త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Cylinder Life | గంట వంట చేస్తే ఎంత గ్యాస్ ఖాళీ అవుతుంది? 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందంటే..?

గ్యాస్ ధరలు పెరుగుతున్న వేళ, ప్రతి ఇంట్లో సిలిండర్‌ను పొదుపుగా వాడటం అవసరం. అసలు ఒక గంట పాటు స్టవ్ ఆన్ చేస్తే ఎంత గ్యాస్ ఖర్చవుతుంది? 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది? గ్యాస్ ఆదా చేయడానికి పాటించాల్సిన బెస్ట్ టిప్స్ ఏంటో తెలుసుకుందాం రండి.

J

Lifestyle | Published On May 2, 2026, 3.36 pm IST

LPG Cylinder Life | గంట వంట చేస్తే ఎంత గ్యాస్ ఖాళీ అవుతుంది? 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందంటే..?
Advertisement

LPG Cylinder Life | త్రినేత్ర.న్యూస్ : ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు సహజమయ్యాయి. గ్యాస్ సిలిండర్ల ధరలు సామాన్యులకు భారంగానే మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఇంట్లో వంట గ్యాస్‌ (LPG)ను పొదుపుగా వాడుకోవడం ఎంతో అవసరం. అయితే, అసలు ఒక గంట పాటు స్టవ్ వెలిగిస్తే ఎంత గ్యాస్ ఖర్చవుతుంది? 14.2 కిలోల సిలిండర్ ఎన్ని రోజులు వస్తుంది? గ్యాస్ ఆదా చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

గంటకు ఎంత గ్యాస్ ఖర్చవుతుంది?

మనం ఇంట్లో వాడే గ్యాస్ స్టవ్ బర్నర్ల పరిమాణం, మనం పెట్టే మంట తీవ్రతను బట్టి గ్యాస్ వినియోగం ఆధారపడి ఉంటుంది.

చిన్న బర్నర్ (Small Burner): దీనిపై వంట చేస్తే గంటకు సుమారు 140 నుంచి 150 గ్రాముల గ్యాస్ ఖర్చవుతుంది.

పెద్ద బర్నర్ (Big Burner): దీనిపై వంట చేస్తే గంటకు సుమారు 180 నుంచి 210 గ్రాముల వరకు గ్యాస్ ఖర్చవుతుంది.

రెండు బర్నర్లు ఒకేసారి వాడితే: రెండు బర్నర్లను ఏకకాలంలో వాడితే గంటకు సగటున 300 గ్రాముల (0.30 కిలోలు) గ్యాస్ ఖర్చవుతుంది.

ఈ లెక్క ప్రకారం చూసుకుంటే, ఇంట్లో వాడే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్‌ను నిరంతరాయంగా ఆన్ చేసి ఉంచితే సుమారు 45 నుంచి 48 గంటల పాటు మండుతుంది.

సిలిండర్ సాధారణంగా ఎన్ని రోజులు వస్తుంది?

మనం ఇళ్లలో రోజుకు సగటున 2 నుంచి 3 గంటలు మాత్రమే స్టవ్ వాడుతుంటాం. ఈ లెక్కన కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి సిలిండర్ ఎన్ని రోజులు వస్తుందంటే.

చిన్న కుటుంబం (2-3 మంది): 30 నుంచి 45 రోజులు

మధ్యస్థ కుటుంబం (4-5 మంది): 25 నుంచి 35 రోజులు

పెద్ద కుటుంబం (6 గురు అంతకంటే ఎక్కువ): 20 నుంచి 30 రోజులు

(వంటకాల రకం, బర్నర్ వినియోగాన్ని బట్టి మార్పులు ఉండవచ్చు).

గ్యాస్‌ను ఎలా ఆదా చేయాలి? బెస్ట్ టిప్స్ ఇవే..

కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల సిలిండర్ ఎక్కువ రోజులు వచ్చేలా చేయవచ్చు.

మూత పెట్టి వండండి: వంట చేసేటప్పుడు పాత్రపై మూత పెట్టడం అలవాటు చేసుకోండి. దీనివల్ల ఆవిరి బయటకు పోకుండా ఉండి, వేడికి ఆహారం త్వరగా ఉడుకుతుంది. ఇది గ్యాస్ ఆదా చేస్తుంది.

నానబెట్టడం మర్చిపోవద్దు: పప్పులు, బియ్యం, శనగలు వంటి వాటిని వండటానికి కనీసం గంట ముందే నానబెట్టడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. దీంతో వంట సమయం సగానికి పైగా తగ్గుతుంది.

సరైన బర్నర్ ఎంపిక: చిన్న పాత్రలకు చిన్న బర్నర్ నే వాడండి. చిన్న పాత్రలను పెద్ద బర్నర్‌పై పెట్టడం వల్ల మంట సైడ్స్ నుంచి బయటకు వచ్చి గ్యాస్ వృథా అవుతుంది.

మంటను అదుపులో ఉంచండి: నీళ్లు మరగడం లేదా కూర ఉడకడం మొదలయ్యాక మంటను తగ్గించి సిమ్ లేదా మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. హై ఫ్లేమ్ లో ఉంచినా ఉష్ణోగ్రత ఒకేలా ఉంటుంది కానీ, గ్యాస్ మాత్రమే వృథా అవుతుంది.

ప్రెషర్ కుక్కర్ వాడండి: సాధారణ పాత్రల కంటే ప్రెషర్ కుక్కర్‌లో వండటం వల్ల 30-50% వంట సమయం ఆదా అవుతుంది. తద్వారా గ్యాస్ కూడా మిగులుతుంది.

ఈ చిన్న విషయాలు కూడా గమనించండి

ఫ్రిజ్‌లో ఉన్న కూరగాయలు, పాలు వంటివి వంట చేయడానికి కాసేపు ముందే బయటపెట్టండి. చల్లగా ఉన్నవాటిని నేరుగా స్టవ్‌పై పెడితే సాధారణ ఉష్ణోగ్రతకు రావడానికే ఎక్కువ గ్యాస్ పడుతుంది.

స్టవ్ బర్నర్లను తరచుగా శుభ్రం చేయాలి. బర్నర్ల నుంచి మంట నీలం రంగులో వస్తేనే గ్యాస్ సరిగ్గా మండుతున్నట్లు. పసుపు రంగు మంట వస్తుంటే బర్నర్లలో బ్లాక్స్ ఉండి గ్యాస్ వృథా అవుతున్నట్లే. వెంటనే వాటిని శుభ్రం చేయాలి.

Advertisement
Advertisement