త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RDS Water Dispute Telangana | తుంగభద్ర గేట్లు మారితే మన నీళ్లొస్తాయా రేవంత్? హరీశ్ ఫైర్

తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చితే తెలంగాణకు 15.90 టీఎంసీల నీళ్లు వస్తాయా? ఫొటోషూట్లు మాని జల వివాదాలపై సమాధానం చెప్పాలంటూ సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.

J

Telangana | Published On Jun 25, 2026, 9.04 pm IST

RDS Water Dispute Telangana | తుంగభద్ర గేట్లు మారితే మన నీళ్లొస్తాయా రేవంత్? హరీశ్ ఫైర్
Advertisement
  • తుంగభద్ర గేట్ల మార్పిడిపై సీఎం రేవంత్ సంబరాలు చేసుకోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన మాజీ మంత్రి హరీశ్ రావు
  • ఆర్డీఎస్ (RDS) ద్వారా తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల వాటా సాధించకుండా ఇది సువర్ణ అధ్యాయం ఎలా అవుతుందని సూటి ప్రశ్న
  • "సిస్టమ్ లాసెస్" వాదనకు తలొగ్గడం ఏంటని, ఏపీ అక్రమ నీటి వినియోగాన్ని ఎందుకు నిలదీయలేదని ఆగ్రహం
  • కర్ణాటక, ఏపీలు ప్రతిపాదిస్తున్న నవేలి, గుండ్రేవుల ప్రాజెక్టులను సీఎం ఎందుకు వ్యతిరేకించలేదని నిలదీత

RDS Water Dispute Telangana | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ వద్ద మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీని "సువర్ణ అధ్యాయం"గా అభివర్ణించిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ (BRS) డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేవలం డ్యామ్ గేట్లు మార్చినంత మాత్రాన తెలంగాణకు దక్కాల్సిన 15.90 టీఎంసీల కృష్ణా జలాల వాటా వచ్చేస్తుందా? అని ఆయన సూటిగా ప్రశ్నించారు. కేవలం ఫొటోషూట్ల కోసం డ్రామాలు కట్టిపెట్టి, రాష్ట్ర నీటి హక్కుల సాధనపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆర్డీఎస్ (RDS) కష్టాలకు పరిష్కారం ఏది?

రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ (RDS) విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి ఏదైనా స్పష్టమైన హామీ సాధించారా? అని హరీశ్ రావు నిలదీశారు. ఆంధ్రా వైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు రిపేర్లు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించారా? అని ప్రశ్నించారు. అలాగే, కర్ణాటక పరిధిలోని ఆర్డీఎస్ కాలువ నిర్వహణపై ఆ రాష్ట్రం నుంచి ఎలాంటి గ్యారెంటీ తీసుకున్నారని అడిగారు.

ఈ పనులు జరగకపోవడం వల్లే తెలంగాణ ఏటా తన వాటాను కోల్పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 75 ఏళ్లుగా పాత గేట్లు ఉన్నా.. మనకు ఏనాడూ 5 టీఎంసీలకు మించి నీళ్లు రాలేదన్న విషయాన్ని గుర్తుచేశారు. తుంగభద్ర డ్యామ్ గేట్లు మార్చడానికి, మనకు రావాల్సిన అసలు వాటాకు ఎలాంటి సంబంధమూ లేదన్నారు.

"సిస్టమ్ లాసెస్" వాదనకు ఎందుకు తలొగ్గారు?

సీఎం రేవంత్ తీరుపై ప్రశ్నల వర్షం కురిపించిన హరీశ్ రావు.. "సిస్టమ్ లాసెస్" (System Losses) అనే వాదనను తెలంగాణ ఎలా అంగీకరిస్తుందని మండిపడ్డారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (KWDT-I) అవార్డులో అసలు ఈ విధానానికి గుర్తింపే లేదన్నారు. ట్రిబ్యునల్ పరిధిలో లేని వాదనను అడ్డుపెట్టుకుని మన వాటాను తగ్గించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఏపీ ప్రభుత్వం పరిమితికి మించి కృష్ణా జలాలను వాడుకుంటున్న తీరును రేవంత్ ఎందుకు ప్రశ్నించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీ కెనాల్ (KC Canal) కోసం సుంకేసుల వద్ద ఏపీ ఏకంగా 39 టీఎంసీలు వాడుకోవడమే కాకుండా, కర్ణాటకతో కుమ్మక్కై కేసీ కెనాల్‌కు వెళ్లాల్సిన దాదాపు 10 టీఎంసీల నదీ జలాలను RBHLC, RBLLC లకు అక్రమంగా మళ్లిస్తోందని, దీనివల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా సీఎం ఎందుకు సైలెంట్ అయ్యారని ఆరోపించారు.

ఆ కొత్త ప్రాజెక్టులతో ముప్పున్నా అడగరా?

తెలంగాణ నీటి హక్కులకు ఉరితాడులా మారుతున్న కొత్త ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. తుంగభద్ర డ్యామ్, ఆర్డీఎస్ మధ్య కర్ణాటక ప్రభుత్వం 'నవేలి రిజర్వాయర్' (Navali Reservoir) నిర్మించి 35 టీఎంసీలు వాడుకోవాలని చూస్తోంది. అటు.. ఆర్డీఎస్, సుంకేసుల మధ్య ఏకంగా 20 టీఎంసీల సామర్థ్యంతో 'గుండ్రేవుల ప్రాజెక్టు' (Gundrevula Project) కట్టే ప్లాన్‌లో ఏపీ సర్కార్ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల వల్ల తెలంగాణ వాటాకు తీవ్ర గండి పడుతుంటే.. సీఎం రేవంత్ కనీస అభ్యంతరం ఎందుకు తెలపలేదన్నారు.

ఈ కీలక సమస్యల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాకుండా, ఏపీ, కర్ణాటకల నుంచి ఎలాంటి హామీలు లేకుండానే.. తుంగభద్ర భేటీని "సువర్ణ అధ్యాయం" అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు కేటాయించిన నీరు పూర్తిగా అందడంపైనే ఆధారపడి ఉందని, నీటి పంపిణీలో న్యాయం జరగాలంటే ప్రచారాలు కాదు.. స్పష్టమైన ఫలితాలు కావాలని హరీశ్ రావు తేల్చి చెప్పారు.

Advertisement

తాజావార్తలు

Advertisement