త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Patna High Court Divorce Judgement | విడాకులు మంజూరు.. భార్యకు రూ.36.25 లక్షల భరణం చెల్లించాలని పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

భార్యాభర్తల మధ్య సయోధ్య కుదరకపోతే పరస్పర క్రూరత్వంగా పరిగణించి విడాకులు మంజూరు చేయవచ్చునని పాట్నా హైకోర్టు స్పష్టం చేసింది. భరణం కింద రూ. 36.25 లక్షలు..

J

National | Published On Oct 22, 2026, 5.24 pm IST

Patna High Court Divorce Judgement | విడాకులు మంజూరు.. భార్యకు రూ.36.25 లక్షల భరణం చెల్లించాలని పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

సంక్షిప్త సారాంశం

భార్యాభర్తల మధ్య ఎలాంటి సర్దుబాటు లేక కలసి ఉండేందుకు ఇష్టపడకపోతే, దానిని హిందూ వివాహ చట్టం సెక్షన్ 13(1)(i-a) ప్రకారం 'పరస్పర క్రూరత్వం'గా భావించి విడాకులు మంజూరు చేయవచ్చని పాట్నా హైకోర్టు తేల్చింది. భర్త జీతం నెలకు రూ. 85,000 ఉండగా, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ఆధారంగా భార్య జీవన శైలిని బట్టి రూ. 36.25 లక్షల శాశ్వత భరణాన్ని (Permanent Alimony) కోర్టు ఆదేశించింది. 2013లో వివాహం జరిగిన ఈ దంపతులకు ఒక కుమారుడు ఉండగా, మనస్పర్థల కారణంగా విడిపోయారు. భర్త ఇప్పటికే రెండో వివాహం కూడా చేసుకున్నాడు. కోర్టు ఆదేశించిన రూ.36.25 లక్షల భరణాన్ని రెండు సమాన వాయిదాల్లో మూడు నెలల్లోగా భార్య సేవింగ్స్ ఖాతాలో జమ చేయాలని భర్తను హైకోర్టు ఆదేశించింది.

Advertisement

Patna High Court Divorce Judgement | త్రినేత్ర న్యూస్ : భార్యాభర్తల మధ్య ఎలాంటి సర్దుబాటు కుదరక, కలిసి ఉండేందుకు ఇష్టపడని పక్షంలో వారి చర్యలను 'పరస్పర క్రూరత్వం' (Reciprocal Cruelty)గా పరిగణించి హిందూ వివాహ చట్టం కింద విడాకులు మంజూరు చేయవచ్చునని పాట్నా హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి భర్తకు విడాకులు మంజూరు చేస్తూనే, భార్యకు రూ. 36.25 లక్షల శాశ్వత భరణం (Permanent Alimony) చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించింది. పాట్నా హైకోర్టు ఇచ్చిన ఈ కీలక తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలు వివాదం ఏంటి?

బిహార్‌లోని పాట్నాలో జనవరి 23, 2013న సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న దంపతులకు, జనవరి 25, 2014న ఒక బాబు జన్మించాడు. అయితే కొద్ది కాలానికే వారి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో భార్య అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య తనను గౌరవించడం లేదని, ఎలాంటి సరైన కారణం లేకుండానే ఇల్లు విడిచి వెళ్లిపోయిందని భర్త కోర్టులో వాదించారు. మరోవైపు, అత్తమామలు తనను మానసికంగా, శారీరకంగా వేధించారని, తన భర్త పాట్నాలో వేరే కాపురం పెట్టేందుకు నిరాకరించారని భార్య ఆరోపించారు.

దిగువ కోర్టు విడాకులు మంజూరు చేయగా.. నవంబర్ 29, 2022న హాజీపూర్ ఫ్యామిలీ కోర్టు భర్త వాదనలతో ఏకీభవించి విడాకులు మంజూరు చేసింది. అయితే ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన భార్య పాట్నా హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు విచారణ, కీలక వ్యాఖ్యలు

పాట్నా హైకోర్టు ఇద్దరినీ విచారించి, ప్రస్తుతం తాము భార్యాభర్తలుగా కలిసి ఉండే మానసిక స్థితిలో లేమని స్పష్టం చేశారు. భర్త ఇప్పటికే రెండో వివాహం చేసుకుని ఒక పాపకు తండ్రి అయ్యాడు. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు.. వివాహ వ్యవస్థలో సర్దుబాటు చేసుకునే అవకాశమే లేనప్పుడు, వారి చర్యలను 'పరస్పర క్రూరత్వం' కింద పరిగణించవచ్చని పేర్కొంది. హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 13(1)(i-a) ప్రకారం ఈ ప్రాతిపదికన వివాహ బంధాన్ని రద్దు చేయవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

రూ.36.25 లక్షల శాశ్వత భరణం చెల్లించాలని ఆదేశం

భర్త నెలవారీ సంపాదన సుమారు రూ. 85,000 అని హైకోర్టు గుర్తించింది. సుప్రీంకోర్టు ఫేమస్ తీర్పు 'రజ్నేష్ వర్సెస్ నేహా' (Rajnesh vs Neha) కేసులో సూచించిన ఫార్ములా ప్రకారం.. భర్త సంపాదనలో మూడో వంతును భరణంగా లెక్కగట్టి రూ. 36.25 లక్షలను శాశ్వత భరణంగా నిర్ణయించింది. ఈ మొత్తాన్ని రెండు సమాన వాయిదాల్లో, తీర్పు వెలువడిన తేదీ నుంచి మూడు నెలల్లోపు భార్య సేవింగ్స్ ఖాతాలో నేరుగా జమ చేయాలని భర్తను హైకోర్టు ఆదేశించింది.

Advertisement
Advertisement