త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Petrol Price Hike | త్వ‌ర‌లో పెట్రో వాత‌..? ధ‌ర‌ల పెంపున‌కు రంగం సిద్ధం..!

Petrol Price Hike | త్వ‌ర‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచేందుకు చ‌మురు సంస్థ‌లు రంగం సిద్ధం చేస్తున్నాయి. మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొలన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఇంధ‌న ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. ఫ‌లితంగా ఈ ప్ర‌భావం దేశీయ చ‌మురు కంపెనీల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది.

P

National | Published On May 11, 2026, 6.03 pm IST

Petrol Price Hike | త్వ‌ర‌లో పెట్రో వాత‌..? ధ‌ర‌ల పెంపున‌కు రంగం సిద్ధం..!
Advertisement
  • న‌ష్టాలు భ‌రించ‌లేమంటున్న ఆయిల్ కంపెనీలు
  • లీట‌ర్‌కు రూ.5 దాకా పెంపు ఆలోచ‌న‌
  • క్రూడాయిల్ ధ‌ర‌ల పెరుగుద‌లే కార‌ణం
  • సామాన్యుల ప‌ర్స్‌పై తీవ్ర ప్ర‌భావం

Petrol Price Hike | త్రినేత్ర‌.న్యూస్ : త్వ‌ర‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెంచేందుకు చ‌మురు సంస్థ‌లు రంగం సిద్ధం చేస్తున్నాయి. మ‌ధ్య‌ప్రాచ్యంలో నెల‌కొలన్న ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో గ్లోబ‌ల్ మార్కెట్‌లో ఇంధ‌న ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయి. ఫ‌లితంగా ఈ ప్ర‌భావం దేశీయ చ‌మురు కంపెనీల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డుతోంది. న‌ష్టాల‌ను త‌గ్గించుకునేందుకు ధ‌ర‌ల‌ను పెంచ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌ని సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి. ఈ క్ర‌మంలో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌పై లీట‌ర్‌కు సుమారు రూ.5 వ‌ర‌కు పెంచే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇంధన విక్రయాలపై రోజుకు సుమారు ప‌ది బిలియన్ మేర నష్టాలు వస్తున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ నష్టాల నుంచి గ‌ట్టెక్కేందుకు ధ‌ర‌ల‌ను స‌వ‌రించ‌క త‌ప్ప‌ద‌ని అధికార కంపెనీలు భావిస్తున్నాయి.

న‌ష్టాలు త‌గ్గాలంటే రూ.20 దాకా పెంచాల్సిందే..

అయితే, న‌ష్టాల‌ను పూర్తి స్థాయిలో త‌గ్గించేందుకు లీట‌ర్‌కు రూ.15 నుంచి రూ.20 వ‌ర‌కు పెంచాల్సిన అవ‌స‌రం ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అంత భారీ స్థాయిలో ధ‌ర‌లు పెంచితే ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై ఒత్తిడి పెరిగ‌డంతో పాటు రాజ‌కీయంగా ప్ర‌భావం చూపే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా చ‌మురును దిగుమ‌తి చేసుకునే దేశాల్లో భార‌త్ మూడో స్థానంలో ఉంది. ఇరాన్‌-గ‌ల్ఫ్ మ‌ధ్య నెల‌కొన్న యుద్ధం ప్ర‌భావం తీవ్రంగా ప‌డుతోంది. ముఖ్యంగా హార్ముజ్ జ‌ల‌సంధి మూసివేత‌తో ముడి చ‌మురు దిగుమ‌తులు త‌గ్గిపోయాయి. దీంతో ఇంధన ధరలు పెరగడంతో పాటు వంటగ్యాస్ సరఫరాలోనూ తీవ్ర ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి.

రోజుకు 30 కోట్ల లీట‌ర్ల పెట్రోల్‌..

భార‌త్ ప్ర‌తిరోజూ సుమారు 50 నుంచి 55 లక్షల బ్యారెళ్ల క్రూడాయిల్‌కు స‌మాన‌మైన ఇంధ‌నాన్ని వినియోగిస్తుంది. ఇందులో పెట్రోల్‌, డీజిల్‌, ఎల్‌పీజీ వంటివి ప్ర‌ధాన అవ‌స‌రాలని ప్ర‌భుత్వ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. పెట్రోల్ వినియోగం 30కోట్ల లీట‌ర్లు, డీజిల్ 40 కోట్ల లీట‌ర్ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా. దేశ అవసరాల్లో దాదాపు 85 శాతం వరకు క్రూడాయిల్ విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. నెలకు సగటున 18 నుంచి 20 మిలియన్ మెట్రిక్ టన్నుల క్రూడాయిల్ భారత్ దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ ధరల ఆధారంగా దీని విలువ నెలకు సుమారు 10 నుంచి 12 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. వెస్ట్ ఆసియా సంక్షోభం నేప‌థ్యంలో త‌మ‌కు భారీగా న‌ష్టం జ‌రుగుతోంద‌ని ఆయిల్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో రోజుకు సుమారు రోజుకు రూ.1600 నుంచి రూ.1700 కోట్ల వ‌ర‌కు న‌ష్టాలు వ‌స్తున్న‌ట్లు అంచ‌నా. ప్రభుత్వ రంగ చ‌మురు కంపెనీలైన ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌ రోజుకు గ‌త ప‌ది వారాల్లో రూ.ల‌క్ష కోట్ల‌కుపైగా న‌ష్ట‌పోయిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తెలిపాయి.

ధ‌ర‌లు పెరిగితే సామాన్యుల‌పై ప్ర‌భావం..

ధరలు పెరిగితే రవాణా రంగంపై తక్షణ ప్రభావం పడనుంది. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశాలున్నాయి. డీజిల్ ధరల పెరుగుదల వ్యవసాయం, లాజిస్టిక్స్ రంగాన్ని తీవ్రంగా ప్ర‌భావితం చేయ‌నుంది. పెట్రోల్ ధరలు పెంపుతో వ్యక్తిగత వాహనదారుల‌పై అద‌న‌పు భారం ప‌డ‌నుంది. ఇప్ప‌టికే పెరిగిన సిలిండ‌ర్ల ధ‌ర‌ల‌తో సామాన్యుల‌పై ప్ర‌భావం ప‌డ‌గా.. పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు పెరిగితే సామాన్యుల ప‌ర్సుపై మ‌రింత భారం ప‌డుతుంద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement