోలీసులు..!

Harish Rao | దేశంలో ఆరు డీఏలు పెండింగ్‌లో పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిదే.. ఇది అత్యంత సిగ్గుచేటు



