త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Nadu Elections | తమిళనాడులో విజ‌య్ హీరోనా?.. విల‌నా?.. స్టాలిన్ మ‌రోసారి అధికారం చేజిక్కించుకుంటారా?

Tamil Nadu Elections | త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Tamil Nadu Elections) అధికార డీఎంకే (DMK) కూట‌మికే ప్ర‌జ‌లు మ‌రోసారి ప‌ట్టం క‌ట్టారా?. అన్నాడీఎంకే ప్ర‌భావం త‌గ్గ‌డంతో త‌న‌కు ఎదురులేద‌ని భావించిన సీఎం స్టాలిన్‌కు.. ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) బ్రేకులేస్తాడా?.

G

National | Published On May 4, 2026, 7.40 am IST

Tamil Nadu Elections | తమిళనాడులో విజ‌య్ హీరోనా?.. విల‌నా?.. స్టాలిన్ మ‌రోసారి అధికారం చేజిక్కించుకుంటారా?
Advertisement

Tamil Nadu Elections | త్రినేత్ర‌.న్యూస్‌: త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో (Tamil Nadu Elections) అధికార డీఎంకే (DMK) కూట‌మికే ప్ర‌జ‌లు మ‌రోసారి ప‌ట్టం క‌ట్టారా?. అన్నాడీఎంకే ప్ర‌భావం త‌గ్గ‌డంతో త‌న‌కు ఎదురులేద‌ని భావించిన సీఎం స్టాలిన్‌కు.. ద‌ళ‌ప‌తి విజ‌య్ (Vijay) బ్రేకులేస్తాడా?. గ్రూపుల కుమ్ములాట‌ల‌తో ప్ర‌భ‌కోల్పోయిన అన్నాడీఎంకే (AIADMK) మ‌ళ్లీ పూర్వ‌వైభవం చాటుకోనుందా?.. త‌మిళ‌నాడు త్రిముఖ పోరులో విజ‌యం ఎవ‌రిని వ‌రించనుంది?.

ఈసారి ఎన్నికల్లో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకేతో పాటు ప్రముఖ నటుడు విజయ్ పార్టీ టీవీకే (TVK) రంగంలోకి దిగడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎలాగైనా విజ‌య్‌తో జ‌ట్టుక‌ట్టాల‌ని భావించిన బీజేపీ చివ‌ర‌కు త‌న పాత మిత్రుడు అన్నాడీఎంకేతోనే కొన‌సాగక త‌ప్ప‌లేదు. అధికారాన్ని నిలుపుకోవడానికి సీఎం స్టాలిన్ ప్ర‌జాక‌ర్ష‌క‌, ఉచిత ప‌థ‌కాలు, త‌మిళ నినాదం ఎత్తుకుని ఓట‌ర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ప్ర‌య‌త్నించారు. ఇక ప్ర‌ముఖ న‌టుడు, టీవీకే చీఫ్ విజ‌య్‌.. అరంగేట్రంలోనే అధికారాన్ని ద‌క్కించుకుని రాజ‌కీయాల్లో త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక స్థానాన్ని చాటుకోవాల‌ని చూస్తున్నాడు. ప్ర‌జ‌ల్లో త‌న ప‌ట్ల ఉన్న ఆక‌ర్ష‌ణ‌, అభిమానానికి తోడు ఉచిత ప‌థ‌కాలు త‌న‌ను గ‌ట్టెక్కిస్తాయ‌ని భావిస్తున్నాడు. మ‌రోవైపు వీరిద్ద‌రిని కాద‌ని, జ‌నం త‌మ‌వైపే ఉన్నార‌ని చెప్పేందుకు అన్నాడీఎంకే ఉవ్విళ్లూరుతున్న‌ది. ఈ త్రిముఖ పోరులో ప్ర‌జ‌లు స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చారా? లేదా.. ప్ర‌భుత్వ ఏర్పాటులో విజ‌య్ కీల‌క పాత్ర పోషించ‌నున్నారా?.. దీనిపై మ‌రికొన్ని గంట‌ల్లో స్ప‌ష్ట‌త రానుంది.

రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాల‌కు ఒకే విడ‌త‌లో ఏప్రిల్ 23న ఎన్నిక‌లు నిర్వ‌హించారు. 4 వేల మంది అభ్య‌ర్థులు పోటీచేశారు. 85.15 శాతం ఓటింగ్‌ రికార్డయ్యింది. సోమ‌వారం ఉద‌యం 8 గంట‌ల‌కు పోస్ట‌ల్ బ్యాలెట్ల‌తో కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్‌కు మొత్తం 62 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈవీఎం కోసం ప్ర‌త్యేకంగా 234 కౌంటింగ్ హాళ్లను, పోస్టల్ బ్యాలెట్లు, ETPBS ఓట్లను లెక్కించేందుకు మరో 240 హాళ్లు కేటాయించారు. మొత్తం 3,324 కౌంటింగ్ టేబుళ్లపై ఓట్లను లెక్కించ‌నున్నారు. కౌంటింగ్‌ విధుల్లో 1.25 లక్షల మంది భద్రతా సిబ్బంది, అధికారులు, సూక్ష్మపరిశీలకులు పాల్గొంటున్నారు.

ఎన్నికల సంఘం 234 మంది కౌంటింగ్‌ అబ్జర్వర్లను నియమించింది. రాష్ట్రంలో ఈసారి ముక్కోణపు పోరు జరిగింది. అధికార డీఎంకే, విపక్ష అన్నాడీఎంకేతోపాటు దళపతి విజయ్‌ నేతృత్వంలోని తమిళగ వేట్రి కళగం(టీవీకే) తొలిసారిగా బరిలోకి దిగింది. వరుసగా రెండోసారి విజయంపై డీఎంకే అధినేత స్టాలిన్‌ చాలా ఆశలే పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టిన విపక్ష అన్నాడీఎంకే గెలుపు కోసం హోరాహోరీగా పోరాడింది. డీఎంకే మళ్లీ నెగ్గడం తథ్యమని మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్‌ స్పష్టంచేయగా, విజయ్‌ పార్టీ టీవీకే 98 నుంచి 120 స్థానాలు గెల్చుకొని అధికారంలోకి రాబోతున్నట్లు ‘యాక్సిస్‌ మై ఇండియా’ ఎగ్జిట్‌ పోల్‌ తేల్చిచెప్పింది.

ఎగ్జిట్‌ పోల్స్ ఏమ‌న్నాయంటే..

అయితే రాష్ట్రంలో మళ్లీ డీఎంకే కూటమికే ప్రజలు పట్టం కట్టినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ తెలిపాయి. డీఎంకే కూటమికి 114 నుంచి 136, అన్నాడీఎంకే కూటమికి 34 నుంచి 56 సీట్లు రావొచ్చని టుడేస్‌ చాణక్య వెల్లడించింది. విజయ్ టీవీకే 52 నుంచి 74 స్థానాల్లో విజయం సాధిస్తుందని వివరించింది.

అయితే యాక్సిస్‌ మై ఇండియా మాత్రం టీవీకే పైచేయి సాధిస్తుందని నొక్కిచెప్పింది. టీవీకే 98 నుంచి 120, డీఎంకే కూటమి 92 నుంచి 110, అన్నాడీఎంకే కూటమి 22 నుంచి 32 సీట్లను సొంతం చేసుకుంటుందని వెల్లడించింది.

Advertisement
Advertisement