త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hay Fever | హే ఫీవర్‌కి బైబై..!

సీజన్ మారిన ప్రతి సమయంలో చాలా మందిలో అలర్జీలు కనిపించడం సాధారణమే. ముఖ్యంగా వేసవి ప్రారంభం, వర్షాకాలం, శీతాకాల మార్పుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ అలర్జీలను పూర్తిగా అదుపులో పెట్టేలా మన శరీరానికి శిక్షణ ఇవ్వొచ్చా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు శతాబ్దం కింద ఉపయోగించిన చికిత్సనే ఆధునిక పద్ధతుల్లో తీసుకొచ్చిన కొత్త తరహా ఇమ్యూనోథెరపీతో సాధ్యమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

P

Lifestyle | Published On Mar 25, 2026, 10.15 am IST

Hay Fever | హే ఫీవర్‌కి బైబై..!
Advertisement
  • సీజనల్ అలర్జీలకు సమర్థవంతమైన చికిత్స
  • అలర్జీలను అదుపులో పెట్టేలా శరీరానికి శిక్షణ
  • శతాబ్దం నాటి పద్ధతుల్లోని కొత్త ఇమ్యూనోథెరిఫీతో సాధ్యం!
  • ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మంది బాధితులు
  • ప్రారంభంలోనే గుర్తిస్తే చికిత్స మరింత సులభం
  • అవగాహన, సరైన చికిత్స అవసరమన్న వైద్య నిపుణులు..

సీజన్ మారిన ప్రతి సమయంలో చాలా మందిలో అలర్జీలు కనిపించడం సాధారణమే. ముఖ్యంగా వేసవి ప్రారంభం, వర్షాకాలం, శీతాకాల మార్పుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అయితే, ఈ అలర్జీలను పూర్తిగా అదుపులో పెట్టేలా మన శరీరానికి శిక్షణ ఇవ్వొచ్చా? అన్న ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దాదాపు శతాబ్దం కింద ఉపయోగించిన చికిత్సనే ఆధునిక పద్ధతుల్లో తీసుకొచ్చిన కొత్త తరహా ఇమ్యూనోథెరపీతో సాధ్యమేనని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

Hay Fever | లండన్‌కి చెందిన అలర్జీ వ్యాధుల నిపుణురాలు గ్లెనిస్ స్కాడింగ్ తన కెరీర్ ప్రారంభంలో ఓ రోగి చికిత్స అందించారు. అతనికి హే ఫీవర్ అంత తీవ్రంగా ఉండేది. ఇంటి దగ్గర్లోని రైల్వే స్టేషన్ వరకు నడవాలన్నా ఊపిరాడేది కాదు. ఆ రోగికి బిర్చ్ పొలెన్పై ఉన్న అలర్జీని తగ్గించేందుకు ఆమె నాలుక కింద ఔషధపు చుక్కలు వేసే ‘సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ’ చికిత్స అందించింది. ఈ విధానంతో అతని జీవితం పూర్తిగా మారిపోయిందని సదరు వైద్యురాలు తెలిపింది. కృతజ్ఞతగా ఒకసారి తన ఇంటికే వైన్ కేసుతో వచ్చాడని ఆమె గుర్తు చేసుకుంది. అయితే, ఆ సమయంలో ఈ విధానంపై అనుమానాలు, విమర్శలు ఎక్కువగా రావడంతో కొంతకాలం ఆమె ఈ చికిత్సను నిలిపివేయాల్సి వచ్చిందని కూడా ఆమె చెప్పుకొచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందిపైగా..

ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల మందికి పైగా ‘అలర్జిక్ రైనిటిస్’ సమస్యతో బాధపడుతున్నారు. గాలిలో ఉన్న అలర్జీ కారకాలతో ముక్కులో వచ్చే ఇన్ఫ్లమేషన్ దీనికి కారణం. జంతువుల వెంట్రుకలు, దుమ్ము, డస్ట్ మైట్స్, పొలెన్ వంటి పదార్థాలు ప్రవేశించినప్పుడు వాటి నుంచి కాపాడేందుకు శరీరం ప్రతిచర్య జరుపుతుంది. దీంతో ముక్కు కారడం, కళ్లలో మంట, తుమ్ములు, కొన్ని సందర్భాల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. పొలెన్ వల్ల వచ్చే ఈ సీజనల్ సమస్యను సాధారణంగా ‘హే ఫీవర్’గా పిలుస్తుంటారు.

ఆరోగ్యంపై ప్రభావం..

ఈ సమస్య జీవన ప్రమాణాన్ని మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆస్థమా వచ్చే ప్రమాదం పెరుగుతుంది. యూకేలో ప్రతి నాలుగు మందిలో ఒకరికి, పిల్లల్లో ఎనిమిదిలో ఒకరికి ఈ సమస్య ఉంది. ప్రతి సంవత్సరం కనీసం 1.6 కోట్ల సార్లు వైద్యులను సంప్రదిస్తున్నట్లు అంచనా. ఆస్ట్రేలియా, అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉంది. వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాలతో ఈ సమస్య మరింత తీవ్రంగా మారుతోందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

అలర్జీ నిపుణులు మాట ఇదే..

అయితే, అలర్జీ నిపుణులు చెబుతున్నది ఏంటంటే.. ప్రస్తుతం హే ఫీవర్‌కి సమర్థవంతమైన, సురక్షితమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ లక్షణాలను తగ్గించడానికే ఉపయోగపడతాయి. కానీ ‘అలర్జెన్ ఇమ్యూనోథెరపీ (AIT)’ అనే ప్రత్యేక విధానం మాత్రం శరీరాన్ని అలర్జీ కారకాలపై తక్కువగా స్పందించేలా ‘శిక్షణ’ ఇస్తుంది. దాంతో హే ఫీవర్ నుంచి ఆస్థమాకు వెళ్లే ప్రమాదాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ చికిత్స తీసుకునేవారి సంఖ్య చాలా తక్కుగా ఉంటోంది. సరైన నిపుణులను కలిసే అవకాశం చాలా మందికి దొరకడం లేదు. ముఖ్యంగా వ్యాధి ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే సులభంగా నియంత్రించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

తేలిగ్గా తీసుకుంటున్న జనం..

హే ఫీవ‌ర్‌ని చాలామంది తేలికగా తీసుకుంటారు. కానీ, దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నిద్రలేమి, అలసట, రాత్రి తరచూ మేల్కొనడం వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తాయి. పిల్లల్లో చదువుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలర్జీ ఉన్నవారికి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు రెండింతలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. సరైన చికిత్స లేకపోతే దీర్ఘకాలిక శ్వాసనాళ వ్యాధులు, చెవి ఇన్ఫెక్షన్లు రావొచ్చని పేర్కొంటున్నాయి. పిల్లల్లో హే ఫీవర్ వల్ల ఆస్థమా అభివృద్ధి చెందే ప్రమాదం ఉంది. పై శ్వాసనాళాల్లో ఉండే ఇన్ఫ్లమేషన్ దిగువ శ్వాసనాళాలకు కూడా వ్యాపించి ఆస్థమాకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని ‘వన్ ఎయిర్ వే.. వన్ డిసీజ్’గా పేర్కొంటున్నారు.

తొలిసారిగా 1828లో హే ఫీవర్ రికార్డు..

హే ఫీవర్ కొత్త సమస్య ఏమీ కాదు. 1828లోనే లండన్ వైద్యుడు జాన్ బోస్టాక్ ఈ లక్షణాలను నమోదు చేశారు. 1911లో పొలెన్ ఎక్స్‌ట్రాక్ట్ ఇంజెక్షన్ రూపంలో చికిత్స ప్రారంభమైంది. 1950ల్లో దీనిపై డబుల్ బ్లైండ్ ట్రయల్స్ నిర్వహించారు. 1980ల నాటికి ‘అలర్జీ షాట్స్’ ఒక ప్రామాణిక చికిత్సగా మారాయి. ఇవి చాలా మందికి ఉపశమనం ఇచ్చినా.. అరుదుగా తీవ్రమైన అలర్జిక్ ప్రతిచర్యలు (అనాఫైలాక్సిస్) రావడం మొదలైంది. ఈ ప్రమాదం చాలా అరుదుగా ఉన్నప్పటికీ, భద్రతా నిబంధనలు కఠినతరం చేయడంతో చికిత్స కష్టసాధ్యంగా మారింది. దీంతో నాలుక కింద ఔషధం వేసే సబ్లింగ్యువల్ థెరపీపై ఆసక్తి పెరిగింది. ప్రారంభంలో దీనిపై అనుమానాలు ఉన్నప్పటికీ, పరిశోధనలు ఇది కూడా ప్రభావవంతమని, ముఖ్యంగా ఇంజెక్షన్లతో పోలిస్తే ప్రమాదం తక్కువగా ఉంటుందని తేలింది. తీవ్రమైన దుష్ప్రభావాలు అరుదు. కొంతమందిలో నాలుక దగ్గర తాత్కాలికంగా గరగరలు, వాపు వంటి సమస్యలు కనిపించే అవకాశాలుంటాయి.

ఈ చికిత్స ఎప్పుడు ప్రారంభించాలి..

ప్రపంచ ఆరోగ్య సంస్థ 1998లో ఈ విధానాన్ని ప్రత్యామ్నాయ చికిత్సగా గుర్తించింది. ఈ థెరపీని సీజన్ ప్రారంభానికి 8 నుంచి 16 వారాల ముందే ప్రారంభించాలి. మూడు సంవత్సరాల పాటు కొనసాగిస్తే దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. ప‌లు అధ్యయనాల ప్రకారం.. చికిత్స ఆపిన తర్వాత కూడా రెండేళ్ల వరకు ప్రయోజనం ఉంటుంది. ఈ చికిత్స అన్ని రకాల అలర్జీలకు అందుబాటులో లేదు. ముఖ్యంగా చెట్ల పుప్పొడితో వ‌చ్చే అలర్జీల‌కు ప‌రిమిత‌మే. అందుకే చాలా సందర్భాల్లో ఇంజెక్షన్ థెరపీనే వైద్యులు సూచిస్తున్నారు. ఇమ్యూనోథెరపీతో పాటు ‘బయోలాజిక్స్’ అనే మరో తరహా మందులు ఉన్నాయి. ఇవి అలర్జీకి కారణమయ్యే ఇమ్యూన్ మార్గాలను అడ్డుకుని ఇన్ఫ్లమేషన్స్‌ని తగ్గిస్తాయి. కొన్ని సందర్భాల్లో ఈ రెండింటిని కలిపి ఉపయోగిస్తే లక్షణాలు గణనీయంగా తగ్గుతాయి. అయితే వీటి ధర చాలా ఎక్కువగా ఉంటోంది.

అలర్జీల బారినపడకుండా..

అందుబాటులో ఉన్న సాధారణ చికిత్సల్లో యాంటీహిస్టమిన్, కార్టికోస్టెరాయిడ్ కలిగిన నాసల్ స్ప్రేలు ప్రభావవంతంగా ఉంటున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. సీజన్‌కి ముందే వాడటం, లక్షణాలు లేకపోయినా రెగ్యుల‌ర్‌గా ఉపయోగించడం ముఖ్యమన్నారు. మాత్రల రూపంలో తీసుకునే యాంటీహిస్టమిన్లు తక్కువ ప్రభావం చూపవచ్చని, కొత్త తరహా మందులు సెటిరిజైన్, లోరాటడైన్ వంటి వాటిని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. అయితే, అలర్జీలను రాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచిస్తున్నారు. కిటికీలు మూసివేయడం, ఎయిర్ ప్యూరిఫైయర్ వినియోగించడం, బయటికి వెళ్లేటప్పుడు మాస్క్, కళ్లజోడు ధరించడం, ఇంటికి వచ్చిన వెంటనే చేతులు, ముఖం కడుక్కోవడం, ముఖ్యంగా నిద్రకు ముందు స్నానం చేయడం వంటి జాగ్రత్తలు అవ‌స‌ర‌మ‌ని నిపుణులు పేర్కొంటున్నారు. హే ఫీవర్‌ణి చిన్న సమస్యగా తీసుకోవద్దని, అవగాహనతో సరైన సమయంలో చికిత్స తీసుకుంటే దీన్ని సమర్థంగా నియంత్రించవచ్చు నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement