త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Govt Employees Insurance | నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తున్నారు.. అవును.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే..!

రవీంద్రభారతి వేదికగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం రేవంత్ కోటి రూపాయల ప్రమాద బీమా ప్రకటించారు. రాష్ట్రాదాయం పెంచేందుకు రోజుకో గంట అదనంగా పనిచేయాలని కోరారు.

J

Telangana | Published On Jun 25, 2026, 9.27 pm IST

Telangana Govt Employees Insurance | నన్ను గుంపు మేస్త్రీ అని అవహేళన చేస్తున్నారు.. అవును.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే..!
Advertisement
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉచితంగా రూ.1 కోటి ప్రమాద బీమా కల్పించేలా బ్యాంకర్లతో ప్రభుత్వ ఒప్పందం
  • సింగరేణి కార్మికులకు విజయవంతంగా అమలు చేసిన బీమాను ఇప్పుడు రాష్ట్ర ఉద్యోగులకూ వర్తింపు
  • గత పదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దివాళా తీయించారంటూ మాజీ సీఎం కేసీఆర్‌పై రేవంత్ తీవ్ర విమర్శలు
  • రాష్ట్ర ఆదాయం పెంచేందుకు ఉద్యోగులు రోజూ ఒక గంట అదనంగా పనిచేయాలని ముఖ్యమంత్రి పిలుపు

Telangana Govt Employees Insurance | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. సింగరేణి కార్మికుల తరహాలోనే.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎలాంటి ప్రీమియం లేకుండా రూ. 1 కోటి ప్రమాద బీమా (Accidental Insurance) కల్పించేలా బ్యాంకర్లతో గురువారం కీలక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆకట్టుకుంది. ఉద్వేగభరిత వ్యాఖ్యలతో పాటు ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఆ నమ్మకంతోనే కోటి రూపాయల బీమా

"సింగరేణి కార్మికులకు ఉచితంగా కోటి రూపాయల బీమా అని డిప్యూటీ సీఎం ప్రతిపాదించినప్పుడు మొదట నాకే నమ్మకం కలగలేదు. ఒక్క రూపాయి కట్టకుండా ఇది ఎలా సాధ్యం అనిపించింది. కానీ, ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కుటుంబాలకు ఆ బీమా సొమ్ము అందించి మేం సాధ్యమని నిరూపించాం" అని సీఎం అన్నారు. మనిషి బతికి ఉన్నప్పుడే బంధాలు.. చనిపోతే కేవలం సానుభూతి మాత్రమే మిగులుతుందని.. అలాంటి కష్టకాలంలో ఆర్థికంగా ఆదుకునే ఈ ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబాలకు గొప్ప భరోసా ఇస్తుందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని అని, ఆ భద్రతా బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.

అవును.. నేను గుంపు మేస్త్రీనే

తనను 'గుంపు మేస్త్రీ' అంటూ విమర్శిస్తున్న వారిపై సీఎం రేవంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "ఎవరు ఎలా మాట్లాడుకున్నా.. అవును, నేను గుంపు మేస్త్రీనే! ఈ గుంపంతా నాదే.. ఈ గుంపే నా బలం, నా ప్రతిష్ఠ. కొందరిలా మేం దొరలం, మాకు గడీలు ఉన్నాయని నేను గొప్పలు చెప్పుకోను. నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ 'రేవంతన్న'నే. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధం" అని ముఖ్యమంత్రి ఉద్వేగంగా మాట్లాడారు.

ఫామ్‌హౌస్‌లో కుంభకర్ణుడు.. బయటకొస్తే బకాసురుడు

గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై సీఎం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని పదేళ్లలో రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పుల్లో ముంచి దివాళా తీయించారని మండిపడ్డారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారని, గత ప్రభుత్వ హయాంలో ఒకటో తారీఖున జీతాలు ఎప్పుడైనా వచ్చాయా అని ఉద్యోగులను అడిగారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని రేవంత్ ఫైర్ అయ్యారు. "మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ (Metro expansion) చేస్తుంటే వద్దే వద్దు అంటున్నారు. ఫామ్‌హౌస్‌లో ఉంటే కుంభకర్ణుడు.. బయటికి వస్తే బకాసురుడు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొంచెమైనా వారికి కృతజ్ఞత ఉందా?" అని కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణ కోసం సర్వం కోల్పోయినవారికి తమ ప్రభుత్వం పదవులు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. తాను 30 నెలలుగా ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని, కాలుష్యం, ట్రాఫిక్ జామ్ తప్ప ఢిల్లీలో ఏమీ లేకపోయినా.. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే పదే పదే అక్కడికి వెళ్తున్నానని స్పష్టం చేశారు.

రోజుకో గంట ఎక్కువ పనిచేయండి

ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, దానిని గ్రౌండ్ లెవెల్‌లో సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసేది ఉద్యోగులేనని సీఎం గుర్తుచేశారు. "రోజుకో గంట ఎక్కువ పనిచేయండి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం (State Revenue) పెంచండి. మీరు పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలు తీర్చడానికే ఉపయోగిస్తాం" అని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. 2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీ (1 Trillion Dollar Economy) గా తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని కోరారు. ప్రజల కోసం తెచ్చుకున్న తెలంగాణలో, వారి కోసం పనిచేసే ఉద్యోగులకు ఈ ప్రభుత్వం ఎప్పుడూ తోడుగా ఉంటుందని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement