త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Earbuds | రోజూ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను అధికంగా వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!

Earbuds | స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్ర‌స్తుతం అధికంగా పెరిగిపోయింద‌న్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు ఫొటోలు తీసుకునేందుకు కెమెరాలు ఉండేవి. పాట‌ల‌ను వినేందుకు ఎంపీ3 ప్లేయర్ల‌ను వాడేవారు. బ్యాంకింగ్ లాంటి ప‌నుల కోసం కంప్యూట‌ర్ల‌లో ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ వాడేవారు.

S

Lifestyle | Published On Dec 23, 2025, 10.19 am IST

Earbuds | రోజూ ఇయ‌ర్‌బ‌డ్స్‌ను అధికంగా వాడుతున్నారా..? అయితే జాగ్ర‌త్త‌..!
Advertisement

Earbuds | స్మార్ట్ ఫోన్ల వినియోగం ప్ర‌స్తుతం అధికంగా పెరిగిపోయింద‌న్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు ఫొటోలు తీసుకునేందుకు కెమెరాలు ఉండేవి. పాట‌ల‌ను వినేందుకు ఎంపీ3 ప్లేయర్ల‌ను వాడేవారు. బ్యాంకింగ్ లాంటి ప‌నుల కోసం కంప్యూట‌ర్ల‌లో ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ వాడేవారు. కానీ ఇప్పుడు అన్ని ర‌కాల ప‌నుల‌కు ఫోన్ల‌ను ఉప‌యోగిస్తున్నారు. ఇక ఫోన్ల‌కు క‌నెక్ట్ చేసి ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్‌ను వాడే వారి సంఖ్య కూడా గ‌ణ‌నీయంగా పెరిగింది. నిత్యం ఉద‌యం నిద్ర లేచింది మొద‌లు రాత్రి మ‌ళ్లీ నిద్రించే వ‌ర‌కు చాలా మంది గంట‌ల త‌ర‌బ‌డి అధిక వాల్యూమ్‌తో ఇయ‌ర్ బ‌డ్స్‌ను ఉప‌యోగిస్తున్నారు. పాట‌ల‌ను విన‌డం, సినిమాలు లేదా రీల్స్ చూడ‌డం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాలో వీడియోల‌ను కూడా ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు. అయితే గంట‌ల త‌ర‌బ‌డి ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్ వాడ‌కం చెవుల ఆరోగ్యానికి అంత మంచిది కాద‌ని ఈఎన్‌టీ వైద్య‌ నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

వినికిడి శ‌క్తి కోల్పోయే ప్ర‌మాదం..

ఆస్ట‌ర్ వైట్ ఫీల్డ్ హాస్పిట‌ల్‌కు చెందిన ప్ర‌ముఖ ఈఎన్టీ వైద్య నిపుణుడు, హెచ్‌వోడీ డాక్ట‌ర్ జ్యోతిర్మ‌యి ఎస్ హెగ్డె ఈ విష‌యంపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ ప్ర‌స్తుతం చాలా మంది గంట‌ల త‌ర‌బ‌డి అధిక వాల్యూమ్‌తో ఇయ‌ర్ ఫోన్స్‌ను ఉప‌యోగిస్తున్నార‌ని అన్నారు. దీని వ‌ల్ల చెవుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బ తింటుంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. ఇయ‌ర్ ఫోన్స్‌ను ఎక్కువ స‌మ‌యం పాటు ఉప‌యోగించ‌డం వ‌ల్ల చెవుల‌పై తీవ్ర ఒత్తిడి ప‌డుతుంద‌ని, దీంతో చెవి అంత‌ర్భాగం దెబ్బ తిని వినికిడి శ‌క్తిని కోల్పోయే ప్ర‌మాదం ఉంటుంద‌ని తెలిపారు. ఇయ‌ర్‌ఫోన్స్‌ను అధికంగా ఉప‌యోగించ‌డం వ‌ల్ల ప‌లు ర‌కాల చెవి సంబంధ వ్యాధులు కూడా వ‌స్తాయ‌ని అంటున్నారు. దీర్ఘ‌కాలంలో దీని వ‌ల్ల చెవులు అనేక స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని తెలిపారు.

టైనైట‌స్ అనే వ్యాధి..

గంట‌ల త‌ర‌బ‌డి ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్ వినియోగం వ‌ల్ల చెవుల్లో సున్నితమైన భాగాలు దెబ్బ తింటాయి. మ‌న చెవులు 85 డెసిబ‌ల్స్ క‌న్నా ఎక్కువ శ‌బ్దాన్ని గంట‌ల త‌ర‌బ‌డి వింటే చెవుల్లోని అంత‌ర్భాగాలు దెబ్బ తిని శాశ్వ‌తంగా వినికిడి శక్తి లోపిస్తుంది. చెవుల్లోని సున్నిత‌మైన నాడులు శాశ్వ‌తంగా దెబ్బ‌తిన‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతుంది. దీంతో శాశ్వ‌తంగా చెవులు విన‌బ‌డ‌వు. అలాగే టైనైట‌స్ అనే మ‌రో వ్యాధి కూడా వ‌స్తుంది. దీని వ‌ల్ల చెవుల్లో శ‌బ్దాలు వినిపించ‌డం, ఏదో రింగ్ అయిన‌ట్లు అనిపించ‌డం, గుయ్ మ‌నే లాంటి శ‌బ్దాలు రావ‌డం జ‌రుగుతుంది. గంట‌ల త‌ర‌బ‌డి ఇయ‌ర్ ఫోన్స్‌ను వాడితే ఈ స‌మ‌స్య వ‌స్తుంది. దీని వ‌ల్ల కూడా వినికిడి శ‌క్తి త‌గ్గిపోతుంది.

అప్ర‌మ‌త్త‌త త‌గ్గుతుంది..

అధిక స‌మ‌యం పాటు ఇయ‌ర్ ఫోన్స్‌ను ఎక్కువ వాల్యూమ్‌తో ఉప‌యోగిస్తే ఆడిట‌రీ ఫాటిగ్ వ‌స్తుంద‌ని డాక్ట‌ర్ హెగ్డె తెలిపారు. దీని వ‌ల్ల కాస్త పెద్ద శ‌బ్దాల‌ను కూడా విన‌లేక‌పోతారు. అలాగే ఏదైనా అంశంపై ఏకాగ్ర‌త సారించ‌డం క‌ష్టంగా మారుతుంది. ఇక ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు ఇయ‌ర్ ఫోన్స్ లేదా ఇయ‌ర్ బ‌డ్స్‌లో నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు. దీన్ని గంట‌ల త‌ర‌బ‌డి ఉప‌యోగించ‌డం వ‌ల్ల కూడా చెవుల‌పై ఒత్తిడి ప‌డుతుంద‌ని, దీంతో చుట్టూ ప‌రిస‌రాల్లో ఏం జ‌రుగుతుందో చిన్న శ‌బ్దాల‌తో వెంట‌నే తెలుసుకునే అప్ర‌మ‌త్త‌త త‌గ్గిపోతుంద‌ని, ప‌రిస‌రాల్లో జ‌రిగే సంఘ‌ట‌న‌ల‌ను చెవుల ద్వారా గ్ర‌హించి తెలుసుకునే శ‌క్తి త‌గ్గిపోతుంద‌ని తెలిపారు. దీని వల్ల ఎల్ల‌ప్పుడూ అల‌ర్ట్‌గా ఉండ‌లేర‌ని, ముఖ్యంగా ర‌హ‌దారుల‌పై వాహ‌నాల‌ను న‌డిపే స‌మ‌యంలో చిన్న శ‌బ్దాల‌ను ప‌సిగ‌ట్ట‌లేక‌పోతార‌ని, దీని కార‌ణంగా ప్ర‌మాదాలు చోటు చేసుకునే అవ‌కాశాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించారు. అలాగే దీర్ఘ‌కాలంలో ఇయ‌ర్ ఫోన్స్‌ను అధికంగా వాడ‌డం వ‌ల్ల మెద‌డుపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని, జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంద‌ని, మెదడు ప‌నితీరు మంద‌గిస్తుంద‌ని కూడా తెలిపారు. క‌నుక వాటిని గంట‌ల త‌ర‌బ‌డి ఉప‌యోగించ‌కూడ‌ద‌ని, అది కూడా అధిక వాల్యూమ్‌తో అస‌లు వాడ‌కూడ‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement