త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Coffee | టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం.. కాఫీ.. సైంటిస్టుల తాజా అధ్య‌య‌నం..

Coffee | కాఫీపై జరిగిన తాజా శాస్త్రీయ పరిశోధన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడే కొత్త సహజ సమ్మేళనాలు కాఫీలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని ల్యాబ్ పరీక్షల్లో ఇవి సాధారణంగా ఉపయోగించే డయాబెటిస్ మందుల‌కన్నా మెరుగ్గా పనిచేసిన‌ట్లు నిర్దారించారు.

S

Lifestyle | Published On Feb 11, 2026, 8.18 am IST

Coffee | టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారికి వ‌రం.. కాఫీ.. సైంటిస్టుల తాజా అధ్య‌య‌నం..
Advertisement

Coffee | కాఫీపై జరిగిన తాజా శాస్త్రీయ పరిశోధన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రించడంలో సహాయపడే కొత్త సహజ సమ్మేళనాలు కాఫీలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. కొన్ని ల్యాబ్ పరీక్షల్లో ఇవి సాధారణంగా ఉపయోగించే డయాబెటిస్ మందుల‌కన్నా మెరుగ్గా పనిచేసిన‌ట్లు నిర్దారించారు. ఈ సమ్మేళనాలు ఆల్ఫా-గ్లూకోసిడేజ్ అనే ఎంజైమ్‌ను నిరోధించడం ద్వారా పనిచేస్తాయి. ఈ ఎంజైమ్ మనం తినే కార్బోహైడ్రేట్లను చక్కెరలుగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది నెమ్మదిస్తే, చక్కెర రక్తంలోకి నెమ్మదిగా చేరుతుంది. దాంతో ఒక్కసారిగా షుగర్ పెరిగే ప్రమాదం తగ్గుతుంది. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

3 కొత్త స‌మ్మేళ‌నాల గుర్తింపు..

ఈ పరిశోధనను బెవ‌రేజ్ ప్లాంట్ రీసెర్చ్ అనే జర్నల్‌లో ప్రచురించారు. చైనాలోని కున్మింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బోటనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేప‌ట్టారు. వారు రోస్ట్ చేసిన అరబికా కాఫీ గింజలను తీసుకుని, దశలవారీగా వాటిలోని వేర్వేరు రసాయన సమ్మేళనాలను వేరు చేసి పరీక్షించారు. ఈ ప్రక్రియలో పూర్తిగా మూడు కొత్త సమ్మేళనాల‌ను గుర్తించారు. వీటికి కాఫాల్డీహైడ్స్ A, B, C అని పేర్లు పెట్టారు. వీటి రసాయన నిర్మాణం కొద్దిగా భిన్నంగా ఉన్నప్పటికీ, మూడు కూడా ఆల్ఫా-గ్లూకోసిడేజ్‌ను బలంగా నిరోధించాయి. ముఖ్యంగా, కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదించేందుకు ఉపయోగించే అకార్బోస్ అనే మెడిసిన్ కన్నా ఆ స‌మ్మేళ‌నాలు ల్యాబ్ పరీక్షల్లో ప్రభావవంతంగా పనిచేసిన‌ట్లు గుర్తించారు. ఇంకా అధునాతన పద్ధతులు ఉపయోగించి, చాలా తక్కువ పరిమాణాల్లో ఉన్న మరో మూడు అరుదైన సమ్మేళనాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని కూడా ఇప్పటివరకు ఎక్కడా గుర్తించ‌లేదు.

బ్లాక్ కాఫీ మేలు..

ఈ ఫలితాల వ‌ల్ల కాఫీ అంటే కేవ‌లం ఒక పానీయం మాత్ర‌మే కాద‌ని, అది రక్తంలో చక్కెర స్థాయిల‌ నియంత్రణకు సహాయపడే ఫంక్షనల్ ఫుడ్ గా మారుతుంద‌ని సైంటిస్టులు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే స‌ద‌రు సమ్మేళనాలు మన శరీరంలో ఎలా పనిచేస్తాయి, దీర్ఘకాలికంగా సురక్షిత‌మేనా అనే విషయాలపై ప్ర‌స్తుతం సైంటిస్టులు మరిన్ని పరిశోధనలు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. కానీ కాఫీని తాగ‌డం వ‌ల్ల మ‌ధుమేహం ఉన్న‌వారికి మేలే జ‌రుగుతుంద‌ని, అయితే బ్లాక్ కాఫీ తాగాల్సి ఉంటుంద‌ని, అందులో చ‌క్కెర క‌ల‌ప‌కుండా తాగాల‌ని వారు సూచించారు. డైట్ ప్లాన్ లేదా ఆరోగ్య స‌ల‌హా కోసం మ‌ధుమేహ వ్యాధి గ్ర‌స్తులు డైటిషియ‌న్ లేదా డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాల‌ని అన్నారు.

Advertisement
Advertisement