త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Politics | ఆ ఏడుగురు ఎంపీల‌పై ఫిరాయింపుల అస్త్రం..! మ‌రో రాజ‌కీయ పోరుకు సిద్ధ‌మైన ఆప్‌..!

Delhi Politics | ఆప్‌కు చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడం దేశ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు వ‌చ్చాయి. వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఆప్ డిమాండ్ చేయ‌డం యాంటీ డిఫెక్షన్ చట్టంపై మ‌ళ్లీ చ‌ర్చ జ‌రుగుతోంది.

P

National | Published On Apr 26, 2026, 4.48 pm IST

Delhi Politics | ఆ ఏడుగురు ఎంపీల‌పై ఫిరాయింపుల అస్త్రం..! మ‌రో రాజ‌కీయ పోరుకు సిద్ధ‌మైన ఆప్‌..!
Advertisement

Delhi Politics | దేశ జాతీయ రాజ‌ధానిలో మ‌రోసారి రాజ‌కీయాలు వేడెక్కాయి. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేర‌డం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాన్ని ప్రతిపక్షాలు ప్రజాస్వామ్యంపై దాడిగా అభివర్ణిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఆప్ సైతం కౌంటర్ దాడి ప్రారంభించింది. పార్టీ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ పార్టీని వీడిన ఆ ఏడుగురు ఎంపీల రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజ్యసభ చైర్మన్‌ను అధికారికంగా కోరినట్లు వెల్లడించారు. పార్టీని వీడిన త‌ర్వాత ఎంపీ ప‌ద‌విలో కొన‌సాగ‌డం ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని వ్యాఖ్యానించారు. పార్టీ తరఫున ఇప్పటికే పిటిషన్ సమర్పించినట్లు తెలిపారు. ఈ ఎంపీలు ఇకపై పార్టీకి చెందిన వారు కారని, కాబట్టి సభ్యత్వం కొనసాగకూడదని పేర్కొన్నారు. పార్టీని వీడినా పదవులు కొనసాగించడం నిబంధనలకు వ్యతిరేకమని ఆరోపించారు.

యాంటీ డిఫెక్షన్ చట్టం ఏమిటి?

ఈ ఘటన దేశవ్యాప్తంగా యాంటీ డిఫెక్షన్ (ఫిరాయింపుల‌) చట్టంపై మళ్లీ చర్చను రేకెత్తించింది. 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి వచ్చిన ఈ చట్టం, ప్రజాప్రతినిధులు పార్టీ మార్పులను నియంత్రించడానికి తీసుకువ‌చ్చారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీని విడిచి మరో పార్టీలో చేరడం ద్వారా ప్రజల ఓటు విలువను దెబ్బతీయకుండా నిరోధించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ చట్టం ప్రకారం.. ఎంపీ, ఎమ్మెల్యే తమ పార్టీని విడిచినా, పార్టీ విప్‌ను ఉల్లంఘించినా, వారి సభ్యత్వాన్ని ర‌ద్దు చేయొచ్చు. ఈ విషయంలో తుది నిర్ణయం సంబంధిత సభ స్పీకర్, చైర్మన్ తీసుకుంటారు. అయితే, కొన్ని మినహాయింపులు కూడా ఉన్నాయి. గతంలో ఒక వంతు సభ్యులు విడిపోయి మ‌రో వర్గంగా ఏర్పడితే అనర్హత వర్తించేది కాదు. కానీ, తర్వాతి సవరణలతో ఈ నిబంధనల్లో మార్పులు జరిగాయి. ప్రస్తుతం పార్టీ విలీనం వంటి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రస్తుతం చోటుచేసుకున్న ఈ పరిణామంలో పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ఎలా వ‌ర్తిస్తుంద‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

రాజ్య‌స‌భ చైర్మ‌న్‌దే తుది నిర్ణ‌యం?

ఈ ఎంపీలు పార్టీని ఏ విధంగా వ‌దిలి వెళ్తారు. అధికారికంగా రాజీనామా చేశారా? లేదంటే నేరుగా మ‌రో పార్టీలో చేరార‌? అనే అంశాల ఆధారంగా నిర్ణ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. రాజ్యసభ చైర్మన్ అన్ని వివరాలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఘటనతో దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణలు ఏర్పడే అవకాశాలపై చర్చ జరుగుతోంది. ఒకవైపు ప్రతిపక్షాలు దీన్ని ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణిస్తుండగా, మరోవైపు అధికార పార్టీ మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామం కేవలం పార్టీ మార్పు కాకుండా, చట్టపరమైన, రాజకీయంగా కీల‌కంగా మారింది. రాజ్యసభ చైర్మన్ ఏం నిర్ణ‌యం తీసుకుంటార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement
Advertisement