త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balka Suman | ఇలా.. నోరు జారితే ఎలా? సుమన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం

Balka Suman | బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు ధర్నా కార్యక్రమాల్లో రైతులు తక్కువగా హాజరవుతున్నారని పార్టీ కార్యకర్తలే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారంటూ.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై గులాబీ దళపతి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

S

Telangana | Published On May 27, 2026, 5.48 pm IST

Balka Suman | ఇలా.. నోరు జారితే ఎలా? సుమన్ వ్యాఖ్యలపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
Advertisement

పార్టీ ప్రతిష్ఠ దిగజార్చిన రైతు ధర్నా వ్యాఖ్యలు

Balka Suman | త్రినేత్ర.న్యూస్ : బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రైతు ధర్నా కార్యక్రమాల్లో రైతులు తక్కువగా హాజరవుతున్నారని పార్టీ కార్యకర్తలే అధిక సంఖ్యలో పాల్గొంటున్నారంటూ.. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై గులాబీ దళపతి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వాన్ని ఎండగట్టే క్రమంలో అన్ని జిల్లాల్లో పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాల స్ఫూర్తిని దెబ్బతీసే విధంగా వ్యాఖ్యానించడం సరికాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారని బీఆర్ఎస్ వర్గాల భోగట్టా.

సుమన్ ఏమన్నారంటే..?

మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోయినా అతి త‌క్కువ సంఖ్య‌లో మాత్ర‌మే రైతులు వ‌స్తున్నారు. వ‌డ్ల కొనుగోళ్లు జ‌రుగుతున్నాయి.. రైతులు వ‌స్తున్నారా రోడ్ల మీదికి. నిన్న మా బీమారంలో మావారు నేష‌న‌ల్ హైవే దిగ్భందించారు. ఐదుగురే రైతులు వ‌చ్చారు. 60, 70 మంది మ‌నోళ్లే ఉన్నారు. నిన్న చెన్నూరులో కిష్టంపేట ద‌గ్గ‌ర జాతీయ ర‌హ‌దారి మీద కూర్చున్నారు. నలుగురు అయిదుగురే రైతులు.. వంద మంది మ‌నోళ్లే. అంటే రైతులు వ‌స్త‌లేరు.. రావాలంటే మ‌నం సీరియ‌స్‌గా ఉండాలి. వివేక్ మైన్ మీద‌కు పోతే ఎవ‌రు మాట్లాడుత‌లేరు.. అదే సంప‌త‌న్న‌, ర‌వ‌న్న వీళ్లే నలుగైదుగురు ప్ర‌శ్నిస్తున్నారు. వాళ్ల‌ను నిల‌దీయాలంటే మిలిటెంట్ యాక్టివిటీకి రూప‌క‌ల్ప‌న చేయాలి అని సుమ‌న్ అన్నారు.

కేసీఆర్ ఆగ్రహానికి కారణం ఏమిటి?

కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్ర స్థాయిలో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆ మేరకు వారికి అండగా నిలిచేందుకు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిర్వహిస్తున్న నిరసనల్లో రైతులు కూడా పెద్ద ఎత్తున హాజరవుతున్నారు. పార్టీ కార్యక్రమం కాబట్టి కార్యకర్తలు కూడా ధర్నాలో పాల్గొంటున్నారు. మరోవైపు తమ ధాన్యం కొనుగోలు చేయాలంటూ.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మంథని రహదారిపై సోమవారం (2026 మే 25) రైతులు ధర్నా నిర్వహిస్తే వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

మొక్క జొన్న బస్తాలను కొనుగోలు చేయలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గమైన మధిరలోని చింతకాని సొసైటీ కార్యాలయానికి రైతులు తాళం వేసి నిరసన తెలియజేస్తే.. రైతులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. రైతుల ఆగ్రహం వివిధ రూపాల్లో ఇంత పెద్ద ఎత్తున ప్రతిబింబిస్తూ ఉంటే.. అది కేవలం పార్టీ కార్యక్రమమని.. దానికి రైతులే రావడం లేదని పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యాఖ్యానించడంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ వైపు హింసాత్మక పూరిత వ్యాఖ్యలు.. మరో వైపు పార్టీ ధర్నాలకు రైతులే రావడం లేదని చెప్పడంపై మండిపడినట్టు విశ్వసనీయ సమాచారం.

Advertisement
Advertisement