త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకెడా ఫార్మాసూటికల్ రూపొందించిన క్వెండెంగా డెంగ్యూ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రచారం చేసి, పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో కీలక ఒప్పందం చేసుకుంది.

S

Lifestyle | Published On Sep 18, 2026, 5.08 pm IST

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్.. వచ్చే ఏడాదే అందుబాటులోకి..
Advertisement

Dengue Vaccine | భారత్‌లో తొలి డెంగ్యూ వ్యాక్సిన్ వచ్చే ఏడాది తొలి అర్ధభాగంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ టకెడా ఫార్మాసూటికల్ రూపొందించిన క్వెండెంగా డెంగ్యూ వ్యాక్సిన్‌ను భారత్‌లో ప్రచారం చేసి, పంపిణీ చేసేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. భారత్‌లో డెంగ్యూ వ్యాక్సిన్‌కు సంబంధించిన ఈ ఒప్పందం వైద్యరంగంలో ప్రాధాన్యత సంతరించుకుంది. టకెడా రూపొందించిన క్వెండెంగా వ్యాక్సిన్‌కు భారత్ ఔషధ నియంత్రణ సంస్థ జూలైలో అనుమతి ఇచ్చింది. రాయిటర్స్ నివేదిక ప్రకారం ఈ వ్యాక్సిన్ 2027లో తొలి అర్ధభాగంలో భారత మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 100 కోట్ల డోసుల తయారీ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యానికి అనుగుణంగా తమ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని టకెడా జూలైలో వెల్లడించింది.

ప‌రీక్ష‌ల్లో స‌క్సెస్‌..

క్వెండెంగాను నాలుగు రకాల డెంగ్యూ వైరస్ సెరోటైపుల నుంచి రక్షణ కల్పించేలా రూపొందించారు. నాలుగు నుంచి 60 ఏళ్ల వయసు ఉన్న పిల్లలు, పెద్దల్లో డెంగ్యూ నివారణ కోసం దీనిని ఉపయోగించవచ్చు. ఈ ఏడాది నిర్వహించిన చివరి దశ క్లినికల్ పరీక్షల్లో, రెండో డోస్ తీసుకున్న ఏడాది తర్వాత నిర్ధారిత డెంగ్యూ కేసులపై వ్యాక్సిన్ 80.2 శాతం సమర్థత చూపించింది. అలాగే రెండో డోస్ తర్వాత 18 నెలల కాలంలో డెంగ్యూ కారణంగా ఆసుపత్రిలో చేరడాన్ని 90.4 శాతం మేర నివారించినట్లు పరీక్షల్లో వెల్లడైంది. దీంతో అధ్యయనంలో నిర్దేశించిన ద్వితీయ లక్ష్యాన్ని కూడా వ్యాక్సిన్ సాధించింది. క్వెండెంగా రెండు డోసులుగా ఇస్తారు. ఒక్కో డోస్ 0.5 మిల్లీలీటర్ల ఇంజెక్షన్‌గా ఉంటుంది. మొదటి డోస్ తర్వాత మూడు నెలలకు రెండో డోస్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో డెంగ్యూ సోకిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా ఈ వ్యాక్సిన్‌ను ఉపయోగించవచ్చని టకెడా తెలిపింది. అందువల్ల వ్యాక్సిన్ తీసుకునే ముందు ప్రత్యేక పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉండదు.

భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..

ఉష్ణమండల, ఉపఉష్ణమండల ప్రాంతాల్లో డెంగ్యూ ప్రధాన ప్రజారోగ్య సమస్యగా కొనసాగుతోంది. భారత్‌లో కూడా ప్రతి ఏడాది వర్షాకాలంలో డెంగ్యూ వ్యాప్తి పెరుగుతోంది. దీనివల్ల ఆసుపత్రులపై అదనపు భారం పడుతోంది. దోమల నియంత్రణ చర్యలు, ఇతర ప్రజారోగ్య కార్యక్రమాలతోపాటు వ్యాక్సిన్ కూడా డెంగ్యూ నివారణకు అదనపు సాధనంగా ఉపయోగపడే అవకాశం ఉంది. జాతీయ వెక్టర్ బోర్న్ డిసీజెస్ కంట్రోల్ సెంటర్ తాత్కాలిక గణాంకాల ప్రకారం 2025లో భారత్‌లో 1,13,450 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. డెంగ్యూ కారణంగా 95 మంది మరణించారు. సాధారణంగా వర్షాకాలంలో, ఆ తర్వాత డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదవుతాయి. వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల ఏడిస్ దోమలు పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడడ‌మే ఇందుకు ప్రధాన కారణం.

వ‌చ్చే ఏడాది అందుబాటులోకి..

గత రెండు దశాబ్దాల్లో భారత్‌లో నమోదైన డెంగ్యూ కేసులు 11 రెట్లు పెరిగినట్లు టకెడా పేర్కొంది. మార్కెట్ అనుమతులు, నియంత్రణ ప్రక్రియల అనంతరం క్వెండెంగా 2027 తొలి అర్ధభాగంలో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. క్వెండెంగా అందుబాటులోకి వస్తే, డెంగ్యూ నియంత్రణలో భారత్‌కు మరో ముఖ్యమైన నివారణ సాధనం అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. అయితే వ్యాక్సిన్‌తోపాటు దోమల నియంత్రణ, పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడడం, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలు కూడా డెంగ్యూ నివారణలో కీలకంగా కొనసాగనున్నాయి.

Advertisement
Advertisement