త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!

భారత్ ఆర్థిక వ్యవస్థ 7.8% పరుగులు తీస్తోందని కేంద్రం కొత్త GDP లెక్కలు చెబుతున్నాయి.. కానీ అదే లెక్కల్లో గత ఏడాది GDP అంచనా ₹86.05 లక్షల కోట్ల నుంచి ₹80 లక్షల కోట్లకు మారింది. వృద్ధి రేటు బలంగా ఉన్నా.. ఆ ₹6.05 లక్షల కోట్ల భారీ మార్పు వెనుక అసలు లెక్కేంటి? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చకు దారితీస్తోంది.

S

National | Published On Sep 5, 2026, 3.08 pm IST

కేంద్రం కొత్త జీడీపీ లెక్కలు.. 7.8% వృద్ధి వెనుక ₹6.05 లక్షల కోట్ల ట్విస్ట్!

సంక్షిప్త సారాంశం

7.8% వృద్ధిని కొట్టిపారేయలేం.. కానీ పాత, కొత్త GDP లెక్కల మధ్య భారీ తేడా ఎందుకు వచ్చిందన్నది కీలక ప్రశ్న. ప్రభుత్వ వివరణ ఒకవైపు.. విమర్శకుల సందేహాలు మరోవైపు.. అసలు కథ మాత్రం GDP లెక్కల్లో పారదర్శకత, ఆ వృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంత కనిపిస్తుందన్నదే!

Advertisement

                                 7.8% జీడీపీ.. బలమైన వృద్ధా? బలహీనమైన లెక్కలా?

 

పాత లెక్కలో ₹86.05 లక్షల కోట్లు.. కొత్త లెక్కలో ₹80 లక్షల కోట్లు! 7.8% వృద్ధిని కొట్టిపారేయలేం.. కానీ ₹6.05 లక్షల కోట్ల భారీ పునఃఅంచనా వెనుక అసలు కథేంటి?

 

దేశ ఆర్థిక వ్యవస్థ 2026–27 తొలి మూడు నెలల్లో 7.8 శాతం వృద్ధి సాధించిందని కేంద్ర గణాంకాల శాఖ (MoSPI–Ministry of Statistics and Programme Implementation) ప్రకటించింది. 2022–23ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకున్న కొత్త GDP లెక్కల ప్రకారం, ఈ మూడు నెలల్లో నిజమైన GDP (ధరల పెరుగుదల ప్రభావాన్ని తీసేసిన ఆర్థిక ఉత్పత్తి విలువ) ₹81.36 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ధరల ప్రకారం GDP ₹88.27 లక్షల కోట్లుగా ఉంది. ఇది 10.3 శాతం పెరుగుదల. 7.8 శాతం వృద్ధి లెక్కను నేరుగా తప్పు అనడం సరికాదన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దల వాదన. అయితే ఈ లెక్కకు ఆధారమైన గత ఏడాది GDP అంచనా భారీగా మారడం మాత్రం కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

₹86.05 లక్షల కోట్లు.. ₹80 లక్షల కోట్లుగా ఎలా మారింది?

2025 ఆగస్టులో పాత 2011–12 ఆధారిత GDP సిరీస్ ప్రకారం 2025–26 తొలి త్రైమాసికం (Q1–ఏప్రిల్ నుంచి జూన్ వరకు) నామినల్ GDP ₹86.05 లక్షల కోట్లుగా ఉంది. కొత్త 2022–23 ఆధారిత లెక్కల విధానంలో అది ₹80.32 లక్షల కోట్లకు వచ్చింది. తర్వాత ₹80.44 లక్షల కోట్లకు మారి, కొత్త పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP), ఉత్పత్తిదారుల ధరల సూచీ (PPI) వంటి కొత్త గణాంకాలను చేర్చిన తర్వాత చివరకు ₹80 లక్షల కోట్లుగా నిలిచింది. అంటే పాత అంచనాతో పోలిస్తే ₹6.05 లక్షల కోట్ల తేడా. దాదాపు 7 శాతం. ఇది చిన్న మార్పు కాదు.

ఇక్కడే మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రధాన ప్రశ్న డిఫ్లేటర్ లేదా బేస్ ఇయర్ మార్పుపై మాత్రమే కాదు.. గత ఏడాది ప్రస్తుత ధరల GDP అంచనా ₹86.05 లక్షల కోట్ల నుంచి ₹80 లక్షల కోట్లకు ఇంత భారీగా ఎందుకు తగ్గింది అన్నదే. ఈ మార్పును పరిగణనలోకి తీసుకుంటే 7.8 శాతం వృద్ధి రేటు ఎంతవరకు ఆర్థిక వ్యవస్థ అసలు వేగాన్ని ప్రతిబింబిస్తోందో పరిశీలించాల్సిన అవసరం ఉందని ఆయన వాదిస్తున్నారు.

అయితే ప్రభుత్వం మాత్రం ఇది కావాలనే గత ఏడాది GDPని తగ్గించి ప్రస్తుత వృద్ధిని పెంచిన చర్య కాదని స్పష్టం చేసింది. బేస్ ఇయర్ మార్పు, కొత్త డేటా వనరులు, మెరుగైన లెక్కల పద్ధతులు, అందుబాటులోకి వచ్చిన కొత్త సూచికలను చేర్చడం వల్ల వరుసగా సవరణలు జరిగాయని MoSPI చెబుతోంది. అసలు ప్రశ్న మాత్రంఈ ₹6.05 లక్షల కోట్ల మార్పులో ఏ కారణం ఎంత ప్రభావం చూపింది? ఏ రంగం నుంచి ఎంత మార్పు వచ్చింది? అన్నదే.

మరి 2.6% వృద్ధి అన్న వాదన?

పాత లెక్కలోని ₹86.05 లక్షల కోట్లను, కొత్త లెక్కలోని ప్రస్తుత ₹88.27 లక్షల కోట్లతో పోలిస్తే నామినల్ పెరుగుదల సుమారు 2.6 శాతంమాత్రమే కనిపిస్తుంది. ఈ లెక్కనే గార్గ్ తన వాదనలో ప్రస్తావిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. 2.6 శాతాన్ని అధికారిక GDP వృద్ధి రేటుగా పరిగణించలేం. ఎందుకంటే ₹86.05 లక్షల కోట్లు పాత లెక్కల సిరీస్‌కు చెందినవి; ₹88.27 లక్షల కోట్లు కొత్త లెక్కల సిరీస్‌కు చెందినవి. రెండు వేర్వేరు పద్ధతుల్లో తయారైన గణాంకాలను కలిపి వృద్ధి రేటు లెక్కించడం సాంకేతికంగా సరైనది కాదు. సరైన పోలిక కొత్త లెక్కల ప్రకారం గత ఏడాది Q1 GDP అయిన ₹80 లక్షల కోట్లతో చేయాలి. అదే ప్రాతిపదికన ప్రస్తుత ధరల GDP వృద్ధి 10.3 శాతంగా వస్తుంది. అయితే 2.6 శాతం వాదన ఒక ముఖ్యమైన ప్రశ్నను మాత్రం ముందుకు తెచ్చింది: ₹80 లక్షల కోట్ల స్థాయికి గత ఏడాది GDP అంచనా ఎలా వచ్చింది? ఇంత పెద్ద మార్పుకు కారణాలేమిటి? వాటికి రంగాలవారీగా పూర్తి వివరాలు ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి?

డిఫ్లేటర్ అంటే ఏమిటి?

Q1లో నామినల్ GDP (ఆ సమయంలో ఉన్న ధరల ప్రకారం లెక్కించిన GDP) 10.3 శాతం, నిజమైన GDP 7.8 శాతం పెరిగాయి. ఈ తేడా ఆధారంగా MoSPI వివరించిన GDP డిఫ్లేటర్ (ఆర్థిక వ్యవస్థలోని వస్తువులు, సేవల ధరల మార్పును అంచనా వేసే సూచీ) ద్వారా కనిపించే ధరల పెరుగుదల సుమారు 2.5 శాతం. ఇది CPI (Consumer Price Index–వినియోగదారుల ధరల సూచీ) లేదా WPI (Wholesale Price Index–టోకు ధరల సూచీ)తో నేరుగా పోల్చాల్సిన సంఖ్య కాదు. GDP డిఫ్లేటర్ మొత్తం ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయ్యే వస్తువులు, సేవల ధరల మార్పును చూస్తుంది. అందుకే CPI, WPIతో దీనికి తేడా ఉండటం మాత్రమే గణాంక లోపానికి సంకేతం కాదు. అయితే విమర్శకుల ప్రశ్న మాత్రం: ఈ 2.5 శాతం ధరల ప్రభావం వెనుక ఏ రంగం ఎంత ఉంది? అన్నది. దానికి మరింత స్పష్టమైన రంగాలవారీ వివరాలు ఉంటే గణాంకాలను అర్థం చేసుకోవడం సులభమవుతుంది.

తయారీ రంగంలో -1.5% ఎందుకు?

తయారీ రంగంలో నామినల్ GVA (Gross Value Added–ఒక రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు జోడించిన విలువ) వృద్ధి 7.7 శాతం. ధరల ప్రభావాన్ని తీసేసిన నిజమైన GVA వృద్ధి 9.2 శాతం. దీంతో ఆ రంగానికి సంబంధించిన ధరల మార్పు సూచీ -1.5 శాతంగా వచ్చింది. దీని అర్థం తయారీ వస్తువుల ధరలు తప్పనిసరిగా పడిపోయాయని కాదు.

కొత్త Double Deflation (ఉత్పత్తి ధరలు, వాటికి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను విడివిడిగా లెక్కించే పద్ధతి)లో ఉత్పత్తి ధరలను, ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థాలు–ఇతర ఖర్చుల ధరలను వేరువేరుగా పరిగణిస్తారు. ముడి పదార్థాల ధరలు ఉత్పత్తి ధరల కంటే వేగంగా పెరిగితే, ఇలాంటి ప్రతికూల సూచీ రావచ్చు.

అందుకే ఇక్కడ ప్రశ్న -1.5 శాతంపై అనుమానం వ్యక్తం చేయడం కాదు; ఏ ధరల గణాంకాలను ఎలా ఉపయోగించారు? వాటికి ఎంత ప్రాధాన్యం ఇచ్చారు? అన్న వివరాలపై స్పష్టత కోరడం.

ఆర్థిక వ్యవస్థలో బలం.. బలహీనత రెండూ

7.8 శాతం వృద్ధికి మద్దతుగా కొన్ని సూచికలు బలంగా ఉన్నాయి. సిమెంట్ ఉత్పత్తి 8.9%, తయారైన ఉక్కు వినియోగం 8.3%, వాణిజ్య వాహనాల అమ్మకాలు 18.3%, మూలధన వస్తువుల పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP–Industrial Production Index) 15.2%, నిజమైన స్థిర పెట్టుబడులు 11.9%పెరిగాయి. అదే సమయంలో గనులు, ఖనిజాల రంగంలో నిజమైన GVA -2.4%, గనుల పారిశ్రామిక ఉత్పత్తి -1.2%, రైల్వే సరుకు రవాణా సూచీ -0.7%, సహజ వాయువు వినియోగం -2.6%, అంతర్జాతీయ విమాన ప్రయాణికులు మరియు సరుకు రవాణాకు సంబంధించిన సూచీ -19.5% వంటి ప్రతికూల సంకేతాలూ ఉన్నాయి. ఇవి 7.8 శాతం GDP వృద్ధిని ఖండించవు. కానీ ఆ వృద్ధి అన్ని రంగాల్లో సమానంగా ఉందా? లేక కొన్ని రంగాల బలమైన పనితీరే మొత్తం వృద్ధిని నడిపిస్తోందా? అన్న ప్రశ్నకు దారితీస్తాయి.

GDP పెరిగింది.. మరి ప్రజల జీవితాల్లో?

Q1లో నిజమైన స్థిర పెట్టుబడులు 11.9 శాతం, ప్రజల వినియోగ వ్యయం 7.1 శాతం పెరిగాయి. అంటే పెట్టుబడులు, వినియోగం రెండూ వృద్ధికి మద్దతిచ్చాయి. అయితే మాజీ RBI గవర్నర్ రఘురామ్ రాజన్ సహా విమర్శకులు లేవనెత్తుతున్న మరో ప్రశ్న.. ఇంత బలమైన GDP వృద్ధి ఉంటే ఉద్యోగాలు, పెట్టుబడులు, ఆదాయాల్లో దాని ప్రభావం ఎంత స్పష్టంగా కనిపిస్తోంది? అన్నదే. 7.8 శాతం GDP పెరగడం ఒక్కటే ప్రతి కుటుంబ ఆదాయం లేదా కొనుగోలు శక్తి అదే స్థాయిలో పెరిగిందని చెప్పదు. జూలై 2026లో 15 ఏళ్లు పైబడిన వారి CWS (Current Weekly Status–గత వారం ఆధారంగా ఉద్యోగ పరిస్థితిని లెక్కించే విధానం) ప్రకారం దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 5.1%, పట్టణాల్లో 6.7%గా ఉంది. కాబట్టి మరో ముఖ్యమైన ప్రశ్న: 7.8% GDP వృద్ధి ఎంతవరకు ఉద్యోగాలు, నిజమైన వేతనాలు, కుటుంబ ఆదాయంగా మారుతోంది?

అసలు ప్రశ్న ఇదే..

ఇక్కడ రెండు వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

విమర్శకుల వాదన: గత ఏడాది GDP అంచనా ₹86.05 లక్షల కోట్ల నుంచి ₹80 లక్షల కోట్లకు రావడం చాలా పెద్ద మార్పు. దీనివల్ల ప్రస్తుత 7.8 శాతం వృద్ధి రేటును అర్థం చేసుకోవడంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ప్రభుత్వ సమాధానం: ₹86.05 లక్షల కోట్లది పాత 2011–12 సిరీస్. ప్రస్తుత లెక్కలు 2022–23 కొత్త సిరీస్‌కు చెందినవి. బేస్ ఇయర్ మార్పు, కొత్త డేటా వనరులు, మెరుగైన పద్ధతులు, కొత్త సూచికల వల్ల వరుస సవరణలు జరిగాయి. పాత సిరీస్ గణాంకాన్ని కొత్త సిరీస్‌తో పోల్చి 2.6 శాతం వృద్ధి అని చెప్పడం సరైంది కాదు.

అందువల్ల 7.8 శాతం అధికారిక నిజమైన GDP వృద్ధి. దాన్ని పాత ₹86.05 లక్షల కోట్లతో కొత్త ₹88.27 లక్షల కోట్లను పోల్చి 2.6 శాతంగా మార్చడం సాంకేతికంగా సరైనది కాదు. కానీ అదే సమయంలో Q1 FY26 అంచనా ₹86.05 లక్షల కోట్ల నుంచి ₹80 లక్షల కోట్లకు ఎందుకు వచ్చింది? అన్న ప్రశ్నను కూడా కొట్టిపారేయలేం. కొత్త బేస్ ఇయర్, కొత్త డేటా వనరులు, IIP–PPI మార్పులు, Double Deflation వంటి కొత్త లెక్కల పద్ధతులు, ఇతర సవరణలు కారణాలని MoSPI చెబుతోంది. అయితే ఈ మార్పుల్లో ఒక్కో అంశం ప్రభావం ఎంత? ఏ రంగం ఎంత revisionకు కారణమైంది? అనే వివరాలు మరింత స్పష్టంగా ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ వివాదానికి మరింత స్పష్టమైన సమాధానం లభిస్తుంది.

అందుకే అసలు ప్రశ్న “7.8 శాతం అబద్ధమా?” అనేది కాదు.

“7.8 శాతం లెక్క వెనుక జరిగిన భారీ మార్పులను ప్రజలు, ఆర్థిక నిపుణులు స్వతంత్రంగా పరిశీలించగలిగేంత పారదర్శకత ఉందా?”అనేదే. ఎందుకంటే GDP వృద్ధి గణాంకం బలంగా కనిపించడం ఒక విషయం.. ఆ వృద్ధి ఉద్యోగం, ఆదాయం, కొనుగోలు శక్తి, జీవన ప్రమాణాల్లో కనిపించడం మరో విషయం. ఈ తారతమ్యాలకు కేంద్ర ప్రభుత్వ పెద్దలే లెక్క అప్పజెప్పాల్సి ఉంది.

Advertisement
Advertisement