త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

2027 Census | 2027 జ‌న‌గ‌ణ‌న‌.. తొలిద‌శ‌లో ప్ర‌జ‌ల‌కు 33 ప్ర‌శ్న‌లు..

2027 Census | న్యూఢిల్లీ: 2027 జనగణన తొలి దశకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ దశలో భాగంగా పౌరులను అడగనున్న 33 ప్రశ్నలను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది.

S

National | Published On Jan 23, 2026, 11.16 am IST

2027 Census | 2027 జ‌న‌గ‌ణ‌న‌.. తొలిద‌శ‌లో ప్ర‌జ‌ల‌కు 33 ప్ర‌శ్న‌లు..
Advertisement

2027 Census | న్యూఢిల్లీ: 2027 జనగణన తొలి దశకు సంబంధించిన ప్రశ్నాపత్రాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. హౌస్ లిస్టింగ్, హౌసింగ్ దశలో భాగంగా పౌరులను అడగనున్న 33 ప్రశ్నలను గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసింది. చాలా ఆలస్యంగా జరుగుతున్న 16వ జనగణనను రెండు దశల్లో పూర్తి చేయనుండగా, మొత్తం ప్రక్రియ 2027 మార్చి 1 నాటికి ముగుస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు, అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఇంట్లో నివసించే వివాహిత జంటల సంఖ్య, కుటుంబాధిపతి లింగం వంటి అంశాలతో పాటు అనేక వివరాలను నమోదు చేయనున్నారు. హౌస్ లిస్టింగ్ దశలో ఎల్పీజీ, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) కనెక్షన్లు వంటి మౌలిక వసతుల వివరాలను కూడా సేకరించనున్నారు.

ఇంట‌ర్నెట్ సౌకర్యంపై..

2027 జనగణన షెడ్యూల్‌లో ఈసారి కొన్ని కొత్త అంశాలను చేర్చారు. ఇంటర్నెట్ సౌకర్యం ఉందా లేదా, మొబైల్ నంబర్ వినియోగం, ల్యాప్‌టాప్, కంప్యూటర్, స్మార్ట్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల కలిగివుండటం, కుటుంబంలో ప్రధానంగా వినియోగించే ధాన్యం (సిరియల్) వంటి వివరాలు కూడా నమోదు చేయనున్నారు. అయితే 2011 జనగణనలో ఉన్న బ్యాంకింగ్ సేవలపై ప్రశ్నను ఈసారి తొలగించారు. మొదటి దశ అయిన హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో ఇంటి యాజమాని ఎవరు, ఇంటి వినియోగ విధానం, ఇంటి పరిస్థితి, నేల, పైకప్పుకు ఉపయోగించిన ప్రధాన పదార్థాలు వంటి వివరాలను నమోదు చేస్తారు. రెండో దశ అయిన జనాభా లెక్కింపు (పాప్యులేషన్ ఎన్యుమరేషన్) 2027 ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమవుతుందని ప్రభుత్వం తెలిపింది. ఈ దశలో జనాభా సంబంధిత, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వివరాలను సేకరించనున్నారు. కుల వివరాలను కూడా ఈ దశలో డిజిటల్ రూపంలో నమోదు చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది.

సెల్ఫ్ ఎన్యుమ‌రేష‌న్‌కు అవ‌కాశం..

ఇంటి పెద్ద పేరు, లింగం, వారు ఎస్సీ, ఎస్టీ లేదా ఇతర వర్గానికి చెందినవారా అనే వివరాలను కూడా సేక‌రించనున్నారు. హౌస్ లిస్టింగ్ ప్రారంభానికి ముందు 15 రోజుల పాటు స్వయంగా వివరాలు నమోదు చేసుకునే (సెల్ఫ్ ఎన్యుమరేషన్) అవకాశం కూడా కల్పించనున్నారు. ప్రజలు తమకు తెలిసినంత వరకు నిజమైన సమాచారం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడింది. కుల గణనను చేర్చే నిర్ణయాన్ని గత ఏడాది ఏప్రిల్ 30న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్ సమావేశంలో తీసుకున్నారు. డేటా సేకరణ 2027 మార్చి 1 నాటికి పూర్తవుతుందని, అయితే ఫలితాలను ప్రకటించడానికి మరో రెండు నుంచి మూడు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement