త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద రాత్రిళ్లు భారీ బ్లాస్టింగ్‌లు.. హరీశ్ రావు ఫైర్!

మల్లన్న సాగర్ కట్టకు కేవలం 200 మీటర్ల దూరంలో రాత్రి వేళల్లో అక్రమ బ్లాస్టింగ్‌లు చేస్తున్నారంటూ మంత్రి ఉత్తమ్‌కు లేఖ రాసిన మాజీ మంత్రి హరీశ్ రావు. పనులు ఆపకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరిక.

J

Medak | Published On Oct 29, 2026, 11.00 pm IST

Harish Rao Letter to Uttam Kumar Reddy | మల్లన్న సాగర్ వద్ద రాత్రిళ్లు భారీ బ్లాస్టింగ్‌లు.. హరీశ్ రావు ఫైర్!

సంక్షిప్త సారాంశం

మల్లన్న సాగర్ రిజర్వాయర్ కట్టకు అతి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న భారీ బ్లాస్టింగ్‌లను తక్షణమే నిలిపివేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ. నిబంధనల ప్రకారం ఆనకట్టకు 600 మీటర్ల పరిధి వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉన్నా, 200 మీటర్ల లోపే మూసీ రీజువనేషన్ పంప్ హౌస్ కోసం బ్లాస్టింగ్‌లు చేస్తున్నారని ఆరోపణ. రిజర్వాయర్ కట్టకు ఏమైనా నష్టం జరిగితే దిగువన ఉన్న 60 గ్రామాల ప్రజల పరిస్థితి ఏమిటని, దానికి మంత్రి బాధ్యత వహిస్తారా అని సూటి ప్రశ్న. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా బ్లాస్టింగ్ చేపడుతున్న ఏజెన్సీ నిర్వాహకులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి పనులు ఆపాలని, లేదంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష పోరాటం చేస్తామని వార్నింగ్.

Advertisement
  • మంత్రి ఉత్తమ్‌కు హరీశ్ రావు లేఖ
  • ఏజెన్సీపై నాన్-బెయిలబుల్ కేసులు పెట్టాలని డిమాండ్

Harish Rao Letter to Uttam Kumar Reddy | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ సాగునీటి రంగంలో కీలకమైన మల్లన్న సాగర్ రిజర్వాయర్ భద్రతను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ప్రమాదంలోకి నెడుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ టి. హరీశ్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు కట్టకు అతి సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా, రాత్రిళ్లలో చేపడుతున్న భారీ బ్లాస్టింగ్‌లను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. అనుమతులు లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్‌లు చేస్తున్న కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్వాహకులపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

కట్టకు 200 మీటర్ల పరిధిలోనే పేలుళ్లు.. 60 గ్రామాలకు ముప్పు

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా తొగుట, కొండపాక మండలాల సరిహద్దుల్లో 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్‌లో ప్రస్తుతం 12.5 టీఎంసీల నీటి నిల్వ ఉందని హరీశ్ రావు గుర్తుచేశారు. 60 మీటర్ల ఎత్తు, 22.6 కిలోమీటర్ల పొడవుతో అత్యంత పటిష్టంగా నిర్మించిన ఈ ఆనకట్టకు 600 మీటర్ల పరిధిలో ఎలాంటి భారీ పనులు చేయకూడదన్నది అంతర్జాతీయ నిబంధన అని వివరించారు.

"మూసీ నది పునరుజ్జీవం కోసం మల్లన్న సాగర్ నుంచి నీటిని తరలించేందుకు కట్ట పక్కనే కొత్త పంప్ హౌస్ నిర్మిస్తున్నట్లు తెలిసింది. ప్రజా ప్రయోజనాల కోసం నీటిని తరలించడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ కట్టకు కేవలం 200 మీటర్ల పరిధిలోనే భారీ బ్లాస్టింగ్‌లు చేయడం ఎంతవరకు సమంజసం? దీనికి ఏ నిపుణుల కమిటీ రాతపూర్వక ఆమోదం తెలిపింది? ఏదైనా జరగరాని ప్రమాదం జరిగితే దిగువనున్న 60 గ్రామాల ప్రజల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు సమాధానం చెప్పాలి" అని హరీశ్ రావు నిలదీశారు.

16 లక్షల ఎకరాల జీవనాడి.. నిర్లక్ష్యం తగదు

మల్లన్న సాగర్ ద్వారా ప్రత్యక్షంగా 1.65 లక్షల ఎకరాలు, పరోక్షంగా కొండపోచమ్మ సాగర్, గంధమల్ల, బస్వాపూర్, హల్దీవాగు, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల ద్వారా మరో 16.43 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉందని హరీశ్ రావు పేర్కొన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రిజర్వాయర్‌ను అనాలోచిత చర్యలతో బలహీనపరిచే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని తేల్చిచెప్పారు.

నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి.. పనులు ఆపకుంటే ఉద్యమమే

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం నిర్మించిన ఆర్ అండ్ ఆర్ (R&R) కాలనీల్లో 90 శాతానికి పైగా వసతులు కల్పించామని, మిగిలిన పనులను పూర్తి చేయాలని కోర్టు ఆదేశించినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హరీశ్ రావు మండిపడ్డారు. నాడు విపక్షంలో ఉన్నప్పుడు నిర్వాసితులకు మరింత ఎక్కువ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసిన రేవంత్ రెడ్డి.. నేడు ముఖ్యమంత్రిగా ఉన్నందున వారికి మెరుగైన ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.

నిపుణుల పరిశీలన, రాతపూర్వక ఆమోదం లేకుండా ముందుకు వెళ్తే మల్లన్న సాగర్ రక్షణ కోసం రైతాంగంతో కలిసి క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని లేఖలో హెచ్చరించారు.

Advertisement
Advertisement