త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Zydus Tishtha | త‌క్కువ ధ‌ర‌కే జైడ‌స్ కొత్త‌ ఔష‌ధం.. భారీగా త‌గ్గ‌నున్న క్యాన్స‌ర్ చికిత్స ఖ‌ర్చు..

Zydus Tishtha | దేశీయ‌ ప్రముఖ ఔషధ సంస్థ జైడస్ (Zydus) క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పుకు దారితీసే కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే ఖరీదైన క్యాన్సర్ ఔషధం నివోలుమ్యాబ్ (Nivolumab)కు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా తిష్ఠా (Tishtha) అనే బయోసిమిలర్ మందును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది.

S

Health | Published On Jan 23, 2026, 11.56 am IST

Zydus Tishtha | త‌క్కువ ధ‌ర‌కే జైడ‌స్ కొత్త‌ ఔష‌ధం.. భారీగా త‌గ్గ‌నున్న క్యాన్స‌ర్ చికిత్స ఖ‌ర్చు..
Advertisement

Zydus Tishtha | దేశీయ‌ ప్రముఖ ఔషధ సంస్థ జైడస్ (Zydus) క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పుకు దారితీసే కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగించే ఖరీదైన క్యాన్సర్ ఔషధం నివోలుమ్యాబ్ (Nivolumab)కు తక్కువ ధరలో ప్రత్యామ్నాయంగా తిష్ఠా (Tishtha) అనే బయోసిమిలర్ మందును విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మందు అసలు ధరతో పోలిస్తే దాదాపు నాలుగో వంతు ధరలో అందుబాటులో ఉండడం వల్ల, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న లక్షలాది మంది రోగులకు భారీ ఊరట కలిగే అవకాశం ఉంది. నివోలుమ్యాబ్‌ను అమెరికాకు చెందిన బ్రిస్టల్ మైయర్స్ స్క్విబ్ అనే ఫార్మా దిగ్గజం అభివృద్ధి చేసింది.

బయో సిమిల‌ర్ విడుద‌ల‌కు కోర్టు అనుమ‌తి..

ఊపిరితిత్తులు, పెద్ద పేగు (కోలన్), కాలేయం, తల-మెడ భాగం, మూత్రపిండాలకు సంబంధించిన వివిధ రకాల క్యాన్సర్లకు ఇమ్యూనోథెరపీ రూపంలో ఈ ఔషధాన్ని వినియోగిస్తారు. గత ఏడాది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 ఔషధాల్లో ఒకటిగా కూడా ఇది నిలిచింది. ఈ మందుపై భారత్‌లో పేటెంట్ 2026 మే వరకు చెల్లుబాటు అవుతున్నప్పటికీ, ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జైడస్‌కు బయోసిమిలర్ విడుదలకు అనుమతి ఇచ్చింది. తిష్ఠా ఔష‌ధం చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ అనే ఇమ్యూనోథెరపీ వర్గానికి చెందుతుంది. ఈ రకమైన మందులు క్యాన్సర్ కణాలను గుర్తించకుండా నిరోధించే ప్రోటీన్లను అడ్డుకోవడం ద్వారా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ క్యాన్సర్ కణాలపై దాడి చేయడానికి సహాయపడతాయి. దీనిని మోనోక్లోనల్ యాంటీబాడీ లేదా టార్గెటెడ్ థెరపీగా కూడా పరిగణిస్తారు. క్లీవ్‌లాండ్ క్లినిక్ వివరాల ప్రకారం, సాధారణ కణాలు అవసరమైనప్పుడు పెరిగి, అవసరం లేనప్పుడు నశిస్తాయి. కానీ క్యాన్సర్ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి ట్యూమర్లుగా మారతాయి. తిష్ఠా వంటి మందులు ఈ కణాల పెరుగుదలను అడ్డుకొని వాటిని నాశనం చేస్తాయి.

ధ‌ర ఎంతంటే..?

జైడస్ తెలిపిన వివరాల ప్రకారం, తిష్ఠా 100 మిల్లీగ్రాముల డోస్ రూ.28,950కి, 40 మిల్లీగ్రాముల డోస్ రూ.13,950కి అందుబాటులో ఉండ‌నున్నాయి. ఇది అసలు నివోలుమ్యాబ్ ధరతో పోలిస్తే సుమారు నాలుగో వంతు మాత్రమే. అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే జైడస్ సంస్థ, ఈ మందు విడుదలతో క్యాన్సర్ చికిత్స ఖర్చు గణనీయంగా తగ్గి, రోగులపై పడే ఆర్థిక భారం తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ మందు పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేయబడటం, తయారు చేయబడటం విశేషం. దీర్ఘకాలిక క్యాన్సర్ చికిత్స అవసరమైన రోగులకు ఇది నమ్మకమైన పరిష్కారంగా నిలుస్తుందని సంస్థ పేర్కొంది. భారత్‌లో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఏటా 15 ల‌క్ష‌ల కొత్త కేసులు..

ఐసీఎంఆర్ - నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మాటిక్స్ అండ్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం, దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 15 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా స్తన, ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు ఎక్కువగా వ‌స్తున్నాయి. క్యాన్సర్ మందులు ఈ ప్రాణాంతక వ్యాధి పట్ల మన దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు మృతితో సమానంగా భావించిన అనేక రకాల క్యాన్సర్లు ఇప్పుడు నియంత్రణలోకి వస్తున్నాయి. సరైన ఔషధాల వల్ల చాలా మంది రోగులు ఎక్కువ కాలం, మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించగలుగుతున్నారు. ఈ మందులు శరీరంలో క్యాన్సర్‌ను పూర్తిగా తొలగించడం, అది ఇతర అవయవాలకు వ్యాపించకుండా అడ్డుకోవడం, అలాగే నొప్పి వంటి లక్షణాలను తగ్గించి రోగులు సాధారణ జీవితానికి దగ్గరగా జీవించడానికి సహాయపడుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement