త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్‌

DK Shivakumar | ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. యువ న్యాయవాదులు ప్రశ్నించడం మానకూడదని, విలువల విషయంలో రాజీపడకూడదని, సామాన్య ప్రజలను ఎన్నడూ విస్మరించరాదని పిలుపునిచ్చారు. శనివారం బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) 34వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు.

P

National | Published On Oct 17, 2026, 6.09 pm IST

DK Shivakumar | ప్రశ్నించే తత్వమే ప్రజాస్వామ్యానికి బలం.. యువ న్యాయవాదులతో డీకే శివకుమార్‌
Advertisement

DK Shivakumar | ప్రభుత్వాన్ని ప్రశ్నించే స్వేచ్ఛ ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందని క‌ర్ణాట‌క ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ అన్నారు. యువ న్యాయవాదులు ప్రశ్నించడం మానకూడదని, విలువల విషయంలో రాజీపడకూడదని, సామాన్య ప్రజలను ఎన్నడూ విస్మరించరాదని పిలుపునిచ్చారు. శనివారం బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) 34వ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య సంస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో యువ న్యాయవాదులపై మరింత బాధ్యత ఉందని శివకుమార్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు, న్యాయవ్యవస్థ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ప్రశ్నించడం, చర్చించడం మాత్రమే కాకుండా సమస్యలకు పరిష్కారాలు చూపే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. రాజ్యాంగ సూత్రాలు పుస్తకాలకే పరిమితం కాకుండా పాలన, విధాన రూపకల్పన, ప్రజాజీవితంలోనూ అమలు కావాలని ఆకాంక్షించారు. దేశానికి న్యాయవాదుల సంఖ్య పెరగడం మాత్రమే కాదని.. నిజాయతీ, సున్నితత్వం, ధైర్యం కలిగిన న్యాయవాదులు అవసరమని స్పష్టం చేశారు.

యువ న్యాయవాదులకు ప్రత్యేక సంస్థ

న్యాయవిద్య పూర్తి చేసిన యువతకు అండగా నిలిచేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు శివకుమార్‌ ప్రకటించారు. న్యాయసేవల పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు శిక్షణ, తదుపరి విద్యాభ్యాసానికి అవసరమైన సహకారం అందించడం దీని లక్ష్యమని తెలిపారు. ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూలోని స్టార్టప్‌ లా క్లినిక్‌కు కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఈ క్లినిక్‌ ద్వారా విద్యార్థులు, అధ్యాపకులు, న్యాయవాదులు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే యువ పారిశ్రామికవేత్తలకు ఉచిత న్యాయ సలహాలు అందిస్తారని వివరించారు.

పెండింగ్‌ కేసుల పరిష్కారానికి ప్రాధాన్యం

కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులు న్యాయవ్యవస్థకు ప్రధాన సవాలుగా మారాయని శివకుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది కేసులు పెండింగ్‌లో ఉండటంతో అనేక మంది, కుటుంబాలు న్యాయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. కోర్టుకు ఒక కేసు కేవలం సంఖ్య కావొచ్చని, కానీ బాధితుడికి అది జీవితానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు. న్యాయప్రక్రియ వేగంగా, సరళంగా, తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. రైతులు, కార్మికులు, మహిళలు, సామాన్య కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకుని వారి హక్కుల పరిరక్షణకు యువ న్యాయవాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ విభు బఖ్రు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement