త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Crisis | యుద్ధం ఎఫెక్ట్‌.. ఎల్‌పీజీ కొర‌త‌తో 50 శాతం మేర పెరిగిన స్ట్రీట్ ఫుడ్స్ ధ‌ర‌లు..

LPG Crisis | ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో దేశంలో ప్ర‌జ‌లు వంట గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌ను చాలా మంది య‌జ‌మానులు మూసేస్తుండ‌గా, కొంద‌రు క‌ట్టెల పొయ్యి, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల‌తో వంట‌ల‌ను వండుతున్నారు.

S

Business | Published On Mar 17, 2026, 12.50 pm IST

LPG Crisis | యుద్ధం ఎఫెక్ట్‌.. ఎల్‌పీజీ కొర‌త‌తో 50 శాతం మేర పెరిగిన స్ట్రీట్ ఫుడ్స్ ధ‌ర‌లు..
Advertisement

LPG Crisis | ప‌శ్చిమాసియాలో నెల‌కొన్న యుద్ధం కార‌ణంగా చ‌మురు, గ్యాస్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌డంతో దేశంలో ప్ర‌జ‌లు వంట గ్యాస్ కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌ను చాలా మంది య‌జ‌మానులు మూసేస్తుండ‌గా, కొంద‌రు క‌ట్టెల పొయ్యి, ఇత‌ర ప్ర‌త్యామ్నాయ మార్గాల‌తో వంట‌ల‌ను వండుతున్నారు. ఇక చిన్న హోట‌ల్స్‌, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు గ్యాస్ సిలిండ‌ర్ల కొర‌త కార‌ణంగా తీవ్ర అవ‌స్థ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. వ్యాపారం నిర్వ‌హించ‌లేక న‌ష్టాల్లో కొన‌సాగుతున్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున జరిగే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారానికి ఇప్పుడు పెద్ద క‌ష్టం వ‌చ్చి ప‌డింద‌ని లోక‌ల్ స‌ర్కిల్స్ నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డైంది. ముఖ్యంగా గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో దేశ‌వ్యాప్తంగా అనేక చోట్ల స్ట్రీట్ ఫుడ్స్ ధ‌ర‌లు 50 శాతం మేర పెరిగాయ‌ని వినియోగ‌దారులు చెబుతున్నారు.

ఆహారాల ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరుగుద‌ల‌..

స్ట్రీట్ ఫుడ్స్ ధ‌ర‌లు పెరిగేందుకు ప్ర‌ధాన కార‌ణం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ‌ర్ల కొర‌త ఉండ‌డమేన‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. దేశంలో అత్య‌ధిక శాతం మంది స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు వాణిజ్య ఎల్‌పీజీ సిలిండ‌ర్ల కొర‌త‌, స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు. 309 జిల్లాల్లో మొత్తం 38వేల మందికి పైగా వినియోగ‌దారుల‌ను స‌ర్వే చేయ‌గా, 57 శాతం మంది రెస్టారెంట్‌ల‌లో ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగిన‌ట్లు తెలిపారు. కొంద‌రు వినియోగ‌దారులు ధ‌ర‌లు 25 శాతం క‌న్నా ఎక్కువ పెరిగిన‌ట్లు వెల్ల‌డించారు. స్ట్రీట్ ఫుడ్స్ ధ‌రలు కూడా 25 శాతం కన్నా ఎక్కువ‌గానే పెరిగాయ‌ని స‌ర్వేలో పాల్గొన్న 54 శాతం మంది తెలిపారు.

బిల్లుకు రూ.15 లేదా అంత‌క‌న్నా ఎక్కువ చెల్లించాల్సిందే..

గ్యాస్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డ‌డం, సిలిండ‌ర్ల కొర‌త ఉండ‌డంతో రెస్టారెంట్లు, హోట‌ళ్ల‌తోపాటు స్ట్రీట్ ఫుడ్స్ ధ‌ర‌లు కూడా అధికంగా పెరుగుతున్నాయ‌ని వినియోగ‌దారులు వెల్ల‌డించారు. గ‌త వారంలోనే ఈ ధ‌ర‌లు అధిక శాతం పెరిగాయ‌ని తెలిపారు. అనేక చోట్ల రెస్టారెంట్ల బిల్లుల్లో స్ప‌ష్టంగా ఎల్‌పీజీ స‌ర్ చార్జ్ కూడా విధిస్తున్నారు. దీంతో ఒక బిల్లుపై రూ.15 లేదా అంత‌క‌న్నా ఎక్కువ చెల్లించాల్సి వ‌స్తుంద‌ని వినియోగదారులు వాపోతున్నారు. చిరు వ్యాపారులు ఈ న‌ష్టాల‌ను త‌ట్టుకోవ‌డానికి ఆహారాల ధ‌ర‌ల‌ను పెంచుతున్నారు. ఇక వారు బ్లాక్ మార్కెట్‌లో కేజీ ఎల్‌పీజీని రూ.400 వ‌ర‌కు చెల్లించి కొనుగోలు చేస్తున్న‌ట్లు తెలిసింది. అందుకనే వారు ఆహార ప‌దార్థాల ధ‌ర‌ల‌ను పెంచుతున్న‌ట్లు స‌మాచారం.

పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌పై అధిక భారం..

గ్యాస్ స‌ర‌ఫ‌రాకు అంతరాయం, ఎల్‌పీజీ సిలిండ‌ర్ల కొర‌త కార‌ణంగా ఓ వైపు వ్యాపారుల‌తోపాటు మ‌రోవైపు వినియోగ‌దారుల‌పై కూడా ప్ర‌భావం ప‌డుతోంది. ఎల్‌పీజీ రీఫిల్‌పై ఆధార‌ప‌డే చిన్న వ్యాపారులు ప‌ని గంట‌ల‌ను త‌గ్గించ‌డం, మెనూల‌ను కుదించ‌డం లేదా తాత్కాలికంగా త‌మ ఫుడ్ సెంట‌ర్‌ను మూసేయ‌డం వంటివి చేస్తున్నారు. మెట్రో న‌గ‌రాల్లో ఈ ప‌రిస్థితి మ‌రింత అధికంగా ఉంది. రెస్టారెంట్‌ల‌లోనూ త‌మ కార్య‌క‌లాపాల‌ను త‌గ్గిస్తున్నారు. ఇంధ‌నాన్ని పొదుపు చేసే చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. ఆహార మెనూ వంట‌కాల‌ను కూడా త‌గ్గించారు. హోట‌ల్స్‌, స్ట్రీట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో ఆహారాల ధ‌ర‌లు పెర‌గ‌డంతో పేద‌, సాధార‌ణ వ‌ర్గాల‌కు చెందిన వినియోగ‌దారుల‌పై అధిక భారం ప‌డుతోంది. ముఖ్యంగా రోజువారి కూలీలు, విద్యార్థులు, ఉద్యోగులు గతంలో రూ.30 చెల్లించిన దానికి బ‌దులుగా ఇప్పుడు ఒక బ్రేక్ ఫాస్ట్‌కు దాదాపుగా రూ.50 లేదా అంత‌క‌న్నా ఎక్కువ‌గానే చెల్లిస్తున్నారు. దీంతో ఇప్ప‌టికే ఒత్తిడిలో ఉన్న వారి ఖ‌ర్చులు మ‌రింత పెరుగుతున్నాయి. అయితే త్వ‌ర‌గా యుద్ధం ముగిస్తే ఓకే, లేదంటే ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా మారుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement