త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Guru Ravidas 650th Birth Anniversary | గురు పూర్ణిమ రోజున 21 వేల ప్రాంతాల్లో కలశ వందన.. 51 వేల గుళ్లలో దీపోత్సవం

గురు రవిదాస్ 650వ జయంతిని పురస్కరించుకుని బీజేపీ దేశవ్యాప్తంగా ఏడు నెలల పాటు భారీ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. 51,000 ఆలయాల్లో దీపోత్సవం సహా పూర్తి వివరాలు ఇవే.

J

National | Published On Jul 27, 2026, 4.16 pm IST

Guru Ravidas 650th Birth Anniversary | గురు పూర్ణిమ రోజున 21 వేల ప్రాంతాల్లో కలశ వందన.. 51 వేల గుళ్లలో దీపోత్సవం
Advertisement
  • గురు రవిదాస్ జయంతి వేళ బీజేపీ భారీ ప్లాన్
  • దేశవ్యాప్తంగా ఏడు నెలల పాటు 'సమరసతా సంకల్ప్ అభియాన్'
  • వారణాసిలో జులై 28న పవిత్ర మట్టితో కూడిన 131 కలశాలకు ప్రత్యేక పూజలు
  • జులై 29న దేశవ్యాప్త కలశ యాత్రను ప్రారంభించనున్న యోగి ఆదిత్యనాథ్, నితిన్ నబిన్

Guru Ravidas 650th Birth Anniversary | త్రినేత్ర.న్యూస్ : భక్తి ఉద్యమ కాలంలో సామాజిక సామరస్యం కోసం, మత మార్పిడులకు వ్యతిరేకంగా పోరాడిన గురు రవిదాస్ 650వ జయంతిని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (BJP) సన్నద్ధమైంది. ఇందులో భాగంగా ‘సమరసతా సంకల్ప్ అభియాన్’ (సామాజిక సామరస్య తీర్మాన ప్రచారం) పేరుతో దేశవ్యాప్తంగా ఏడు నెలల పాటు భారీ క్యాంపెయిన్‌ (Campaign) చేపట్టనున్నట్లు బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ వెల్లడించారు. జులై 29, 2026 గురు పూర్ణిమ రోజున ప్రారంభమయ్యే ఈ యాత్ర.. గురు రవిదాస్ జయంతి అయిన ఫిబ్రవరి 20, 2027 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

131 కలశాలతో దేశవ్యాప్త యాత్ర

ఈ మెగా క్యాంపెయిన్ ప్రారంభోత్సవ ప్రక్రియ జులై 28న వారణాసిలోని గురు రవిదాస్ జన్మస్థలంలో మొదలవుతుంది. అక్కడి పవిత్రమైన మట్టితో నింపిన 131 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ మరుసటి రోజు అంటే జులై 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, యూపీ రాష్ట్ర అధ్యక్షుడు పంకజ్ చౌదరి, ఇతర అగ్ర నాయకత్వం అంతా కలిసి ఈ 131 కలశాల యాత్రను జెండా ఊపి ప్రారంభించనున్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లాను కవర్ చేసేలా ఈ యాత్ర ప్లాన్ చేశారు.

గంగా ఘాట్ వద్ద దీపమాల 

జులై 29 నుంచి సెప్టెంబర్ 10 వరకు దేశవ్యాప్తంగా 21,000 లోకేషన్లలో ‘కలశ వందన’ ప్రోగ్రామ్స్ జరగనున్నాయి. అలాగే జులై 29వ తేదీ రాత్రి దేశవ్యాప్తంగా 51,000 దేవాలయాలు, గ్రామాల్లో గురు రవిదాస్‌కు నివాళిగా దీపాలు వెలిగించనున్నారు. అంతేకాకుండా.. గంగా ఘాట్ వద్ద చరిత్రాత్మకమైన దీపమాల (Deepmala) ఈవెంట్‌ను కూడా నిర్వహించనున్నట్లు తరుణ్ చుగ్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు ఏడాది పొడవునా కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement