త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanti Kranti Kiran Singur Project | సింగూర్ నుంచి 22 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు: సర్కార్ నిర్లక్ష్యంపై చంటి క్రాంతి కిరణ్ ఫైర్

ఎల్ నినో హెచ్చరికలున్నా సింగూర్ నుంచి 22 టీఎంసీల నీటిని సముద్రం పాలు చేశారంటూ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఫైర్ అయ్యారు. బైక్‌పై పంట పొలాల్లో తిరుగుతూ అన్నదాతలకు భరోసా ఇచ్చారు.

J

Telangana | Published On Oct 29, 2026, 8.53 pm IST

Chanti Kranti Kiran Singur Project | సింగూర్ నుంచి 22 టీఎంసీల నీళ్లు సముద్రం పాలు: సర్కార్ నిర్లక్ష్యంపై చంటి క్రాంతి కిరణ్ ఫైర్
Advertisement
  • ఆందోల్ నియోజకవర్గంలోని టేక్మాల్ మండలంలో ఎండిన వరి, పత్తి పంటలను బైక్‌పై తిరుగుతూ పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్
  • ఎల్ నినో ముప్పుపై హెచ్చరికలు ఉన్నప్పటికీ సింగూర్ ప్రాజెక్ట్ నుంచి 22 టీఎంసీల నీటిని కిందకు వదిలేసి సముద్రం పాలు చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం
  • ఎకరాకు రూ.60 వేల వరకు పెట్టుబడి పెడితే రూ.10 వేలు కూడా రాని పరిస్థితి నెలకొందని, చేతికందని పంటల్లో పశువులను మేపుకుంటున్నారని ఆవేదన
  • టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలను వెంటనే కరవు జాబితాలో చేర్చి ఎకరాకు నష్టపరిహారంతో పాటు బ్యాంక్ రుణాలను రద్దు చేయాలని డిమాండ్

Chanti Kranti Kiran Singur Project | త్రినేత్ర న్యూస్ : ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ముంచుకొస్తున్నాయని వాతావరణ నిపుణులు రెండేళ్లుగా హెచ్చరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. స్థానిక మంత్రి దామోదర రాజనర్సింహ ఉదాసీనత వల్లే నిండుకుండలాంటి సింగూర్ ప్రాజెక్టు నుంచి మరమ్మతుల పేరిట ఏకంగా 22 టీఎంసీల అమూల్యమైన నీటిని కిందకు వదిలి సముద్రం పాలు చేశారని మండిపడ్డారు. గురువారం సంగారెడ్డి జిల్లా టేక్మాల్ మండల పరిధిలోని కుసంగి, దన్నారం, కోరంపల్లి, పాల్వంచ, బర్దీపూర్ గ్రామాల్లో కరెంట్ లేక, నీరందక నిలువునా ఎండిపోయిన వరి, పత్తి చేన్లను ఆయన స్వయంగా పరిశీలించారు.

కార్లలో కాకుండా బైక్‌పై క్షేత్రస్థాయి పరిశీలన

అధికారుల తరహాలో కార్లలో కాకుండా, నేరుగా బైక్‌పై వందలాది ఎకరాల పంట పొలాల్లో తిరుగుతూ క్రాంతి కిరణ్ క్షేత్రస్థాయి వాస్తవాలను పరిశీలించారు. పొలాల వద్దే రైతులతో ముచ్చటిస్తూ వారి కన్నీళ్లను తుడిచారు. "రైతులెవరూ అధైర్యపడొద్దు.. రైతు సంక్షేమాన్ని గాలికొదిలేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచైనా న్యాయమైన నష్టపరిహారాన్ని కొట్లాడి సాధిస్తాం" అని అన్నదాతలకు భరోసా కల్పించారు.

Singur Water Wastage Former MLA Kranti Kiran Slams Telangana Govt

22 టీఎంసీలు వృథా.. చెరువులు నింపి ఉంటే బతికేవి

అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. పాలకుల వైఖరిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు ముందుగానే హెచ్చరించినప్పుడు రిజర్వాయర్ల నీటిని అత్యంత పొదుపుగా కాపాడుకోవాల్సి ఉండగా, సింగూర్ నుంచి నీటిని వృథాగా పోనిచ్చారని ఆరోపించారు. ఆ నీటితో ఆందోల్ నియోజకవర్గంలోని చెక్ డ్యాంలు, చెరువులు, కుంటలను నింపి ఉంటే భూగర్భ జలాలు పెరిగి బోర్లు పోసేవని, పంటలు ఎండిపోయే దుస్థితి వచ్చేది కాదని గుర్తుచేశారు. సొంత నియోజకవర్గాన్ని మంత్రి గాలికొదిలేశారని విమర్శించారు.

ఎకరాకు 60 వేల అప్పు.. చేతికందని దిగుబడి

క్షేత్రస్థాయిలో అన్నదాతల పరిస్థితి హృదయ విదారకంగా మారిందని క్రాంతి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఎకరాకు రూ.60,000 వరకు అప్పులు చేసి పెట్టుబడులు పెడితే, కనీసం రూ.10,000 కూడా చేతికి రాని దుస్థితి దాపురించిందన్నారు. పంటపై ఆశ వదులుకున్న అన్నదాతలు ఎండిపోయిన పైర్లను పశువుల మేత కోసం కోసేస్తున్నారని, కొన్నిచోట్ల పొలాల్లోకి పశువులను వదిలేస్తున్న దృశ్యాలు కలచివేస్తున్నాయని పేర్కొన్నారు.

Singur Water Wastage Former MLA Kranti Kiran Slams Telangana Govt

కరవు జాబితాలో చేర్చాలి.. రుణాలు రద్దు చేయాలి

బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలతో దిగివచ్చిన సర్కార్ ఐదు మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించినప్పటికీ, తీవ్రంగా నష్టపోయిన టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలను విస్మరించడం ముమ్మాటికీ వివక్షేనని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే రాజకీయ పక్షపాతం వీడి ఈ మండలాలను కరవు జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు తగిన పరిహారాన్ని బ్యాంక్ హోల్డ్స్ లేకుండా నేరుగా అందించాలని, పంట పెట్టుబడి రుణాలతో పాటు బ్యాంక్ అప్పులను బేషరతుగా మాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement