త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Traffic | ఉద‌యం 10 అయినా ఆఫీసులో ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌నం.. స్టార్ట‌ప్ ఫౌండ‌ర్ పోస్ట్ వైర‌ల్‌

Bengaluru Traffic | ఉద‌యం 10 గంట‌లు అయినా త‌న‌ ఆఫీసులో ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయంటూ ఓ బెంగ‌ళూరు స్టార్ట‌ప్ ఫౌండ‌ర్ పెట్టిన పోస్టు నెట్టింట చ‌ర్చ‌కు దారితీసింది. ఈ ప‌రిస్థితికి కార‌ణం న‌గ‌ర ట్రాఫికే అని తెలిపారు. సమస్య మనుషుల్లో లేదని.. ఆఫీసుకు చేరుకోవడానికి పడుతున్న శ్రమలో ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ఉద్యోగుల కష్టాలకు అద్దం ప‌డుతున్నాయి.

D

National | Published On Aug 19, 2026, 3.32 pm IST

Bengaluru Traffic | ఉద‌యం 10 అయినా ఆఫీసులో ఖాళీ కుర్చీలు ద‌ర్శ‌నం.. స్టార్ట‌ప్ ఫౌండ‌ర్ పోస్ట్ వైర‌ల్‌
Advertisement

Bengaluru Traffic | త్రినేత్ర‌.న్యూస్ : ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే న‌గ‌రాల జాబితాలో క‌ర్ణాట‌క రాజ‌ధాని, సిలికాన్ సిటీ బెంగ‌ళూరు దేశంలోనే ఫ‌స్ట్ ప్లేస్‌లో (Bengaluru Traffic) ఉంటుంది. అక్క‌డి ట్రాఫిక్‌తో న‌గ‌ర వాసులు న‌ర‌క‌యాత‌న అనుభ‌విస్తుంటారు. కొన్ని మీట‌ర్ల దూరానికే గంట‌ల త‌ర‌బ‌డి ప్ర‌యాణించాల్సి ఉంటుంది. బెంగ‌ళూరు న‌గ‌ర వాసులు త‌మ‌ ట్రాఫిక్ బాధ‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు వీడియోల రూపంలో సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే, బెంగళూరు ట్రాఫిక్ ఉద్యోగుల జీవితాల‌ను, స‌మ‌యాన్ని ఎలా ప్ర‌భావితం చేస్తోందో తెలియ‌జేస్తూ ఓ స్టార్ట‌ప్ ఫౌండ‌ర్ పెట్టిన పోస్టు చ‌ర్చనీయాంశంగా మారింది.

సాధార‌ణంగా ఉద‌యం 10 అయ్యిందంటే చాలు ఆఫీసులు (Bengaluru offices) ఉద్యోగుల‌తో కిక్కిరిపోతుంటాయి. కొంత‌మంది టైమ్ కంటే ముందే ఆఫీసుకు చేరుకుంటుంటారు. అయితే, తాజాగా ఓ ఆఫీసులో 10:15 అయినా ఖాళీ కుర్చీలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అప్లైడ్ ఏఐ స్టూడియో (Applied AI Studio), అప్లైడ్ ఏఐ క్లబ్ కమ్యూనిటీ (Applied AI Club community) వ్య‌వ‌స్థాప‌కుడు బాల ప‌నీర్ సెల్వం (Bala Panneerselvam) ఇందుకు సంబంధించిన ఫొటోను లింక్డిన్‌లో షేర్ చేశారు. సాధార‌ణంగా ఆ స‌మ‌యంలో త‌న ఆఫీసు ఉద్యోగుల‌తో సంద‌డిగా ఉంటుంద‌ని.. కానీ 10 దాటినా ఆఫీస్ మొత్తం చాలా సైలెంట్‌గా ఉంద‌ని పేర్కొన్నారు. ఇందుకు కార‌ణంగా న‌గ‌ర ట్రాఫికే అని తెలిపారు. సమస్య మనుషుల్లో లేదని.. ఆఫీసుకు చేరుకోవడానికి పడుతున్న శ్రమలో ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు బెంగళూరు ఉద్యోగుల కష్టాలకు అద్దం ప‌డుతున్నాయి.

ఉద్యోగుల్లో ప‌నిచేసే ఉత్సాహం త‌గ్గిపోతోంది..

ఈ సంద‌ర్భంగా న‌గ‌ర ప్ర‌యాణం గురించి ఆయ‌న వివ‌రించారు. HSR ప్రాంతంలోని నాలుగు కిలోమీటర్ల దూరాన్ని దాటడానికి స్కూటర్‌పై సుమారు 20 నిమిషాలు, కారులో 30 నిమిషాల స‌మ‌యం ప‌డుతోంద‌ని చెప్పారు. పీక్ అవ‌ర్స్‌లో ఈ సమయం ఇంకా పెరుగుతుందని పేర్కొన్నారు. ట్రాఫిక్‌లో వాహ‌నాల‌ను త‌ప్పించుకుని, సిగ్న‌ల్న్‌ను దాటి ఉద్యోగులు ఆఫీసుకు చేరుకునే సరికి వారు మానసికంగానూ, శారీరకంగానూ పూర్తిగా అలసిపోతున్నార‌ని అభిప్రాయపడ్డారు. ప‌ని చేసే ఉత్సాహం కూడా త‌గ్గిపోతోంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

స‌గ‌టు మ‌నిషికి ఆలోచించే స‌మ‌యం ఎక్క‌డ..?

ఉద్యోగుల స‌గం జీవితం ట్రాఫిక్‌కే అంకిత‌మ‌వుతోంద‌ని చెప్పుకొచ్చారు. సాయంత్రం 5 గంట‌ల‌కే ఆఫీసు ముగించుకుని ఇంటికి చేరుకునేలోపు కుటుంబంతో వ్య‌క్తిగ‌త‌ స‌మ‌యాన్ని ఆస్వాదించ‌లేనంత‌గా ఉద్యోగులు అల‌సిపోతున్నార‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఎదురైన ట్రాఫిక్ క‌ష్టాల‌ను బాల వివ‌రించారు. పీక్ అవ‌ర్స్ కాక‌పోయినా, వర్షం లేక‌పోయినా, ఎలాంటి స్పష్టమైన అంతరాయం లేని రోజున సాయంత్రం 4 గంటలకు వైట్‌ఫీల్డ్‌ నుంచి హెచ్‌ఎస్‌ఆర్‌ వరకు 17 కిలోమీటర్ల ప్రయాణానికి త‌న‌కు ఏకంగా రెండు గంటల స‌మ‌యం పట్టిందని తెలిపారు. చుట్టూ ఉన్న ఈ ట్రాఫిక్‌ గంద‌ర‌గోళం వ‌ల్ల నిరంత‌రం స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్పుడు.. స‌గ‌టు మ‌నిషికి ఆలోచించే స‌మ‌యం ఎక్క‌డ ఉంటుంది..? మాన‌సిక ప్ర‌శాంత‌త‌ను ఎలా పొంద‌గ‌ల‌డు..? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. బాలా పోస్టు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది. ఆయ‌న పోస్టుతో బెంగ‌ళూరు న‌గ‌ర ట్రాఫిక్ క‌ష్టాల గురించి నెట్టింట మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

Also Read..

విద్యార్థి నిర‌స‌న‌లపై విజ‌య్ స‌ర్కార్ యూట‌ర్న్‌.. వివాదాస్ప‌ద ఆదేశాలు ర‌ద్దు

స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో బుర్ఖాతో డ్యాన్స్‌.. పాఠ‌శాల‌ సీజ్

తెలంగాణ భవన్‌కు పోటెత్తిన 22A బాధితులు.. స‌మ‌స్య‌లు విని బాధితుల‌కు భ‌రోసా ఇచ్చిన‌ హ‌రీశ్‌రావు

Advertisement
Advertisement