త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi AI Impact Summit | ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్.. హోట‌ల్ రూమ్ చార్జిల‌కు రెక్క‌లు..

Delhi AI Impact Summit | వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ కు ముందే న‌గ‌రంలో హోటల్ రంగం ఊపందుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలోని దిగ్గజాలు సుంద‌ర్ పిచాయ్‌, శామ్ ఆల్ట్‌మ‌న్ వంటి ప్రముఖులు హాజరుకానుండటంతో నగరంలోని అగ్రశ్రేణి లగ్జరీ హోటళ్ల రూమ్ చార్జీలు రికార్డు స్థాయికి చేరాయి.

S

National | Published On Feb 9, 2026, 9.52 am IST

Delhi AI Impact Summit | ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్.. హోట‌ల్ రూమ్ చార్జిల‌కు రెక్క‌లు..
Advertisement

Delhi AI Impact Summit | వచ్చే వారం ఢిల్లీలో జరగనున్న ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ కు ముందే న‌గ‌రంలో హోటల్ రంగం ఊపందుకుంది. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలోని దిగ్గజాలు సుంద‌ర్ పిచాయ్‌, శామ్ ఆల్ట్‌మ‌న్ వంటి ప్రముఖులు హాజరుకానుండటంతో నగరంలోని అగ్రశ్రేణి లగ్జరీ హోటళ్ల రూమ్ చార్జీలు రికార్డు స్థాయికి చేరాయి. కొన్ని హోటళ్లలో ఒక్క రాత్రి గది అద్దె రూ.30 లక్షలు దాటడం విశేషం. తాజ్ ప్యాలెస్ లోని గార్డెన్ లగ్జరీ సూట్ (కింగ్ బెడ్, పూల్ వ్యూ) ఏఐ సమ్మిట్ రోజుల్లో ఒక్క రాత్రికి రూ.27.55 లక్షలుగా ఉంది. దీనిపై సుమారు రూ.5 లక్షల పన్నులు కలిపితే మొత్తం బిల్ దాదాపు రూ.32 లక్షలు అవుతోంది. ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు రూమ్ ధర ఇలాగే ఉంది. ఇక ఇదే గది ఫిబ్రవరి 13-14 తేదీల్లో మాత్రం పన్నులతో కలిపి సుమారు రూ..2 లక్షలు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే సమ్మిట్ రోజుల్లో ధరలు వాలెంటైన్స్ డే పీక్‌తో పోలిస్తే దాదాపు 1,500 శాతం పెరిగిన‌ట్లు స్ప‌ష్ట‌మవుతోంది.

రెండు నుంచి మూడు రెట్లు పెరిగిన చార్జిలు..

కాగా ఇతర హోటళ్లలోనూ ఇదే పరిస్థితి నెల‌కొంది. ఢిల్లీలోని అందాజ్ ఢిల్లీ బై హ‌య‌త్ లో సిగ్నేచర్ సూట్ ధర ఒక్క రోజుకు రూ.3.86 లక్షలుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, విధాన నిర్ణయకర్తలు, టెక్ కంపెనీల అధిపతులు రావడంతో ప్రీమియం ఇన్వెంటరీ వేగంగా నిండిపోతోంది. జనవరి, ఫిబ్రవరి తొలి భాగంతో పోలిస్తే సమ్మిట్ సమయంలో రూమ్ రేట్లు 2-3 రెట్లు పెరిగాయని హోటల్ రంగ వర్గాలు చెబుతున్నాయి. డిమాండ్ ఆధారిత ధరల విధానమే దీనికి కారణమని ఇబిస్ అండ్ ఇబిస్ స్టైల్స్ ఇండియా కమర్షియల్ హెడ్ అనిమేష్ కుమార్ తెలిపారు.

ఆక్యుపెన్సీ ఫుల్‌..

ది ల‌లిత్ లో ఫిబ్రవరి 19-20 తేదీలకు దాదాపు సోల్డ్ అవుట్ పరిస్థితి నెలకొందని హోటల్ మేనేజర్ వినీత్ కపూర్ వెల్లడించారు. అంతర్జాతీయ నాయకులు, డెలిగేట్లకు ఆతిథ్యం ఇస్తున్నామని చెప్పారు. అలాగే ఈరోస్ హోట‌ల్‌లో ప్రత్యేక చెక్-ఇన్ సర్వీసులు, క్యూరేటెడ్ వెల్‌కమ్ ప్యాకేజీలు, ఎక్స్‌క్లూజివ్ నెట్‌వర్కింగ్ ఈవెంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు జనరల్ మేనేజర్ దవిందర్ జుజ్ తెలిపారు. సమ్మిట్ రోజుల్లో కొన్ని రూమ్ క్యాటగిరీలు పూర్తిగా నిండిపోయాయని ఆయన చెప్పారు. జైపీ వసంత్ కాంటినెంట‌ల్‌లో కూడా ఆక్యుపెన్సీ దాదాపు 95 శాతానికి చేరింది. దేశీయ, అంతర్జాతీయ డెలిగేట్లు, టెక్ లీడర్లు, కార్పొరేట్ ట్రావెలర్ల రాకతో పాటు, ఎక్స్‌టెండెడ్ స్టేలు, గ్రూప్ బుకింగ్స్ పెరగడం ఇందుకు కారణమని హోటల్ వర్గాలు తెలిపాయి.

19, 20 తేదీల్లో స‌మ్మిట్‌..

లగ్జరీ, ఫైవ్ స్టార్ హోటళ్లలో స్థలాలు లభించకపోవడంతో మిగతా హోటళ్లకు స్పిల్ ఓవర్ డిమాండ్ పెరిగిందని ఓపో హోట‌ల్స్ అండ్ రిసార్ట్స్ సీఈవో సందీప్ బసు చెప్పారు. ఫిబ్రవరి 17-21 మధ్య 90 శాతంకు పైగా ఆక్యుపెన్సీ ఉందని ఫెడ‌రేష‌న్ ఆఫ్ అసోసియేష‌న్స్ ఇన్ ఇండియ‌న్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ (FAITH) జనరల్ సెక్రటరీ రాజీవ్ మెహ్రా తెలిపారు. ట్రావెల్ పోర్టల్ ఇక్సిగో ప్రకారం, న్యూఢిల్లీ హోటళ్లపై సెర్చ్‌లు నెలనెలకు ఆరు రెట్లు పెరిగాయి. సెంట్రల్ ఢిల్లీలోని అనేక ఫైవ్ స్టార్ హోటల్ రూమ్స్‌ ఫిబ్రవరి 16-20 తేదీలకు ఇప్పటికే సోల్డ్ అవుట్ కాగా, అందుబాటులో ఉన్న చోట్ల రాత్రికి రూ.70,000 నుంచి రూ.1 లక్ష వరకు రేట్లు ఉన్నాయని సీఈవో అలోక్ బాజ్‌పాయ్ తెలిపారు. కాగా ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ స‌మ్మిట్ ను ఫిబ్ర‌వ‌రి 19, 20 తేదీల్లో నిర్వ‌హించ‌నున్నారు. ఈ స‌మ్మిట్ సంద‌ర్భంగా ప‌లు హోట‌ల్స్ లో నిర్వ‌హించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు కూడా చాలా మంది ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తున్నార‌ని హోట‌ల్ బుకింగ్స్‌ను చూస్తే అర్థ‌మ‌వుతోంది.

Advertisement
Advertisement