త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BJP Victory in Bengal | చేపల కూర, ఝాల్‌మురితో కమలనాథుల విజయోత్సవాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఈ చారిత్రక ఘట్టంపై స్పందించిన బీజేపీ అగ్రనేతలు, టీఎంసీ దుర్బలానికి, అరాచకాలకు వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు ఇచ్చిన తీర్పు ఇది అని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

J

National | Published On May 4, 2026, 3.13 pm IST

BJP Victory in Bengal | చేపల కూర, ఝాల్‌మురితో కమలనాథుల విజయోత్సవాలు
Advertisement

BJP Victory in Bengal | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకుపోతూ చరిత్ర సృష్టించింది. 294 స్థానాలున్న అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 148ని దాటేసి కమలం పార్టీ ఘన విజయం సాధించిన ఈ టైమ్‌లో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం మిన్నంటింది. 2011 నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీని గద్దె దించడం వెనుక బెంగాల్ ప్రజల, ముఖ్యంగా మహిళల తీర్పు స్పష్టంగా ఉందని బీజేపీ ఎన్నికల ఇంఛార్జి, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ విశ్లేషించారు.

టీఎంసీ అవినీతి, దుర్బలపాలన, ఆర్జీ కర్ ఆసుపత్రి, సందేశ్‌ఖాలీ లాంటి దారుణమైన ఘటనలను ఆ పార్టీ నాయకత్వం అహంకారంతో డీల్ చేసిన విధానానికి వ్యతిరేకంగా మహిళలు మూకుమ్మడిగా ఓటేశారని ఆయన స్పష్టం చేశారు. విద్యాశాఖతో అనుబంధం ఉన్న వ్యక్తిగా బెంగాల్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాలు ఎలా అమ్ముడుపోయాయో, మంత్రుల ఇళ్లలో గుట్టలుగా నగదు ఎలా దొరికిందో తాను కళ్లారా చూశానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగంతో యువత అల్లాడిపోతుంటే, ప్రభుత్వం మాత్రం చొరబాటుదారుల పట్ల ప్రత్యేక ఆప్యాయత కనబరిచిందని, వీటన్నింటికీ వ్యతిరేకంగా బెంగాల్ ప్రజలు ఆలోచించి ఓటు వేశారని ధర్మేంద్ర ప్రధాన్ కొనియాడారు. బెంగాల్ భారీ మార్పు దిశగా పయనిస్తోందని, క్రెడిట్ అంతా ప్రజలదేనని ఆయన అన్నారు.

హిందువుల ఏకీకరణ, ఆదివాసీల ఓట్లతోనే విజయం

బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భావిస్తున్న సువేందు అధికారి సైతం బెంగాల్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు టీఎంసీ దుర్మార్గానికి వ్యతిరేకంగా ఓటు వేశారని ఆయన స్పష్టం చేశారు. బెంగాల్‌లో అధికారంలోకి రావాలన్నది భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ కాలం నాటి కల అని, అది ఇప్పటికి సాకారమైందని ఆయన గుర్తు చేశారు. మహిళల ఓటింగ్ సరళిపై స్పందిస్తూ, ఓట్లను పురుషులు, మహిళలు అని విభజించలేమని, హిందూ మహిళలంతా ఏకతాటిపైకి వచ్చి బీజేపీకి ఓటు వేశారని ఆయన స్పష్టం చేశారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి మీరేనా అన్న ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు.

బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి సైతం ఈ చారిత్రక విజయంపై స్పందిస్తూ, శ్యాం ప్రసాద్ ముఖర్జీ జన్మించిన బెంగాల్ గడ్డ మనదేనని అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి చరిత్రాత్మక తీర్పునిచ్చిన దేశభక్తి గల బెంగాల్ ప్రజలకు ఆయన కోటి వందనాలు అర్పించారు. పశ్చిమ బెంగాల్ ప్రజలు తమకు భారీ తీర్పునిచ్చారని బీజేపీ నేత మనోజ్ తివారీ సైతం ఆనందం వ్యక్తం చేశారు.

ఝాల్‌మురి, మాచేర్ జోల్‌తో సంబరాలు

మమతా బెనర్జీ కోటను బద్దలు కొట్టిన ఆనందంలో కమలనాథులు సంబరాలకు సిద్ధమయ్యారు. టీఎంసీని వీడి బీజేపీ బెంగాల్ పోరుకు నాయకత్వం వహించిన సువేందు అధికారి తన విజయోత్సవ ప్రణాళికలను పంచుకున్నారు. ఒక పక్కా బెంగాలీలాగా తాను ఝాల్‌మురి, మాచేర్ జోల్ (చేపల పులుసు), రసగుల్లాలతో ఈ విజయాన్ని జరుపుకుంటానని ఆయన ఉత్సాహంగా చెప్పారు.

ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ ఒక ఝాల్‌మురి విక్రేతతో ముచ్చటించడం బీజేపీ, టీఎంసీల మధ్య పెద్ద మాటల యుద్ధానికే దారి తీసిన సంగతి తెలిసిందే. అలాగే బెంగాలీలు అత్యంత ఇష్టంగా తినే చేపలను బీజేపీ నిషేధిస్తుందంటూ టీఎంసీ చేసిన ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు, ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు చేపలు తింటూ ఆ అపోహలను తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు అదే చేపల కూర, ఝాల్‌మురితో కమలనాథులు తమ చారిత్రక విజయాన్ని ఆస్వాదిస్తున్నారు.

Advertisement
Advertisement