త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్‌జీ, ఎరువుల‌తో.. హ‌ర్మూజ్‌ను దాటి భార‌త్‌వైపు వ‌స్తున్న 30 భారీ నౌక‌లు

India Bound Ships | హ‌ర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఈ క్రమంలో భార‌త్‌వైపు (India Bound Ships) వ‌స్తున్న దాదాపు 30 నౌక‌లు సుర‌క్షితంగా హ‌ర్మూజ్‌ను దాటిన‌ట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు తెలిపాయి.

D

National | Published On Jun 25, 2026, 10.23 am IST

India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్‌జీ, ఎరువుల‌తో.. హ‌ర్మూజ్‌ను దాటి భార‌త్‌వైపు వ‌స్తున్న 30 భారీ నౌక‌లు
Advertisement

India Bound Ships | అమెరికా-ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా గ‌త మూడు నెల‌ల‌కుపైగా మూతపడిన కీలకమైన హ‌ర్మూజ్ జలసంధి (Strait of Hormuz) గుండా నౌకల రాకపోకలు మళ్లీ మొదలయ్యాయి. ఇరు దేశాల మధ్య జరిగిన దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఈ సముద్ర మార్గంలో నౌకల రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి. ఈ క్రమంలో భార‌త్‌వైపు (India Bound Ships) వ‌స్తున్న దాదాపు 30 నౌక‌లు సుర‌క్షితంగా హ‌ర్మూజ్‌ను దాటిన‌ట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వ‌ర్గాలు తెలిపాయి.

మ‌రో 26 నౌక‌లు ఈ జ‌ల‌మార్గం గుండా ప్ర‌యాణించేందుకు ప‌ర్షియ‌ల్ గ‌ల్ఫ్ (Persian Gulf)లో ప్ర‌యాణ అనుమ‌తుల కోసం వేచి ఉన్న‌ట్లు వెల్ల‌డించాయి. భార‌త్‌కు అవ‌స‌ర‌మైన ముడిచమురు, గ్యాస్, ఎరువులతో వ‌స్తున్న ఈ నౌక‌ల క‌ద‌లిక‌ల‌ను నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు పేర్కొన్నాయి. భార‌త్‌వైపు వ‌స్తున్న ఈ 30 నౌక‌ల్లో దాదాపు సగం ఓడ‌లు ఎల్పీజీ, స‌హ‌జ వాయువుల‌ను తీసుకొస్తున్న‌ట్లు అధికారులు తెలిపారు. మ‌రో ఎనిమిది నౌక‌లు భారీ స‌ర‌కులు మోసుకొస్తుండ‌గా.. ఏడు ముడి చ‌మురు ట్యాంకర్లు ఉన్నాయి. ఇక ప్ర‌యాణానికి రెడీగా ఉన్న‌ 26 భారతీయ నౌకల్లో 3 నౌకలు ఇంధన లోడుతో, 10 నౌకలు ఎరువులతో, మిగిలిన 13 నౌకలు ఇతర నిత్యావసర వస్తువులతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. వీటి రాక‌తో దేశంలో ఇంధ‌న‌, ఎరువుల కొర‌త తీర‌నుంది. హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సాఫీగా సాగితే దేశంలో ఇంధన ధరలు స్థిరపడతాయని, ఎరువుల కొరత తీరి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

కాగా, భార‌త్ త‌న‌కు అవ‌స‌ర‌మైన ముడి చ‌మురు, ఎల్పీజీ, ఎరువులు వంటివాటిని ప‌ర్షియ‌ల్ గ‌ల్ఫ్ నుంచే దిగుమ‌తి చేసుకుంటోంది. వీటి స‌ర‌ఫ‌రా మొత్తం హ‌ర్మూజ్ గుండానే సాగుతుంది. అయితే, ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అమెరికా-ఇరాన్‌-ఇజ్రాయెల్ మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల కార‌ణంగా ఆ జ‌ల‌సంధిని టెహ్రాన్ మూసివేసింది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇంధ‌న సంక్షోభం త‌లెత్తింది. అయితే, తాజా ప‌రిణామాల‌తో మ‌న దేశంలో ఇంధ‌న భ‌ద్ర‌త‌కు ఉన్న ముప్పు త‌ప్పిన‌ట్లైంది. ఇరాన్‌-అమెరికా మ‌ధ్య కుదిరిన డీల్ భారత వాణిజ్య రంగానికి, ముఖ్యంగా చమురు దిగుమతులకు అతిపెద్ద ఊరటనిచ్చిన‌ట్లైంది.

Advertisement
Advertisement