త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MK Stalin | హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులు త‌మిళం, తెలుగు నేర్చుకుంటారా..? : త్రిభాషా సూత్రంపై సీఎం స్టాలిన్‌

MK Stalin | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ త్రిభాషా విధానంపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ మ‌రోసారి తీవ్రంగా స్పందించారు. జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న ప్ర‌తిపాద‌న సాధారణ విద్యా సంస్కరణ కాదని పేర్కొన్నారు.

D

National | Published On Apr 4, 2026, 4.24 pm IST

MK Stalin | హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులు త‌మిళం, తెలుగు నేర్చుకుంటారా..? : త్రిభాషా సూత్రంపై సీఎం స్టాలిన్‌
Advertisement

MK Stalin | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు విషయంలో కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం, తమిళనాడు (Tamil Nadu) ప్రభుత్వం మధ్య గత కొంతకాలంగా ఓ యుద్ధమే జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని (three-language formula) స్టాలిన్‌ (MK Stalin) ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని తమిళనాడు ప్రభుత్వం మండిపడుతోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌ త్రిభాషా విధానంపై త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ మ‌రోసారి తీవ్రంగా స్పందించారు.

జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా దేశంలో 2026-27 విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్న ప్ర‌తిపాద‌న సాధారణ విద్యా సంస్కరణ కాదని పేర్కొన్నారు. భార‌తీయ భాష‌ల‌ను ప్రోత్స‌హిస్తున్నామ‌నే ముసుగులో హిందీ భాష‌ను రుద్దేందుకు జ‌రుగుతున్న ప్ర‌య‌త్న‌మ‌ని విమ‌ర్శించారు. ఈ త్రిభాష సూత్రం అనేది నిజానికి హిందీయేత‌ర రాష్ట్రాల్లో హిందీని విస్త‌రించేందుకు రూపొందించిన‌ ప్ర‌తిపాద‌న అని ఆరోపించారు.

"ద‌క్షిణాది రాష్ట్రాల విద్యార్థుల‌పై ప‌రోక్షంగా హిందీని బ‌ల‌వంతంగా రుద్దే ప్ర‌య‌త్నమే ఇది. అదే హిందీ మాట్లాడే రాష్ట్రాల విద్యార్థులు త‌మిళం, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, బెంగాలీ, మ‌రాఠీ వంటి భాష‌ల‌ను త‌ప్ప‌నిస‌రిగా నేర్చుకోవాల‌ని ఆదేశిస్తారా..? దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌తా లేక‌పోవ‌డం ఈ విధానం ఎంత ఏక‌ప‌క్షంగా, వివ‌క్ష‌పూరితంగా ఉందో స్ప‌ష్టం చేస్తోంది" అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. కేంద్రీయ విద్యాలయాల్లో తమిళాన్ని తప్పనిసరి చేయడంలోనూ, త‌గినంత మంది త‌మిళ ఉపాధ్యాయుల‌ను నియ‌మించ‌డంలోనూ విఫ‌ల‌మైన కేంద్రం, ఇప్పుడు రాష్ట్రాలకు భాషల గురించి హిత‌బోధ చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

ఈ విధానాన్ని అమలు చేయడానికి అవసరమైన మౌలిక సదుపాయాల గురించి కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా అవగాహన ఉందా..? అని సీఎం స్టాలిన్‌ నిల‌దీశారు. ఈ విధానాన్ని అమ‌లు చేయ‌డానికి అర్హులైన ఉపాధ్యాయులు ఎక్క‌డున్నారు..? అన్నింటికంటే ముఖ్యంగా.. విద్యా వ్య‌వ‌స్థ‌పై ప‌డే ఈ పెను భారాన్ని భ‌రించేందుకు నిధులు ఎక్క‌డున్నాయ‌ని..? అని ప్ర‌శ్నించారు. ఎటువంటి ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు, వ‌న‌రులు లేకుండా ప్ర‌క‌టించిన మ‌రో విఫ‌ల విధానంగా ఇది క‌నిపిస్తోందంటూ సీఎం స్టాలిన్ వ్యాఖ్యానించారు. త్రిభాషా విధానం వల్ల రాష్ట్రాల మధ్య అసమానతలు పెరుగుతాయని స్టాలిన్‌ హెచ్చరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, యానిమేషన్, గేమింగ్ వంటి ఆధునిక రంగాల్లో విద్యార్థులకు నైపుణ్యాలు అందించాల్సిన తరుణంలో వారిపై అదనపు భాషా భారాన్ని మోపడం సరికాదన్నారు.

దేశంలో త్రి భాషా సూత్రం..

నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ (ఎన్‌ఈపీ) 2020 సిఫార్సుల మేరకు 2026-27 విద్యా సంవత్సరం నుంచి దేశంలో త్రి భాషా సూత్రం అమలుకు చేయాలని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) నిర్ణయించింది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం.. 6వ తరగతి విద్యార్థులు మూడు భాషలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందులో రెండు కచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. అయితే ఈ కొత్త విధానంలో ఇంగ్లిష్‌ను విదేశీ భాషగా పరిగణిస్తారు. ఇప్పటికే 6వ తరగతిలో ఆంగ్ల భాషను బోధిస్తున్నందున దీనిని విదేశీ భాషగా లెక్కకడతారు. వీటితో పాటు రెండు భారతీయ భాషలను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది.

Also Read..

ప్రాణరక్షణలో ట్రామా మెడిసిన్ పాత్ర కీలకం : గవర్నర్ శివ ప్ర‌తాప్ శుక్లా

46,000 మెట్రిక్ ట‌న్నుల ఎల్పీజీతో.. హ‌ర్మూజ్‌ను దాటిన భార‌త‌ నౌక‌

ప్రముఖ సంగీత దర్శకుడితో ప్రధాని మోదీ భేటీ: 'గమక బాక్స్'పై ప్రశంసల జల్లు

Advertisement
Advertisement