త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Mamata Banerjee | రాష్ట్ర‌ప‌తి ప‌దవిని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ

CM Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత‌ మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంత‌రం అక్క‌డి ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, దేశంలో అత్యున్నత పదవిని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని మమత ఆరోపించారు.

S

National | Published On Mar 8, 2026, 10.14 am IST

CM Mamata Banerjee | రాష్ట్ర‌ప‌తి ప‌దవిని బీజేపీ దుర్వినియోగం చేస్తోంది: సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ
Advertisement

CM Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత‌ మమతా బెనర్జీ కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బెంగాల్‌లో జ‌రిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంత‌రం అక్క‌డి ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, దేశంలో అత్యున్నత పదవిని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని మమత ఆరోపించారు. కాగా రాష్ట్రపతి ముర్ము తన పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి త‌న‌ను ఎందుకు కలవలేదని కూడా ప్రశ్నించారు. అయితే ఈ ఉదంతం నేప‌థ్యంలో స్పందించిన సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టారు. రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమం కోసం ఎంపిక చేసిన వేదిక వద్ద సరైన ఏర్పాట్లు లేవని జిల్లా పరిపాలన యంత్రాంగం ముందుగానే హెచ్చరించిందని తెలిపారు.

ఏర్పాట్లు సరిగ్గా లేవ‌ని ముందే చెప్పాం: సీఎం మ‌మ‌త‌

ఇంటర్నేషనల్ సాంతాల్ కౌన్సిల్ అనే ప్రైవేట్ సంస్థ సిలిగురిలో నిర్వ‌హించిన 9వ అంతర్జాతీయ ఆదివాసీ సాంతాల్ కాన్ఫరెన్స్‌కు రాష్ట్రపతిని ఆహ్వానించింది. అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ తర్వాత జిల్లా పరిపాలన, నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదని రాష్ట్రపతి కార్యాలయానికి లిఖితపూర్వకంగా తెలియజేసింది. ఈ విషయం టెలిఫోన్ ద్వారా కూడా తెలియజేశారు.. అని మమత‌ పేర్కొన్నారు. మార్చి 5, 2026న రాష్ట్రపతి కార్యాలయానికి చెందిన అడ్వాన్స్ టీమ్ అక్కడికి వెళ్లి ఏర్పాట్ల లోపాలను తెలుసుకుంది. అయినప్పటికీ కార్యక్రమం ముందుగా నిర్ణయించినట్లే కొనసాగింది.. అని ఆమె తెలిపారు. రాష్ట్రపతిని సిలిగురి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డార్జిలింగ్ జిల్లా కలెక్టర్, సిలిగురి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ స్వాగతించి వీడ్కోలు పలికారు. ఇవన్నీ రాష్ట్రపతి కార్యాలయం ముందుగా ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం జరిగాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో భాగం కాదు, వేదికపై కూడా ఆమె పేరు లేదు. జిల్లా పరిపాలన నుంచి ఎలాంటి ప్రోటోకాల్ ఉల్లంఘన జరగలేదు.. అని ఆమె పేర్కొన్నారు. దేశంలోని అత్యున్నత పదవిని బీజేపీ తన పార్టీ ప్రయోజనాల కోసం అవమానిస్తూ దుర్వినియోగం చేస్తోంది. ఇది చాలా దురదృష్టకరం.. అని మమతా బెనర్జీ వ్యాఖ్య‌లు చేశారు.

https://twitter.com/MamataOfficial/status/2030316372333613168

ఆదివాసీలంటే సీఎం మ‌మ‌త‌కు ఇష్టం లేదా: రాష్ట్రప‌తి ముర్ము

అంత‌కు ముందు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ.. తన పర్యటన సమయంలో ముఖ్యమంత్రి తనను స్వాగతించకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాధారణంగా రాష్ట్రపతి ఒక రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి స్వాగతం పలకాలి, ఇతర మంత్రులు కూడా ఉండాలి. కానీ ఆమె రాలేదు. గవర్నర్ కూడా మారిపోయారు కాబట్టి రాలేకపోయారు. అయినప్పటికీ తేదీ ముందే నిర్ణయించబడినందున నేను వచ్చాను.. అని ఆమె తెలిపారు. కార్యక్రమం వేదిక మార్పుపై కూడా రాష్ట్రపతి ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు కార్యక్రమాన్ని ప్రజలకు చేరుకోవడం కష్టమైన ప్రదేశంలో నిర్వహిస్తున్నారు. బహుశా రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమాన్ని కోరుకోవడం లేదేమో. అందుకే వారు ఇక్కడికి రాకుండా అడ్డుకున్నారు.. అని ముర్ము అన్నారు. మమతా బెనర్జీ నాకు చెల్లెలిలాంటివారు. నేను కూడా బెంగాల్ కుమార్తెనే. ఆమెకు కోపం వచ్చిందా లేదా తెలియదు. అందుకే వేదిక మారిందేమో. అయినా అది పెద్ద విషయం కాదు. మీరు అందరూ సంతోషంగా ఉండండి.. అని రాష్ట్రపతి అన్నారు.

తృణ‌మూల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం హ‌ద్దులు దాటింది: ప్ర‌ధాని మోదీ

కాగా ఈ పరిణామాలను ప్రధాని నరేంద్ర మోదీ అవమానకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరికీ, ఆదివాసీ సమాజ అభివృద్ధిని కోరుకునే వారందరికీ ఇది నిరాశ కలిగించే విషయం. స్వయంగా ఆదివాసీ సమాజానికి చెందిన రాష్ట్రపతి వ్యక్తం చేసిన బాధ దేశ ప్రజల హృదయాలను కల‌చివేసింది.. అని మోదీ ఎక్స్ లో చేసిన పోస్టులో పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటింది. రాష్ట్రపతిని అవమానించడంలో వారి పరిపాలనే బాధ్యత వహించాలి. సాంతాల్ సంస్కృతి వంటి ముఖ్యమైన అంశాన్ని కూడా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా తీసుకోవడం దురదృష్టకరం. రాష్ట్రపతి పదవి రాజకీయాలకు అతీతమైనది. ఆ పదవి గౌరవాన్ని ఎప్పటికీ కాపాడాలి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తృణమూల్ కాంగ్రెస్ లో ఉన్నవారు మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను.. అని మోదీ అన్నారు.

https://twitter.com/narendramodi/status/2030281472670843025

ఇక ప్రధాని వ్యాఖ్యలకు స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు వర్సెస్ బీజేపీ + ఈసీఐ + ఈడీ + ఐటీ + సీబీఐ + ఎన్ఐఏ + సీఏపీఎఫ్ + గవర్నర్ + 20 కేంద్ర మంత్రులు + 10 ముఖ్యమంత్రులు + ప్రధాని + గౌరవ రాష్ట్రపతి + గోది మీడియా. మొత్తం వ్యవస్థ బెంగాల్‌కు వ్యతిరేకంగా నిలిచినా, బెంగాల్ మరింత బలంగా నిలబడుతుంది. ముందుకు రండి.. అని అభిషేక్ బెనర్జీ వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement
Advertisement