త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Digvijaya Singh | దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌తో కాంగ్రెస్‌లో ముసలం: గాంధీ వర్సెస్ గాడ్సేగా మారిన వివాదం

కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు.. దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మాత్రం కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించదని, ఆ సంస్థ నుంచి తాము నేర్చుకునేది ఏం లేదని.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది.

J

National | Published On Dec 28, 2025, 2.33 pm IST

Digvijaya Singh | దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌తో కాంగ్రెస్‌లో ముసలం: గాంధీ వర్సెస్ గాడ్సేగా మారిన వివాదం
Advertisement

Digvijaya Singh | కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆర్ఎస్ఎస్‌కి చెందిన ఓ ఫోటో ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయన షేర్ చేసిన ఫోటో కాంగ్రెస్ పార్టీలోనూ చర్చకు దారి తీసింది. ఆర్ఎస్ఎస్, బీజేపీలో పనిచేసే క్షేత్రస్థాయి కార్యకర్తల పనితీరును ఆయన మెచ్చుకున్న విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ కాళ్ల ముందు ప్రధాని నరేంద్ర మోదీ కూర్చొని ఉన్న ఫోటో అది. సంఘ్‌లో పనిచేసే కార్యకర్తలు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు అవుతున్నారంటే అది సంఘ్ గొప్పతనం అంటూ ఆయన ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఆ ఫోటోను కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ట్యాగ్ చేయడంతో అగ్నికి ఇంకాస్త ఆజ్యం పోసినట్లయింది.

దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుల్లో కాంగ్రెస్ నాయకత్వంపై ఉన్న విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత శశిథరూర్ బీజేపీని పొగుడుతూ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా దిగ్విజయ్ సింగ్ కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీని పొగుడుతూ ట్వీట్ చేయడంతో కాంగ్రెస్ సీనియర్ నేతల మధ్య ఉన్న అసమ్మతి బయటపడింది.

గాంధీ వర్సెస్ గాడ్సే

ఈ చర్చ కాస్త యూటర్న్ తీసుకొని గాంధీ వర్సెస్ గాడ్సేగా మారింది. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా వర్గాలుగా విడిపోయి వాళ్లపై వాళ్లే విమర్శలు చేసుకునే స్థాయికి వెళ్లారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే అనుచరులు గాంధీకి ఎలా మద్దతు ఇస్తారు. అసలు వాళ్ల నుంచి మనం నేర్చుకోవల్సింది ఏం ఉంటుంది.. అంటూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.

ఆర్ఎస్ఎస్ అనేది ఉగ్రవాద సంస్థ

మరోవైపు కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఓ అడుగు ముందుకేసి ఆర్ఎస్ఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ అనేది అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ లాంటిదన్నారు. ద్వేషాన్ని వ్యాపింపజేసేదే ఆర్ఎస్ఎస్. అల్ ఖైదా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తుంది. ఈ రెండు సంస్థల మోడల్ ఒక్కటే అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మతం పేరుతో మేము రాజకీయాలు చేయం

దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై నేరుగా స్పందించని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే.. ఇన్‌డైరెక్ట్‌గా తమ పార్టీ సిద్ధాంతంపై స్పష్టత ఇచ్చారు. తాము అధికారం కోసం మతం పేరుతో రాజకీయాలు చేయమన్నారు. ఆర్ఎస్ఎస్ నేతలు త్రివర్ణ పతాకాన్నే ఒకప్పుడు అంగీకరించలేదు. వందేమాతరాన్ని కూడా వద్దన్నారు.. అంటూ మండిపడ్డారు.

ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని చెప్పొచ్చు

మరోవైపు రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిల్ పైలట్.. దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై పాజిటివ్‌గా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. ప్రతి ఒక్కరికి తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. ఏ సంస్థ అయిన బలోపేతం కావాలంటే క్రమశిక్షణ ఉండటంతో తప్పులేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు.

ఇలా.. కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నేతలు.. దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌పై రకరకాలుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని మాత్రం కాంగ్రెస్ ఎప్పటికీ అంగీకరించదని, ఆ సంస్థ నుంచి తాము నేర్చుకునేది ఏం లేదని.. కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. కానీ.. దిగ్విజయ్ సింగ్ పోస్ట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement