త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Whistleblower Willis Towers Watson | విజిల్ బ్లోయర్‌కు భారీ ఊరట.. రూ.3.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు

కంపెనీ అక్రమాలను బయటపెట్టాడనే కక్షతో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిన విజిల్ బ్లోయర్‌కు రూ.3.67 కోట్లు చెల్లించాలని బెంగళూరు కోర్టు సంచలన తీర్పునిచ్చింది.

J

National | Published On Oct 22, 2026, 5.58 pm IST

Whistleblower Willis Towers Watson | విజిల్ బ్లోయర్‌కు భారీ ఊరట.. రూ.3.67 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఆ కంపెనీకి ఆదేశాలు

సంక్షిప్త సారాంశం

విల్లిస్ టవర్స్ వాట్సన్ (WTW) సంస్థలో హెల్త్ అండ్ బెనిఫిట్స్ మాజీ హెడ్‌గా పనిచేసిన ఉద్యోగిని 2018లో అన్యాయంగా తొలగించడాన్ని బెంగళూరు సివిల్ కోర్టు తప్పుపట్టింది. ఆర్థిక అవకతవకలను, ఫాంటమ్ వెండర్ పేమెంట్లను ప్రశ్నించినందుకు విజిల్ బ్లోయర్ పాలసీకి విరుద్ధంగా తొలగించారని కోర్టు నిర్ధారించింది. బాధితుడికి ప్రత్యేక నష్టపరిహారంగా రూ.3.67 కోట్లు, మానసిక వేదనకు రూ. 10 లక్షలు చెల్లించాలని కంపెనీని ఆదేశించింది. కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ఇద్దరు కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లపై పెర్జ్యురీ (అసత్య ప్రమాణం/తప్పుడు సాక్ష్యం) కేసులు నమోదు చేయాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది.

Advertisement

Whistleblower Willis Towers Watson | త్రినేత్ర న్యూస్ : ప్రైవేట్ రంగంలో పనిచేసే విజిల్ బ్లోయర్లకు (Whistleblowers) రక్షణ కల్పిస్తూ బెంగళూరు సివిల్ కోర్టు ఒక చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రఖ్యాత 'విల్లిస్ టవర్స్ వాట్సన్ ఇండియా ఇన్సూరెన్స్ బ్రోకర్స్' (WTW) సంస్థలో హెల్త్ అండ్ బెనిఫిట్స్ మాజీ హెడ్‌గా పనిచేసిన ఉద్యోగిని 2018లో అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించడాన్ని కోర్టు చట్టవిరుద్ధమని తేల్చింది. ఈ కేవలం తొలగింపుపై విచారణ జరిపిన న్యాయమూర్తి షిరిన్ జావీద్ అన్సారీ.. బాధితుడికి సుమారు రూ. 3.7 కోట్ల ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆదేశించారు.

అసలు వివాదం ఏమిటి?

సంస్థలో జరుగుతున్న ఫాంటమ్ వెండర్ పేమెంట్లు (ఫేక్ బిల్లులు), అకౌంటింగ్ రికార్డుల తారుమారు, లైసెన్స్ లేని మధ్యవర్తులకు చెల్లింపులు వంటి పలు ఆర్థిక అవకతవకలపై ఆ ఉద్యోగి అంతర్గతంగా ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీ విజిల్ బ్లోయర్ పాలసీ ప్రకారం తప్పులను ఎత్తిచూపిన ఉద్యోగులకు రక్షణ కల్పించాలి, వారిపై ఎలాంటి ప్రతీకార చర్యలు (Retaliation) తీసుకోకూడదు. కానీ, యాజమాన్యం దీనికి విరుద్ధంగా జూలై 2018లో ఆయనను సస్పెండ్ చేసి, ఆ తర్వాత సెప్టెంబర్ 28, 2018న ఎలాంటి సరైన వివరణ కోరకుండానే ఉద్యోగం నుంచి తొలగించింది.

కోర్టు కీలక పరిశీలనలు

కంపెనీ బోర్డు విజిల్ బ్లోయర్ పాలసీలను ఆమోదించిందని, కోడ్ ఆఫ్ కండక్ట్ అందరికీ వర్తిస్తుందని మేనేజింగ్ డైరెక్టర్ కోర్టులో అంగీకరించారు. నోటీసు ఇచ్చి ఉద్యోగం నుంచి తొలగించే ఒప్పందం ఉంది కదా అని చెప్పి, వేరే నిబంధనలను ఉల్లంఘించే హక్కు కంపెనీకి లేదని కోర్టు స్పష్టం చేసింది. సస్పెన్షన్ ఎత్తివేసిన మరుసటి రోజే తొలగించడం అనేది పూర్తిగా ప్రతీకార చర్యేనని కోర్టు అభిప్రాయపడింది.

కోర్టులో తప్పుడు సాక్ష్యం.. ఎగ్జిక్యూటివ్‌లపై పెర్జ్యురీ చర్యలు

ఈ కేసు విచారణ సమయంలో కోర్టును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించిన WTW ఎగ్జిక్యూటివ్‌లపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తప్పుడు సాక్ష్యాలు, అసత్య ప్రకటనలు ఇచ్చినందుకు గాను ఎండీ విజయ్ కుమార్ సూరి, మరో సీనియర్ అధికారి సెడ్రిక్ లువాపై క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (CrPC) సెక్షన్ 340(1)(b) కింద పెర్జ్యురీ (Perjury - తప్పుడు సాక్ష్యం) ఫిర్యాదు దాఖలు చేయాలని కోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. కోర్టు విచారణలో సాక్షులు అబద్ధాలు చెబితే ఊరుకోలేమని, న్యాయ ప్రక్రియను మోసగించే ప్రయత్నాలను ఉపేక్షించబోమని కోర్టు తేల్చిచెప్పింది.

నష్టపరిహారం, గౌరవప్రదమైన లేఖ జారీ

బాధితుడు కోల్పోయిన వేతనం ఆధారంగా లెక్కగట్టిన రూ.3,67,97,082 ప్రత్యేక నష్టపరిహారాన్ని, మానసిక వేదనకు గురిచేసినందుకు మరో రూ. 10 లక్షలను, అలాగే వృత్తిపరమైన గౌరవానికి భంగం కలిగించినందుకు అదనంగా రూ. 2 లక్షలను చెల్లించాలని తీర్పునిచ్చింది. అంతేకాకుండా, ఆ ఉద్యోగి తొలగింపునకు సంబంధించి ఆయన ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీని దెబ్బతీసేలా ఉన్న పాత లెటర్లను రద్దు చేసి, ఎలాంటి మచ్చ లేని సరికొత్త గౌరవప్రదమైన రిలీవింగ్ లేఖను అందజేయాలని కంపెనీని ఆదేశించింది. విల్లిస్ టవర్స్ వాట్సన్‌కు చెందిన పలు అనుబంధ సంస్థలు ఈ చెల్లింపులకు సంయుక్తంగా బాధ్యత వహించాలని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.

Advertisement
Advertisement