త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Wireless Earbuds | వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ వాడితే క్యాన్స‌ర్ వ‌స్తుందా..? డాక్ట‌ర్ వివ‌ర‌ణ‌..!

Wireless Earbuds | ఇటీవల బ్లూటూత్ ఇయర్‌బ‌డ్స్‌ వాడకంపై సోషల్ మీడియాలో భయాలు వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువసేపు వాడితే క్యాన్సర్ వస్తుంది, తల దగ్గర మైక్రోవేవ్ పెట్టుకున్నట్టే.. అంటూ వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి.

S

Lifestyle | Published On Jan 21, 2026, 7.32 am IST

Wireless Earbuds | వైర్‌లెస్ ఇయ‌ర్‌బ‌డ్స్ వాడితే క్యాన్స‌ర్ వ‌స్తుందా..? డాక్ట‌ర్ వివ‌ర‌ణ‌..!
Advertisement

Wireless Earbuds | ఇటీవల బ్లూటూత్ ఇయర్‌బ‌డ్స్‌ వాడకంపై సోషల్ మీడియాలో భయాలు వ్యాపిస్తున్నాయి. వాటిని ఎక్కువసేపు వాడితే క్యాన్సర్ వస్తుంది, తల దగ్గర మైక్రోవేవ్ పెట్టుకున్నట్టే.. అంటూ వీడియోలు, పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆఫీస్ కాల్స్ నుంచి మ్యూజిక్, సోషల్ మీడియా వరకు రోజూ గంటల తరబడి చెవుల్లో పెట్టుకునే ఈ వైర్‌లెస్ ఇయర్‌బ‌డ్స్‌ నిజంగానే ఆరోగ్యానికి ప్రమాదమా? క్యాన్సర్ ముప్పు ఉందా? అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తుతున్నాయి. ఈ అనుమానాలపై అమెరికాలోని మిషిగన్ న్యూరోసర్జరీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన న్యూరోసర్జన్ డాక్టర్ జే జగన్నాథన్ స్పష్టత ఇచ్చారు. ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేసిన వీడియోలో, ఇయ‌ర్‌బ‌డ్స్‌ వాడటం మైక్రోవేవ్ రేడియేషన్‌కు గురైనట్టేనని చెబుతున్న వైరల్ క్లిప్‌ను ఖండించారు. ఆ పోలిక పూర్తిగా తప్పుదారి పట్టించేదని ఆయన అన్నారు.

మొబైల్ ఫోన్ల కంటే త‌క్కువ‌..

బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు లేదా ఇయ‌ర్ బ‌డ్స్‌ విడుదల చేసే రేడియేషన్‌ను నాన్-అయోనైజింగ్ రేడియేషన్ గా వర్గీకరిస్తారని డాక్టర్ జగన్నాథన్ వివరించారు. ఈ రకమైన రేడియేషన్ డీఎన్‌ఏను దెబ్బతీయదని, అందువల్ల క్యాన్సర్‌కు నేరుగా కారణమవుతుందని నిర్ధారించే శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండే అయోనైజింగ్ రేడియేషన్‌తో దీనిని పోల్చడం సరికాదన్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్లూటూత్ ఇయర్‌బ‌డ్స్ నుంచి వెలువడే రేడియేషన్ స్థాయి మొబైల్ ఫోన్లతో పోలిస్తే చాలా తక్కువ. లభ్యమైన డేటా ప్రకారం, ఇయ‌ర్ బ‌డ్స్‌ వంటి పరికరాలు మొబైల్ ఫోన్ల కంటే 10 నుంచి 400 రెట్లు తక్కువ రేడియేషన్ విడుదల చేస్తాయి. మొబైల్ ఫోన్ వాడకం వల్లే క్యాన్సర్ వస్తుందని స్పష్టమైన ఆధారాలు లేనప్పుడు, ఇయర్‌బ‌డ్స్ వల్ల వచ్చే ప్రమాదం మరింత తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

క్యాన్స‌ర్ రాద‌ని తేల్చిన ఎఫ్డీఏ..

క్యాన్సర్ గురించి ప్రస్తావించే వారు ఎక్కువగా అమెరికాలోని నేషనల్ టాక్సికాలజీ ప్రోగ్రామ్ (NTP) చేసిన ఒక పరిశోధనను ఉదాహరణగా చూపుతుంటారు. ఆ అధ్యయనంలో ఎలుకలను దీర్ఘకాలం రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌కు గురిచేయగా, మగ ఎలుకల్లో కొన్ని రకాల గుండె క్యాన్సర్ కేసులు స్వల్పంగా పెరిగినట్టు గుర్తించారు. అయితే ఆడ ఎలుకల్లో అలాంటి ప్రభావం కనిపించలేదు. ఈ పరిశోధనను తరువాత అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సమీక్షించి, దీని ఆధారంగా మనుషుల్లో క్యాన్సర్ వస్తుందని తేల్చలేమని స్పష్టం చేసింది. అంతేకాదు, ఆ ప్రయోగంలో ఎలుకలకు ఇచ్చిన రేడియేషన్ మోతాదు సాధారణంగా మనం మొబైల్ ఫోన్లు లేదా ఇయర్‌బ‌డ్స్ వాడే పరిస్థితులకు భిన్నమని నిపుణులు చెబుతున్నారు.

మొత్తానికి ప్రస్తుత శాస్త్రీయ ఆధారాల ప్రకారం, బ్లూటూత్ ఇయర్‌ఫోన్లు లేదా వైర్‌లెస్ ఇయర్‌బ‌డ్స్ వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందన్న వాదనలకు బలమైన ఆధారం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారం నిజమేనని నమ్మకుండా, నమ్మకమైన వైద్య వర్గాల సూచనలను మాత్రమే ఆధారంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement