త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Surya Kant | యువతను ‘బొద్దింకల’తో పోల్చలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్

"నిరుద్యోగ యువతను నేను బొద్దింకలతో పోల్చలేదు. నకిలీ డిగ్రీలతో న్యాయ, మీడియా రంగాల్లోకి వచ్చిన వారినే అలా అన్నా" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు.

J

National | Published On May 16, 2026, 4.21 pm IST

CJI Surya Kant | యువతను ‘బొద్దింకల’తో పోల్చలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
Advertisement
  • తన 'బొద్దింకలు' (Cockroaches) వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ముగింపు
  • నిరుద్యోగ యువతను ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, దేశ యువత అంటే తనకు ఎంతో గర్వకారణమని స్పష్టం
  • నకిలీ డిగ్రీలతో న్యాయవాద, మీడియా తదితర పవిత్ర వృత్తుల్లోకి ప్రవేశిస్తున్న 'పరాన్నజీవుల'ను టార్గెట్ చేస్తూనే తాను ఆ కామెంట్స్ చేశానని వివరణ
  • ఓ న్యాయవాది 'సీనియర్ అడ్వకేట్' హోదా కోసం దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న ఈ పరిణామం

CJI Surya Kant | త్రినేత్ర.న్యూస్ : సుప్రీంకోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ తన తాజా వ్యాఖ్యలపై నెలకొన్న వివాదంపై శనివారం కీలక వివరణ ఇచ్చారు. నిరుద్యోగ యువతను తాను 'బొద్దింకల'తో (Cockroaches) పోల్చలేదని, కొందరు తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకుని ప్రచురించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఫేక్ డిగ్రీలతో పవిత్రమైన వృత్తుల్లోకి ప్రవేశించే పరాన్నజీవులనే (Parasites) తాను టార్గెట్ చేశానని కుండబద్దలు కొట్టారు.

వక్రీకరణల పట్ల ఆవేదన

"నిన్నటి కోర్టు విచారణలో నేను చేసిన మౌఖిక వ్యాఖ్యలను కొన్ని మీడియా సంస్థలు వక్రీకరించడం చూసి ఎంతో బాధపడ్డాను. నకిలీ డిగ్రీల (Fake Degrees) సాయంతో లీగల్ ప్రొఫెషన్ (బార్) లోకి అడుగుపెడుతున్న వారిని మాత్రమే నేను విమర్శించాను. అలాంటి వారే మీడియా, సోషల్ మీడియా లాంటి పవిత్రమైన రంగాల్లోకి కూడా చొరబడుతున్నారు. అలాంటి వాళ్లు సమాజానికి పరాన్నజీవులు. అంతే తప్ప, మన దేశ యువతను నేను విమర్శించాననడం పూర్తిగా నిరాధారం" అని సీజేఐ స్పష్టం చేశారు.

భారతదేశ భవిష్యత్తుకు యువతే మూలస్తంభాలని, వారిని చూసి తాను గర్విస్తున్నానని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. "ప్రస్తుత, భవిష్యత్ యువత పట్ల నేను గర్వపడటమే కాదు, ప్రతి భారతీయ యువకుడు నాకు స్ఫూర్తినిస్తాడు. యువతకు నాపై ఎంతో గౌరవం ఉంది, నేను కూడా వారిని అభివృద్ధి చెందిన భారత్‌కు పిల్లర్స్‌గా చూస్తాను" అని ఆయన పేర్కొన్నారు.

అసలు వివాదం ఎలా మొదలైందంటే?

జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ముందు ఓ న్యాయవాది 'సీనియర్ అడ్వకేట్' (Senior Advocate) హోదా కోసం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. ఆ హోదా కోసం అతడు అత్యుత్సాహం చూపించడం, ఫేస్‌బుక్‌లో వాడిన భాషపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. "ప్రపంచం మొత్తం సీనియర్ అడ్వకేట్ కావడానికి అర్హత సాధించొచ్చు.. కానీ మీకు మాత్రం ఆ అర్హత లేదు" అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.

ఆ లాయర్ సోషల్ మీడియా ప్రవర్తనను తప్పుబడుతూ సీజేఐ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. "సమాజ వ్యవస్థపై దాడి చేసే పరాన్నజీవులు ఇప్పటికే ఉన్నారు, వారితో మీరు కూడా చేతులు కలపాలనుకుంటున్నారా? వృత్తిలో సరైన స్థానం దొరకని కొందరు బొద్దింకల్లా తయారవుతున్నారు. వారిలో కొందరు మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ (RTI) యాక్టివిస్టుల అవతారం ఎత్తి అందరిపైనా దాడులు చేస్తున్నారు" అని మండిపడ్డారు.

సీనియర్ అడ్వకేట్ హోదా అనేది ఒక గుర్తింపు అని, దాని వెంట పడితే వచ్చేది కాదని ధర్మాసనం హితవు పలికింది. ఆ హోదా ఏమైనా అలంకారం కోసం పెట్టుకునే స్టేటస్ సింబల్ అనుకుంటున్నారా? అని సూటిగా ప్రశ్నించింది.

ఫేక్ డిగ్రీలపై సీబీఐ విచారణ?

ఇదే విచారణలో నల్ల కోట్లు వేసుకున్న చాలా మంది న్యాయవాదుల డిగ్రీలపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. సర్టిఫికెట్ల జెన్యూనిటీపై అనుమానాలు ఉన్నందున సీబీఐ (CBI) విచారణకు ఆదేశించే అంశాన్ని పరిశీలిస్తామని హెచ్చరించింది. ఈ విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఎటువంటి చర్యలు తీసుకోదని, ఎందుకంటే "వాళ్లకు ఓట్లు కావాలి కదా" అని కోర్టు చురకలంటించింది.

సుప్రీంకోర్టు అక్షింతలతో దిగివచ్చిన సదరు పిటిషనర్ ధర్మాసనానికి బేషరతుగా క్షమాపణలు చెప్పి, తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. దానికి న్యాయస్థానం అనుమతించింది.

Advertisement
Advertisement